25 Apr 2025
[13-04-2004] చైతన్య స్వరూపమగు మాయాశక్తి నుండి సమస్త విశ్వము (whole universe) పరిణామము (modification) గా ఉద్భవించినది. ఈ చైతన్యము నుండియే చైతన్య భిన్నమైన (different from awareness) జడము (inert)లు కూడా మాయ యొక్క విచిత్రతత్త్వము (wonderful nature) వలన ఉద్భవించినవి. ఈ జడములతో సహా విశ్వమంతయు లయమైనపుడు కేవల చైతన్యమే మిగులును. ఇది అద్వైతస్థితి (state of Monism). కాని ఇట్టి అద్వైతస్థితి నిజముగ జరుగకుండా ఈ సృష్టి ఉన్నంతకాలము అద్వైతస్థితిని గురించి మాట్లాడ ప్రయోజనమేమి? నీరు నుండి మంచుగడ్డ వచ్చినది. మంచుగడ్డను అమ్ముచున్నాడు. ఈ మంచుగడ్డ (Ice) అంతయు నీరే కదా, అని మంచుగడ్డను ఉచితముగా ఇమ్మంటే ఇస్తాడా? ఆ మంచుగడ్డ నిజముగా కరిగి నీరు అయినపుడు ఆ నీటిని మనము ఉచితముగా తీసుకొనవచ్చును. లేదా ఉచితముగా బావి నుండి పొందగలము. కావున సృష్టి ఉన్న స్థితిలో అద్వైతము కేవలము జ్ఞానరూపమైన భావాత్మకమే తప్ప ఆచరణ సాధ్యము కాదు. మంచుగడ్డ నీరే. మంచుగడ్డలో స్నానము చేసి ఈత కొట్టగలవా? నీటిలో చేపలు ఉన్నవి. మంచుగడ్డలో చేపలు లేవు. మొత్తము మంచుగడ్డలో చిన్న మంచుపలుకు నీరుగా మారిననూ చూట్టూ ఉన్న మంచుగడ్డ అట్లే ఉన్నది. ఆ ఒక్క నీటి బిందువుతో ఏమియును చేయలేవు.
కావున నీవు చైతన్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నంత మాత్రమున సర్వవిశ్వము చైతన్యము కాలేదు. అట్టి స్థితిలో దేహధ్యాస మరియు సంసార బంధములు నశించును కావున శాంతితో తృప్తిగా జీవించగలవు. ఇంతమాత్రము చేత నీ పాపపుణ్యముల లెక్క నశించలేదు. లోకములో వాటి వ్యవస్థయు అదృశ్యము కాలేదు. కావున వాటి ఫలములు తప్పవు. అప్పుడు కూడా నీవు ఆత్మస్థితిలోనే ఉన్నచో ఒక బండవిద్యార్థి స్థితిలో ఉందువు. కావున ఈ లోకమున శాంతి కొరకు ఆత్మజ్ఞానము అవసరమే కాని అదియే చివరి స్థితి కాదు. ఈశ్వరుని గుర్తించి ఆయన సేవకుడవై కర్మభోగ స్వరూపమైన ఈ సంసారచక్రమును తప్పించుకొను ఈశ్వరానుగ్రహప్రాప్తియే చిట్టచివరి స్థితి. ఆత్మజ్ఞానము ద్వారా ఆత్మప్రాప్తి అనుకొనుచూ ‘అహం బ్రహ్మాస్మి’ అని పలికిన మధ్యమజీవికి కరిగిన సీసము త్రాగిన ‘శివః కేవలోఽహమ్’ అన్న ఈశ్వరుని యొక్క అనుగ్రహప్రాప్తియే చిట్టచివరి మజిలీ లేక మెట్టు.
సారాంశము:
i) ఈ లోకమున శాంతి కొరకు ఆత్మజ్ఞానము అవసరమే కాని అది సాధనలో చివరిస్థితి కాదు.
ii) ఈశ్వరుని గుర్తించి ఆయన సేవకుడవై కర్మభోగ స్వరూపమైన ఈ సంసారచక్రమును తప్పించుకొను ఈశ్వరానుగ్రహ ప్రాప్తియే చిట్టచివరి స్థితి.
★ ★ ★ ★ ★