home
Shri Datta Swami

 Posted on 03 Dec 2024. Share

కోరికలకోసం ప్రయత్నిస్తే అవి అందవు

[12.04.2005, శ్రీదత్తప్రభువుల దత్తవాణి. పార్థివ నామ సం|| చైత్ర శుద్ధ చవితి - మంగళవారం - సా|| 3-30 గంటల సమయం]

దేనికోసమూ ఆరాటపడరాదు. ఎప్పుడూ ఆశ పడరాదు. దేనినీ ఆశ పడరాదు. ఆశ పడితే అది వెనుకకుపోతుంది. రాజ్యం పాండురాజుది. ఆయన వేటకు వెళ్తూ ధృతరాష్ట్రుని రాజప్రతినిధిగా కూర్చోపెట్టి వెళ్ళినాడు. అప్పటి నుండి ఆ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు పరిపాలించడం మొదలుపెట్టినాడు. పాండవులనే అరణ్యానికి పంపినాడు. తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజుకు రాజ్యకాంక్ష లేకుండా రాజ్యం వీళ్ళదైనప్పటికి కాంక్ష లేక ఐదు ఊళ్ళు అడిగినాడు. అర్జునుడైతే అసలు ఏమీ అక్కరలేదన్నాడు. యుద్ధం చేయను అన్నాడు. ఎప్పుడైతే వీళ్ళు రాజ్యకాంక్ష లేకుండా ఉన్నారో, పరమాత్మ వీళ్ళ వైపు నిలబడే రాజ్యం అంతా ఇప్పించినారు. అదే, ధృతరాష్ట్రుడు రాజ్యం ఆయనది కాకపోయినా ఆశ చేత రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. సూదిమోపు భూమి కూడా ఇవ్వనన్నాడు. ఏం జరిగింది? రాజ్యం కోల్పోయినాడు. తను, తనవారంతా సర్వనాశనం అయినారు. సూర్యుని అభిముఖంగా నడిచావనుకో నీడ నీ వెంట వస్తుంది. అలాకాక నీడవైపుకే నడిచావనుకో నీడ నీకు అందక దూరం దూరంగా పోతుంది. అట్లే నీవు కోరికలకోసం ప్రయత్నిస్తే అవి అందవు. కోరికలు వదలి భగవంతునివైపు నడిస్తే అవే నీవెంట పడతాయి అన్నారు స్వామి.

Swami

స్వామీ! మేము ఇక్కడ 4.30 నుండి 7.30 వరకు మీరు అనుగ్రహించిన జ్ఞానబోధను చెప్పుకుంటున్నాము. ఇందులో కొన్ని కొన్ని సందేహాలు వస్తున్నాయి వినే వాళ్ళకు అన్నాను. వాటిని వ్రాసుకొని నన్ను అడగండి నేను విపులీకరిస్తాను అన్నారు స్వామి. స్వామీ, మీరు సాక్షాత్తు శ్రీదత్తప్రభువే అన్న మా విశ్వాసం సడలనీయవద్దు అని ప్రార్థించాము. స్వామి అలాగే అని "తథాస్తు" అని దీవించారు. మేము ధన్యులము.

ఇక్కడ ఒక ముఖ్య విషయమున్నది. i) భగవత్స్వరూపము. ii) శ్రీగురుదత్తస్వరూపము

i) మొదటిది: శ్రీదత్తభగవానుని కాషాయ, పీతాంబరధారిగా పాదుకలను ధరించి కుక్కలతో, గోవుతో, త్రిముఖ షడ్భుజములతో ఉన్నవానిగా భావించి పూజించుట భగవత్స్వరూపము. దత్తుడు ఉన్నాడని తెలుసుకొనుటయే భగవత్స్వరూపము. సాధనాజ్ఞానము లేనివారలు కేవలలక్ష్యమునే చింతించుచుండినచో వారు ప్రయాణమార్గమును ఆలోచించని వారలే అగుచున్నారు.

రెండవది: శ్రీగురుదత్త స్వరూపము. దీని ద్వారా ప్రయాణించువాడే దత్తుని చేరగలడు ఈ రెంటికి తేడా ఏమిటి అనగా - దత్తుడు ఉన్నాడని తెలుసుకొనుటయే భగవత్స్వరూపము. దత్తుని ఎట్లు చేరవలయునో తెలుపునది గురుస్వరూపము.

ii) నాస్తికులను ఆస్తికులుగా మార్చుట భగవత్స్వరూపము. ఆస్తికుని భగవంతుని వద్దకు చేర్చునది గురుస్వరూపము. కనుక భగవత్స్వరూపమును ఆరాధించుచు స్వామి యొక్క గురుస్వరూపము ద్వారా ప్రయాణించువాడే దత్తుని చేరగలడు. ఐతే సాధకుడు ఎట్లు తరించును? సాధకుడు భగవంతుడైన దత్తుని, గురుదత్త స్వరూపమున స్వీకరించిన తరించును.

iii) భగవత్స్వరూపము మహిమలను, అష్టసిద్ధులను ప్రదర్శించి నాస్తికులకు, సంశయాత్మకులకు మాత్రమే పరిమితమైయున్నది. భగవంతుడున్నాడని నిశ్చయజ్ఞానము కలిగిన సాధకులకు ఇట్టి మహిమల ప్రదర్శనము ఇక అవసరము లేదు. గురుస్వరూపము భగవంతుని చేరు మార్గము, సాధన, జ్ఞానరహస్యములను బోధించును. ఇట్లు సాధకుడు గురుస్వరూపము యొక్క ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరము ఎంతో ఉన్నది.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via