home
Shri Datta Swami

 04 Dec 2025

 

వర్తమాన అష్టమ దత్తావతారులు

[24.02.2005, తారణనామ సంవత్సరము, మాఘ శుక్ల పూర్ణిమ, గురువారము] వర్తమాన అష్టమ దత్తావతారులు శ్రీదత్తస్వామి వారి జన్మదినోత్సవ సందర్భమున ఇందిరాటవర్సులో నేను, నాశ్రీమతి, కుమారుడు భాస్కరుతో కలసి శ్రీదత్తస్వామి వారి దర్శనము చేసుకొన్నాము. స్వామి హస్తమస్తకసంయోగము చేసి ఆశీర్వదించారు. శ్రీదత్తదివ్యవాణిని స్వామి ఇలా వినిపించారు – “నాయనలారా! శ్రద్ధగా వినండి. ఇప్పటికి శ్రీదత్తభగవానుడు మూడు పరిపూర్ణ దత్తావతారములలో అవతరించారు.

i) శ్రీబ్రహ్మదేవుడే వశిష్ఠునిగా అవతరించి జ్ఞానవాశిష్ట గ్రంథమును అందించారు.

ii) శ్రీవిష్ణుదేవుడే శ్రీకృష్ణభగవానునిగా అవతరించి శ్రీమద్భగవద్గీతను అందించారు.

iii) శ్రీశివదేవుడే ఆదిశంకరులుగా అవతరించి ‘అహం బ్రహ్మాస్మి’ అని అద్వైతబోధను అందించారు.

iv) శ్రీదత్తభగవానుడు నాల్గవ పరిపూర్ణ దత్తావతారమై శ్రీదత్తస్వామిగా అవతరించారు.

శ్రీదత్తుడు వశిష్ఠ, శ్రీకృష్ణ, ఆదిశంకరుల యొక్క మనుష్యశరీరములను ఆనాడు ఆవహించినారు. ఈనాడు శ్రీవేణుగోపాల కృష్ణమూర్తి శరీరమును ఆవహించినారు. వశిష్ఠునిలో బ్రహ్మ, శ్రీకృష్ణునిలో విష్ణువు, ఆదిశంకరులలో శివుడు మాత్రమే ప్రధానంగా వచ్చారు. కాని, ఈనాడు శ్రీవేణుగోపాలకృష్ణమూర్తి శరీరములో త్రిమూర్తుల రూపములో ఆవహించి పరిపూర్ణ జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈనాడు పూర్ణిమ, గురువారము, స్వామివారి జన్మదినము - ఈ మూడు కలసి రావటం విశేషము. కనుక నేను మీ అందరికి ఈ సత్యాన్ని వెల్లడిస్తున్నాను. వేణుగోపాలకృష్ణమూర్తి శరీరము గృహం వంటిది మాత్రమే. అందు నుండి మాట్లాడేది శ్రీదత్తభగవానుడే పరిపూర్ణ దత్తావతారుడు కనుక నేను మాట్లాడు ప్రతి వాక్యము సత్యము.

ఆరాధనలు రెండు రకములు. i) ప్రతీకారాధన, ii) సాక్షాదారాధన. నన్ను ప్రతీకగా భావించి ఆరాధిస్తే అది ప్రతీకారాధన అవుతుంది. అలా కాక నన్ను సాక్షాత్తు దత్తునిగా ఆరాధిస్తే అది సాక్షాదారాధన అవుతుంది. మీ ఆరాధన ఏది అన్నది మీమీ భావనలను బట్టి ఉంటుంది. ప్రతీకారాధన అయితే దానికి తగ్గ ఫలితం లభిస్తుంది. సాక్షాదారాధన అయితే సాక్షాత్‌ బ్రహ్మలోకమే సిద్ధిస్తుంది. ఈనాడు ఈ ముఖ్యమైన సమయమున (పూర్ణిమ), గురువారం జన్మదినము కలసి వచ్చిన ఈ తరుణమున, మీ అందరిని నేను బ్రహ్మలోకమునకు చేరుస్తానని మాట ఇస్తున్నాను. మీరందరు చాలా అదృష్టదంతులు.

Swami

భక్తులు అందరు గొర్రెలనుకొండి. వానిని కాపాడే పరమాత్మయే గొర్రెలకాపరి. ‘దారేషణ,’ ‘పుత్రేషణ,’ ‘ధనేషణ’ అనే తోడేళ్ళ నుండి గొర్రెలను కాపాడాలి కదా. ఇప్పటికే కొన్ని గొర్రెలు వెళ్ళి పోయాయి. ఇక మిగిలిన ఈ కొద్దిపాటి గొర్రెలను కాపాడుకొవటానికే నాలుగు అస్త్రములను ప్రయోగించాను. ఆ అస్త్రాలే i) బ్రహ్మాస్త్రము, ii) సుదర్శనాస్త్రము, iii) పాశుపతాస్త్రము మరియు  iv) కాలభైరవాస్త్రము. బాలకృష్ణమార్తిగారి ఇంట్లో విష్ణుదత్తుడు గదా, అందుకే వారి ఇంట సుదర్శనాస్త్రము చేరినది. ఇక్కడ సత్వగుణము ప్రధానము. అందుకే గ్రంథములను పఠించి, ఎప్పుడూ వ్రాస్తూ ఉంటాడాయన. అజయ్‌ గారి ఇంట్లో బ్రహ్మదత్తులు గదా, అందుకే అంతా మార్కెటింగు అంటూ తిరుగుతూ ఉంటాడాయన. ఇక్కడ రజోగుణము ప్రధానము గదా. భీమశంకరంగారి యింట్లో శివదత్తులు గద. ఇక్కడ తమోగుణము ప్రధానము. భీమశంకరంగారు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. నాకు కూడా వాళ్ళింటిలో నిద్ర వస్తూ ఉంటుంది. అయితే, ఎల్లప్పుడూ ఒక్క సత్వగుణము చాలదు, రజోగుణము, తమోగుణము కూడా ఉండాలి. సత్వగుణము వల్ల జ్ఞానము, రజోగుణము వల్ల కర్మ, తమోగుణము వల్ల పట్టుదల కలుగును. జ్ఞానము పొంది పట్టుదలతో కర్మసంన్యాసము, కర్మఫలత్యాగములను చేయాలి. మీరు ప్రతి గురువారము తప్పక వచ్చి దర్శనం చేసుకోండి. కనీసం ప్రతి పూర్ణిమనాడన్నా తప్పక దర్శనానికి రండి. దానికోసరం సంవత్సరం చేయకండి అని ఆదేశించారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch