16 May 2025
[05.12.2003]
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియాసి మే|| 18-65
మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు |
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః || 9-34
మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్సంగ వివర్జితః |
నిర్వైర స్సర్వభూతేషు య స్సమామేతి పాణ్డవ || 11-55
మచ్చిత్త స్సర్వదుర్గాణి మత్ప్రసాదా త్తరిష్యసి |
అథ చేత్త్వ మహంకారా న్న శ్రోష్యసి వినంక్ష్యసి|| 18-58
అని భగవద్గీతలో కృష్ణుడు మాటిమాటికి ‘నన్నే’ సేవించమని బోధించాడు. "నన్నే" అనగా ఆ కృష్ణశరీరమా? కృష్ణశరీరమే అయినచో ఆ తరమున కృష్ణశరీరము ఎదురుగా యున్నది. కానీ తరువాత తరములకు కృష్ణవిగ్రహములే ఉన్నవి. ఆ మనుష్యతరమునకు చేతనమైన కృష్ణశరీరమును అందించి మిగిలిన తరములకు జడవిగ్రహములను అందించుట వలన భగవంతునికి పక్షపాతదోషము రాలేదా? ఆ కృష్ణశరీరమే పరబ్రహ్మమైనచో "నేను మనుష్యశరీరమును ఆశ్రయించుచున్నాను" అని గీతలోనే "మానుషీం తను మాశ్రితమ్" అని చెప్పుట ఎట్లు కుదురును? గాన దాని అర్థము, ఆశ్రయించబడిన మానవశరీరము వేరు, ఆశ్రయించు వాడు వేరు అనియే గదా! మరియును, నేను ప్రతియుగములో అవతరించుచున్నాను అని గీతలో
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" ||
అని కృష్ణుడు పలికెను. మరి అలా అన్నప్పుడు అదే కృష్ణశరీరము ప్రతి యుగములోను వచ్చుచున్నదా? అంటే, ఇచ్చట యుగము అనగా ‘మనుష్యతరము’ అని అర్థము. ఇది మీ యుగము అని వాడుకలో అంటారు. అనగా ఇది నీ తరము అని అర్థము. యుగము అనగా సంవత్సరమని కూడ అర్థము కలదు. అనగా ప్రతి సంవత్సరము పరమాత్మ అవతరించుచున్నాడనియే అర్థము. ఈ అవతారములు కళావతారములు, అంశావతారములు, ఆవేశావతారములుగా అనేక స్థాయిలలో వివిధ దేశములలో అనేక స్థాయిలందు ఉన్న భక్తుల కొరకు వచ్చుచుండును. ఒకే సమయమున ఒకే స్థాయిలో కూడా పెక్కు అవతారములు ఉండవచ్చును. ఉదాహరణకు శిరిడిసాయి, అక్కల్‌కోటస్వామిసమర్థ, రామకృష్ణ పరమహంస మొదలగు అవతారములు.
ప్రతి తరమునందును ఒక్క పరిపూర్ణ అవతారము కూడ యుండును. కృష్ణావతారము షోడశకళలతో కూడిన పరిపూర్ణ అవతారము. ఈ పరిపూర్ణ అవతారము దట్టమైన మాయతో కప్పబడి యుండును. ఒక కానిస్టేబుల్ కాని, ఒక ఇన్‌స్పెక్టరు గాని వచ్చినపుడు నీవు నేరుగా సమీపించవచ్చును. కాని ఐ.జీ. వచ్చినప్పుడు చుట్టునూ గట్టి సెక్యూరిటి ఉండును. ఐ.జి. వచ్చినప్పుడు చాలా కొద్ది మంది ప్రముఖులతో మాత్రమే ఆయన సంభాషించును. అట్లే పరిపూర్ణ అవతారము వచ్చినప్పుడు అందరికి సమీపించుటకు వీలు కాదు. ఆ పరిపూర్ణ అవతారము చేయు జ్ఞానబోధకు అర్హులైనట్టి అత్యుత్తమస్థాయిలో నున్న భక్తులు, వజ్రముల వలె చాలా క్రొద్దిమంది మాత్రమే యుండును. జన బాహుళ్యమునకు కళాది అవతారములు వారి స్థాయిని అనుసరించి బోధించుచుందురు. దీనినే శ్రుతి "సహస్రశీర్షా పురుషః" అని చెప్పినది. అనగా ఈ సహస్రశిరస్సులు వివిధ స్థాయిలలో వచ్చిన అవతారములే. ప్రతితరమునకు ఇట్లు అన్ని స్థాయిల అవతారములు ఉండును. కావున ప్రతితరములోను స్వామి విశ్వరూపములోనే యున్నారు. విశ్వరూపము అనగా పోలీసు డిపార్టుమెంటు వంటి వ్యవస్థ. కావున భగవద్గీతలో స్వామి చెప్పిన "నన్నే, నేనే" అను పదములు ప్రతి తరమునకు నీకు అందివచ్చిన నరావతారములే. నీ స్థాయిని పరీక్షించి, నీ స్థాయికి సరిపోయిన అవతారమే నిన్ను సమీపించును. అంతే కాని అవతారముల నన్నింటిని నీవు పరీక్షించి నీ స్థాయికి తగిన అవతారమును నీవు ఎన్నుకొనలేవు.
★ ★ ★ ★ ★