
14 Oct 2025
Updated with Part-2 on 15 Oct 2025
Part-1
[04.02.2003] జీవుడు ఒక బురద నీటి పాత్రవలె ఉన్నాడు. పాత్ర జడ శరీరముగను నీరు శరీరములో ఉన్న శుద్ధ చైతన్యము అగు జీవుడు. ఈ జీవుడే ఆత్మ దేహి శరీరి పురుషుడు, క్షేత్రజ్ఞుడు, పరా ప్రకృతి అను శబ్దములచే చెప్పబడుచున్నాడు. ఈ బురద నీటిలో యున్న మట్టికణములే జీవస్వభావ గుణములు అగు అహంకార మాత్సర్యాదులు. ఇక ఒక సుగంధ నీటి మహా సముద్రమే ఈశ్వరుడు. ఈ సుగంధ జలములోని నీరే శుద్ధ చైతన్యము. బురద నీటిలోని శుద్ధ జలము, సుగంధ నీటిలోని శుద్ధజలము ఒకే చైతన్యమని శంకరుల సిద్ధాంతము. శంకరులు అవతరించిన సమయమున జీవులు నాస్తికులై అసలు ఈశ్వరుడు లేడు అన్నారు. అనగా బురద నీటి పాత్రలు అన్నియు సుగంధ జల సముద్రమే లేదు అనుచున్నవి. ముందు ఈ బురద పాత్రలచేత సుగంధ జలసముద్రము ఉన్నది అనిపించవలెను. దీనికి శంకరులు ఒక చిట్కా చేసినారు. ఓ బురద నీటి పాత్రా! (ఓ జీవా!) నీకును సుగంధ జలసముద్రమునకును (ఈశ్వరునకును) ఏమియు తేడా లేదు. నీలో శుద్ధజలమున్నది. సుగంధ జలసముద్రములోను శుద్ధ జలమున్నది. అనగా జీవునిలోను ఈశ్వరునిలోను శుద్ధ చైతన్యమను ఒకే జలమున్నది. కావున జీవుడే ఈశ్వరుడు. నీవు ఉన్నావు కావున, నీవు ఈశ్వరుడవు కావున ఈశ్వరుడున్నాడు గదా! బురద నీటి పాత్రలోను, సుగంధ జలసముద్రములోను ఒకే శుద్ధ జలము ఉన్నంత మాత్రమున బురద నీటి పాత్ర సుగంధ జలము ఎట్లగును? బురద నీటి పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము చాలా తక్కువ. సుగంధ జల సముద్రములోని శుద్ధ జల ప్రమాణము చాలా ఎక్కువ. మరియును బురద మట్టి కణములు (జీవగుణములు) వేరు, సుగంధ జల గుణములు (కల్యాణ గుణములు) వేరు. కావున జీవునకు ఈశ్వరునకు అద్వైతము కుదరదు.
శంకరులు:- శుద్ధ చైతన్యమగు (శుద్ధ జలము) బ్రహ్మము మాత్రమే సత్యము. బురద మట్టి కణములు, సుగంధ కణములు (గుణములు) సృష్టిలోని భాగము. సృష్టి మిథ్య. కావున మట్టికణములు, సుగంధ కణములు లేనట్లే. నీవు పాత్రలోని శుద్ధ జలము. ఈశ్వరుడు సముద్రములోని శుద్ధ జలము. కావున జీవుడవగు నీవు ఈశ్వరుడవే.
జీవుడు:- పాత్రలోని శుద్ధ జలము యొక్క ప్రమాణము కన్నా, సముద్రములోని శుద్ధజలము యొక్క ప్రమాణము చాలా ఎక్కువ. కావున రెండును శుద్ధ జలము (శుద్ధ చైతన్యము) అయిననూ ప్రమాణములో బేధముండుట చేత అద్వైతము సత్యము కాదు.
శంకరులు:- ఒక పాత్రలోని జలము తక్కువ భాగము ఖాళీ స్థలమును ఆక్రమించుచున్నది. ఒక బిందెలోని నీరు ఎక్కువ ఖాళీ స్థలమును ఆక్రమించుచున్నది. ఈ ఖాళీ స్థలమునే ఆకాశము అనుచున్నాము. ఆకాశము పంచభూతములలో ఒకటి. పంచభూతములు సృష్టిలో భాగములు. సృష్టి మిథ్య అన్నప్పుడు పంచభూతములు మిథ్య కనుక ఆకాశము (ఖాళీ స్థలము) మిథ్యయే. ఈ శుద్ధ జలము (అనగా శుద్ధ చైతన్యము అనగా బ్రహ్మము) సృష్టికి అతీతమైనది. కావున ఆకాశతత్త్వమునకు అతీతమైనది. కావున ఆకాశ తత్త్వముపై ఆధారపడిన ప్రమాణ తత్త్వము కూడ మిథ్యయే అగును. అనగా "అంత "ఇంత" అను ప్రమాణ భేదము మిథ్యయగును. కావున జీవుడన్నను, ఈశ్వరుడన్నను కేవలము శుద్ధ చైతన్యమే.
Part-2
ఈ విధముగా శంకరులు జీవుడు, ఈశ్వరుడు ఒక్కరే అని ఇరువురు బ్రహ్మమే అని వాదించి నాస్తికుని చేత ఈశ్వరుడు ఉన్నాడు బ్రహ్మము ఉన్నది అని అంగీకరింప చేసినాడు. ఇక్కడ శంకరులు కొన్ని మాయలను చేసినారు. కాని జీవుల శ్రేయస్సు కొరకు చివరలో ఒక మంచి ఫలితమును సాధించుట కొరకు మాయ మాటలు చెప్పుట తప్పు కాదు. ఇచ్చట సత్యము చెప్పుట గురుతత్త్వము కాదు. పెడత్రోవ పట్టిన జీవులను సరియైన మార్గమున మరలించుటకు అవసరమైనచో కొన్ని మాయ మాటలు చెప్పియైనను మరలించుటయే గురుతత్త్వము. సత్యమేదో నిష్కర్షగా చెప్పి వింటే వినండి లేకపోతే చావండి అని చెప్పుట గురుతత్త్వము కాదు. అవసరమైనచో సత్యమును దాచి మాయమాటలు చెప్పియైననూ శిష్యులను ఒక మెట్టు ఎక్కించుటయే గురువు యొక్క లక్ష్యమై యుండును. తల్లి పిల్లవానిచే అన్నము తినిపించునప్పుడు చందమామ రావే అని పాట పాడుచు ఈ ఒక్క ముద్ద తిన్నచో జాబిల్లి దిగివచ్చునని మాయమాటలు చెప్పును. ఇచ్చట తల్లి అసత్యమును చెప్పుట పాపము కాదు. అసత్యము చెప్పియైనను పిల్లవానిచే అన్నము తినిపించి ఉపకారము చేయుట పుణ్యమే. ధర్మ శాస్త్రములో సహితము సత్యము చెప్పుట కన్నను అహింసయే ఉత్తమ ధర్మమని చెప్పబడియున్నది. ఒక్కొక్కసారి సత్యము చెప్పుట వలన పాపము కూడా వచ్చును. ఒక సాధువును కిరాతకులు తరుముకు వచ్చుచున్నారు. ఆ సాధువు ఒక పొదలోనికి పోయి దాగుకున్నాడు. అది సత్యవ్రతుడు అని మహర్షి చూచినాడు. ఆయన సదా సత్యమునే చెప్పు వ్రతము కలవాడు. కిరాతకులు పరుగెత్తుకు వచ్చిన వ్యక్తిని గురించి సత్యవ్రతుని అడిగినారు. ఆ వ్యక్తి ఆ పొదలో దాగుకున్నాడని సత్యవ్రతుడు చెప్పినాడు. కిరాతకులు ఆ పొదలోనికి పోయి ఆ సాధువును చంపినారు. సత్యవ్రతుడు మరణించిన తర్వాత ఆయనను యమభటులు నరకమునకు తీసుకొనిపోయినారు. అప్పుడు ఆయన "నేను పాపము చేయలేదు. ఎన్నడును అసత్యము చెప్పలేదు. నన్నేల తీసుకుని వచ్చినారు?" అని యమధర్మరాజుని ప్రశ్నించినాడు. అపుడు యమధర్మరాజు "నీవు సత్యమును పలికినందుకే నరకమునకు వచ్చినావు" అన్నారు. ఏలననగా సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. ఇంత కన్నను అహింస పరమ ధర్మము. ఒక సజ్జనుడు హింసింపబడుట కన్నను సత్యము పల్కుట గొప్ప ధర్మము కాదు. కావున మాతృ వాత్సల్యము కన్న ఎక్కువ వాత్సల్యము గల గురువు అవసరమైన చోట కొన్ని మాయమాటలు చెప్పినను శిష్యులను ఉద్ధరించుటకే ప్రయత్నించును.
శంకరులు కేవలము సత్యమును స్థాపించి వాదించుటకు వచ్చిన పండితుడు కాదు. ఆయన లక్ష్యము సత్యమును స్ధాపించుట కాదు. సత్యమును చెప్పినచో నాస్తికులు ఒక్క మెట్టు కూడ ఎక్కరు. చందమామ దిగిరాడన్న సత్యమును చెప్పినచో పిల్లవాడు ఒక్క ముద్ద కూడా తినడు. అప్పుడు ఆ బాలుడు అన్నము తినక శుష్కించి మరణించును. అది హింస యగును. కావున నాస్తికులు ఒక్క మెట్టు అయిననూ పైకి ఎక్కుట కొరకు శంకరులు ఎన్నో మాయ మాటలు గురుతత్త్వమును అనుసరించి చెప్పినారు. బురద మట్టి కణములు, సుగంధ కణములు మిథ్య అన్నారు. మిథ్య అనగా అత్యల్పమైన సత్యము దాదాపు లేనట్లే అన్నారు. అనగా జగత్తు దాదాపు లేనట్లే అని అర్థము. ఇచ్చట శంకరులు చేసిన మాయ ఏమనగా జగత్తు మిథ్యయే. కాని ఎవరికి? జీవునకు కాదు. అది పరమాత్మ దృష్టిలో మిథ్య. జగత్తు పరమాత్మ యొక్క ఊహా స్వరూపము. ఒక వ్యక్తితో పోల్చి చూచినచో ఆ వ్యక్తి ఊహించు ఊహ మిథ్యయే. కాని ఊహలోని ఒక భాగమగు ఊహా స్వరూపుడగు వ్యక్తికి ఆ ఊహా ప్రపంచము సత్యమే అగుచున్నది. ఊహా లోకము నిజమైన వ్యక్తికి అసత్యము కాని ఊహా లోకములో ఒక భాగమగు ఊహ వ్యక్తికి అసత్యము కాదు. ఈ రహస్యమును బయటపెట్టనిచో నాస్తికులు ఆ మొదటి మెట్టును ఎక్కరు. కావున ఎవరి దృష్టికి మిథ్య అని పూర్తిగా చెప్పకుండా గోడ మీద పిల్లి వాటముగా జగత్తు మిథ్య, దీనితో జీవుని దృష్టిలోనే జగత్తు మిథ్య యని జీవుడు భావించినాడు. జగత్తులోని భాగములగు బురద మట్టి కణములు, సుగంధ కణములు అసత్యమే. జగత్తులోని భాగమగు ఆకాశము అసత్యము కావున ఆకాశము యొక్క గుణము పరిమాణము కావున, పరిమాణము అసత్యమే కావున చిన్న నీటి గుంటయు, పెద్ద సముద్రము ఒక్కటే అగుచున్నవి. కావున సారాంశము చిన్న బురద నీటి పాత్రయు, పెద్ద సుగంధ జలసముద్రము రెండునూ ఒక్కటే. కావున జీవుడే ఈశ్వరుడు. ఈశ్వరుడే జీవుడు. ఈశ్వరుడగు నేను ఉన్నాను అని అన్నాడు జీవుడు. అనగా ఈశ్వరుడు ఉన్నాడు అని మొదటి మెట్టు ఎక్కినాడు. ఈ విధముగా శంకరులను మనము వాత్సల్య స్వరూపుడైన గురువుగానే చూడవలయునే కాని కేవలము సత్యమును స్థాపించి తనకున్న పాండిత్యమును ప్రకటించు ఒక పండితునిగా చూడరాదు. జీవుడు బోధకుడైనచో అతడు కేవలము పండితుడు మాత్రమే అగును. ఏలననగా ఒక జీవునకు సాటి జీవులపై వాత్సల్యము ఉండదు. అతడు కేవలము తన పాండిత్యమును ప్రదర్శించి కీర్తిని పొందవలయునన్న కోర్కె కలిగి ఆత్మోద్ధరణకు మాత్రమే ప్రయత్నించును. కాని స్వామి బోధకునిగా వచ్చినపుడు ఆయనకు ఆత్మోద్ధరణము అక్కరలేదు. కీర్తితో అసలు పని లేదు. కనీసము ఒక్క జీవునియైనను ఉద్ధరించుటకు ఆయన సర్వశక్తిని ఉపయోగించును. ఆయనకు జీవులపై అపార వాత్సల్యము కలదు. కావున స్వామి బోధకుడుగా అవతరించినపుడు మాత్రమే గురువు అనవలెను. పండితులకు గురు శబ్దము వాడరాదు. పరబ్రహ్మమగు స్వామియైన దత్తుడు ఒక్కడే గురువు.
★ ★ ★ ★ ★