
11 Oct 2025
Updated with Part-3 on 13 Oct 2025
Part-1
రామావతారమున కౌసల్యాగర్భమున చేతనమైన శరీరపిండము ఏర్పడినది. ఈ శరీరపిండములో అనేక జన్మ సంస్కార వాసనా రూపమైన విశిష్టజీవుడు లేడు. కేవలము సామాన్య చైతన్యమైన జీవస్వరూపము ఉన్నది. ఈ సామాన్యచైతన్యము సామాన్య జీవస్వరూపమే అనవచ్చునే తప్ప విశిష్టచైతన్య స్వరూపమనరాదు. ఈ సామాన్య చైతన్య స్వరూపములో కేవలము చైతన్యము ఎట్టి మలినములు లేని శుద్ధ జలము వలె నుండును. దీనిలో జీవుని యొక్క పూర్వకర్మ వాసనా గుణములు ఉండవు. ఈ చైతన్యములో కేవలము వంశలక్షణములు మాత్రమే ఉండును. ఈ సామాన్య చైతన్యము శుక్రము-రేతస్సు యొక్క సంయోగము చేత ఏర్పడు గర్భస్థ శిశుపిండములో ఉండును.

బ్రహ్మసూత్రములలో శ్రుతిప్రమాణముగా రేతస్సు ద్వారా జీవుడు పిండము లోనికి ప్రవేశించుచున్నట్లు చెప్పబడుచున్నది. కాని కొందరు యోగిశ్రేష్ఠులు మూడవమాసమున గర్భస్థ శిశుపిండమునందు జీవుడు ప్రవేశించుచున్నాడని చెప్పుచున్నారు. ఈ ప్రవేశించు జీవుడు పూర్వకర్మ వాసనా జీవరాశి యగు విశిష్టజీవుడు. ఈ విశిష్టజీవుడు పై లోకములలో పుణ్య పాప కర్మల ఫలములను అనుభవించి కర్మశేషముతో అనగా కొంచెము మిగిలిన పాపము పుణ్యములతో ఈ లోకమునకు వాయుమండల మేఘమండలముల ద్వారా, వర్షము ద్వారా భూమిలోకి ప్రవేశించి, మొక్క ద్వారా దాని గింజల ద్వారా పురుషుని రేతస్సు ద్వారా స్త్రీగర్భములోనికి ప్రవేశించుటయో లేక మూడవమాసమున ఆ ధాన్యపు గింజను భుజించిన గర్భవతి యగు స్త్రీగర్భము లోనికి ప్రవేశించుటయో జరుగుచున్నది.
ఏ మతమైనను మొత్తము మీద విశిష్టజీవుడు గర్భస్థ శిశుపిండములోనికి ప్రవేశించుచున్నాడు. అయితే ఈ విశిష్టజీవుడు ప్రవేశించకముందు ఆ శిశుపిండము అచేతనమైన శరీరముతోను కేవలము వంశలక్షణములు గల శుద్ధ చైతన్యమయమైన సామాన్యజీవునితోను కలసియున్నది. ఈ సామాన్యజీవస్వరూపమే విజ్ఞానశాస్త్రవేత్తలకు అందుచున్నది.
విశిష్ట జీవస్వరూపమును ఏ మానవుడు దర్శించజాలడు అని గీతలో ఇట్లు చెప్పబడుచున్నది. "ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్, విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుషః". అనగా, దీని అర్థము ఈ విశిష్టజీవుడు గర్భములోనికి ప్రవేశించుచున్నప్పుడు గానీ, శరీరము వదలి పోవుచున్నప్పుడు గానీ, కర్మఫల వాసనా గుణ స్వరూపుడైన ఈ జీవుని ఇతరజీవులు యెవ్వరునూ ఎట్టి ప్రయత్నము చేతనూ చూడలేరు. కేవలము యోగీశ్వరుని యొక్క యోగదృష్టికే కనపడును.
కావున విజ్ఞాన శాస్త్రవేత్తలు పిండములో చూచుచున్నది వంశలక్షణములకు సంబంధించిన జీన్స్ కల సామాన్య జీవస్వరూపమే. కావున నేటి జీన్స్ సిద్ధాంతము ప్రకారము విజ్ఞాన శాస్త్రవేత్తలు మార్చగలిగినది కేవలము వంశానుగతములైన గుణములు మాత్రమే. పూర్వ కర్మ వాసనా గుణ స్వరూపుడైన జీవుడు కనిపించడు కావున ఆ పూర్వ జన్మ కర్మ వాసనా గుణములు కూడా మానవుల భౌతికదృష్టికి గోచరించవు. కావున విశిష్టజీవుని యొక్క గుణములను మానవుడు మార్చుట అసంభవము. ఈ సామాన్య జీవస్వరూపములో కూడా కేవలము వంశానుగత గుణములు మాత్రమే మానవుడు మార్చగలడే తప్ప ఆ గుణములకు ఆధారమైన శుద్ధచైతన్యమును సృష్టించలేకున్నారు. అచేతనములగు పదార్థముల నుండి చైతన్యమును మీరు సృష్టించగలరా? మృత కళేబరములో చైతన్యము తెప్పించగలరా?
Part-2
ప్రశ్న: "మేము విశిష్టజీవుని అంగీకరించము. కనపడని దానిని ఒప్పుకొనము. కావున సామాన్యజీవుని మాత్రమే అంగీకరించెదము".
స్వామి సమాధానము: "సరే అట్లే కానిండు. సామాన్య జీవస్వరూపమైన చైతన్యమును మీరు ఏల సృష్టించలేకున్నారు? Cloning అను ప్రక్రియలో చేతనమైన పదార్థము నుండి చైతన్యమయమైన జీవుని సృష్టించగలరే తప్ప అదే చేతన పదార్థములోని మూలకముల యొక్క పరమాణువులన్నింటినీ అనగా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు మూలకములైన పదార్థములను మీకు ఇచ్చెదము. వాటి నుండి జీవసృష్టిని చేయగలరా? అనగా మీకు జీవ కణములోని మూలకముల పరమాణువులన్నియునూ తెలియును. ఆ పరమాణువులను కలిపి ఆ జీవకణములలో నున్న సమ్మేళనములనన్నింటినీ తయారు చేయగలరు. ఆ సమ్మేళనములు తప్ప జీవకణములో మరియొకటి లేదని మీరు అనుచున్నారు. ఇదే నిజమైనచో ఆ సమ్మేళనములతో మీరు ఏల సృష్టించలేకున్నారు?
మీకు టి.వి. ఇచ్చినాము. టి.వి.ని విడదీసి దానిలోని భాగములన్నింటినీ మీరు పరిశిలించినారు. పని చేయుచున్న టి.వి.లో విద్యుత్తు కూడా ఒక భాగమే. మీరు టి.వి. భాగములను విడివిడిగా ద్రవ్యపదార్థముల నుండి తయారు చేయగలుగుచున్నారు. మరియు టి.వి.ని పని చేయించగలరు. విద్యుత్‌ని గూడా నీటి నుండియో, బొగ్గు నుండియో, అణు reactors నుండియో సృష్టించ గలుగుచున్నారు. కావున టి.వి. భాగముల నన్నింటినీ విద్యుత్తుతో సహ సృష్టించి మరల వాటి సమావేశపరచినప్పుడు టి.వి. పని చేయుచున్నది.
జీవకణములో అన్ని సమ్మేళనములనూ సృష్టించి మీరు సృష్టించిన జీవకణమును పని చేయించగలుగు శక్తియగు చైతన్యమును మీరేల సృష్టించలేకున్నారు? విద్యుత్తు మీకు గోచరించినది గాన మీరు సృష్టించగలిగినారు. ఈ చైతన్యమే జీవుడు అందురు. ఈ జీవుడు ఏ మానవునకునూ గోచరించడు కేవలము యోగీశ్వరుని దృష్టికే గోచరించును అని గీతా శ్లోకము ఇదియే చెప్పుచున్నది.
[ప్రశ్న: మేము జీవ సృష్టిని చేయలేము. అంగీకరింతుము. కాని జీవకణములలో నున్న డి.ఎన్.ఎ., అర్.ఎన్.ఎ. అణువులను సృష్టంచి ఒక జీవునిలో దుర్గుణములు లేకుండా చేసి, ఆ జీవుడు కేవలము సత్కర్మలే చేయునట్లు మేము చేయగలము. బుద్ధి యొక్క గుణములను అనుసరించియే కర్మలు చేయుట జరుగును. కావున ఒక మానవుడు జన్మించినపుడు వానిలో నున్న పుణ్యకర్మ శేషము వాని చేత పుణ్యకర్మలను వానిలోని పాపకర్మ శేషములు వానిచేత పాపకర్మలను చేయించును అన్న మీ కర్మ సిద్ధాంతమునకు వ్యతిరేకము చేయగలము. అనగా వానిలో కృత్రిమ జీన్స్ ద్వారా దుర్గుణములు తొలగించి అన్నీ సద్గుణములే ఉండునట్లు చేయగలము. అప్పుడు వాడు కేవలము పుణ్యకర్మలనే చేయును. కావున మీ కర్మ సిద్ధాంతమునకు భంగము కలుగును.]
స్వామి సమాధానము:- మీకు కనిపించని చైతన్యము అగు విశిష్టజీవస్వరూపము మీరు తయారు చేయలేక పోయినను, ఉన్నది అని మీరు అంగీకరించినారు కదా. మీరు సామాన్యజీవస్వరూపములో నున్న జీవస్వరూపమును మార్చగలరే కాని మీరు తయారు చేయలేని, ఉన్నది అని మీరు అంగీకరించక తప్పని, విశిష్ట జీవస్వరూపములలోని దుర్గుణములు మీరు ఎట్లు మార్చగలరు? ఒకవేళ మీరు సామాన్యజీవునిలో అన్ని సద్గుణములు ప్రవేశింపజేసి ఈ భూలోకమున వాని చేత సత్కర్మలే చేయించినారు అనుకొనుడు. ఇట్లు చేయించుటకు మీరు జీన్స్ ను మార్చనక్కరలేదు. ఒక మానవుని వెంట అహోరాత్రములు పోలీసులు కాపలా ఉంచి వాడు ఎట్టి దుష్కర్మలను కూడా చేయించకుండా ఉండవచ్చును కదా?
ఎట్లు అయిననూ, వాని చేత జీవితకాలమంతయు సత్కర్మలనే చేయించావనుకో. ఈ సత్కర్మలన్నియునూ మా విశిష్ట జీవస్వరూపముల సద్గుణముల యొక్క ప్రభావమే. ఇక విశిష్ట జీవస్వరూపములలో నున్న దుర్గుణముల ప్రభావముల చేత దుష్కర్మలను వాడు ఈ కర్మలోకమగు భూలోకమున చేయలేదు కదా. మరణించిన తర్వాత పై భోగలోకములలో ఫలముల అనుభవముండునే తప్ప కర్మ ఉండదు కదా. మరి విశిష్టజీవస్వరూపములో పాత కర్మశేషము ఉన్నవన్నారు కదా. అనగా దుర్గుణములున్నవి కదా? కావున దుష్కర్మలను చేయవలెను కదా. దానిని మేము చేయనీయలేదు, కావున కర్మ సిద్ధాంతము భంగమైనదా?
మానవజన్మ మిశ్రమ కర్మఫలస్వరూపము. అనగా సద్గుణ దుర్గుణ శేష స్వరూపమైన జీవుడే మానవజన్మను ఎత్తును. కేవల సద్గుణ స్వరూపుడు దేవజన్మలనెత్తును. కేవల దుర్గుణ శేషస్వరూపుడు రాక్షసజన్మలనెత్తును. విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రయోగములు కేవలము మానవుని పైనే జరుగుచున్నవి. దీనికి సమాధానమే కర్మలోకమగు భూలోకము నాలుగు అవాంతర లోకములుగా విజభింపబడి ఉన్నది. క్రింద మొదటి అవాంతర లోకము మర్త్యలోకము. దీని పైనున్న అవాంతర లోకములు వరుసగా ప్రేత, నరక, పితృ అవాంతర లోకములు.
మరణించగనే మానవుడు ప్రేతలోకమున కేగుచున్నాడు. ఈ లోకములో మానవుని కర్మల విచారణ జరుగును. పాపకర్మలకు నరకలోకము, మధ్యకర్మలకు పితృలోకము, ఉత్తమకర్మలకు భూలోకమునకు పైనున్న జ్యోతిర్లోక, స్వర్గలోకములు లభించుచున్నవి. ఇచ్చట కర్మలోకము అనగా భూలోకము యొక్క మొదటి అవాంతర లోకమగు కేవలము మర్త్యలోకమే. ఈ మర్త్యలోకమున మాత్రమే కర్మ చేయవీలగును.
మీరు పొరపాటుబడినది ఎచ్చట అనగా మానవుడు మరణించగానే ప్రేతరూపమును ధరించుట సత్యమే కాని పదియవ దినమున "ఇతః పరం ప్రేతశబ్దో నాస్తి" అని అన్నప్పుడు ఆ ప్రేతరూపుడు వెంటనే కర్మలోకమగు మర్త్యలోకమును దాటి ప్రేతలోకమునకు పోనవసరము లేదు. ఆ జీవుడు ప్రేతరూపముతోనే మర్త్యలోకమున అనగా కర్మలోకమున ఉండవచ్చును. కావున ఈ కర్మలోకముననే ప్రేతస్వరూపుడైన పిశాచరూపము వానిలోనున్న దుర్గుణముల ప్రేరణ చేత దుష్కర్మములనే చేయును.
కావున జీవుడు మిశ్రమ గుణస్వరూపుడై సత్కర్మములనూ దుష్కర్మములనూ ఈ లోకముననే చేసి భోగలోకములకు పోవును. కావున మీ జీన్స్ సిద్ధాంతము మానవుడు బ్రతికి ఉన్నంత వరకే తప్ప మానవ దేహము దహనమయిన తరువాత పిశాచరూపమున పనిచేయదు.
Part-3
పిశాచములు ఉన్నట్లు ప్రామాణ్యము అనేక దేశములలో నిరూపితమగుచున్నది గదా! కావున విజ్ఞాన శాస్త్రవేత్తలు దైవశాసన నియమితమైన కర్మ సిద్ధాంతమును భంగము చేయజాలరు.
ఇప్పుడు అసలు ప్రకరణములోకి వచ్చెదము గాక. అవతరించిన రామునిలో అచేతనమైన శరీరము ఉన్నది. పూర్వకర్మ వాసనలు అను మలినములు లేని శుద్ధజల సమానమైన శుద్ధచైతన్య స్వరూపమైన గర్భస్థ శిశు పిండ ఆవిర్భావ సమయముననే ఏర్పడిన సామాన్య జీవస్వరూపము ఉన్నది. ఇట్లు శరీరమను ప్రకృతియు సామాన్యజీవుడను పురుషుడునూ ఉన్నారు. ఈ రెండింటిలోనికి పురుషోత్తముడైన పరమాత్మ ప్రవేశించి, వ్యాపించి ఉన్నారు. ఇట్లు ప్రకృతి, జీవ, ఈశ్వరతత్త్వములు మూడునూ ఉన్నవి. ఇచ్చట పూర్వకర్మ వాననా స్వరూపమైన విశిష్టజీవుడు లేడు.
కొందరి మతమున గుణరహితమైన ఈ శుద్ధచైతన్యము ప్రకృతి లోనికే ‘చేతన’ అనుపేరున చేరుతున్నది. దీనిని ‘పరాప్రకృతి’ అనుచున్నారు. "సంఘాతః చేతనా ధృతిః" అను గీతాశ్లోకము ప్రకారముగా చేతన ప్రకృతిరూపములలోనే చేరుచున్నది. అప్పుడు శరీరమూ, చేతనయూ కలసి ‘ప్రకృతి’ అనబడుచున్నది. అప్పుడు పురుషోత్తముడగు పరమాత్మయే ‘పురుషుడ’నబడుచున్నాడు. ఈ మతము ప్రకారముగా రామావతారము ప్రకృతి, పురుషమిళితమై రెండు తత్త్వములతోనే ఉన్నది.
ఇక రామావతారము కన్నా భిన్నమైన ఒక మానవుని గూర్చి విచారించెదము. గర్భస్థ శిశుపిండములో అచేతనమైన శరీరమున్నది. సామాన్యజీవుడనబడు చేతనయూ ఉన్నది. పూర్వకర్మ వాసనా గుణ స్వరూపుడగు విశిష్టజీవుడూ ఉన్నాడు. సామాన్యజీవుని విశిష్టజీవునితో చేర్చి, జీవుడన్నచో శరీరమను ప్రకృతి, జీవుడనబడు పురుషుడూ ఉన్నారు. సామాన్యజీవుని ‘చేతన’యను పేరుతో ప్రకృతిలోకి చేర్చినను ప్రకృతి పురుషులే ఉన్నారే.
కావున సరిగా విచారణ చేయలేని వారు సామాన్య మానవునిలోను రామావతారములోను ప్రకృతి పురుషులిరువురే ఉన్నారని భావించుచున్నారు. కానీ విచారణ చేసినచో రామావతారములో ఉన్న తత్త్వములు ప్రకృతి పురుషులను రెండే అయినప్పటికిన్ని ఆ రెండింటి యొక్క స్వరూపములు వేరుగా ఉన్నవి. రామావతారములో ఉన్నవి ఒకటి శరీరము, రెండు శుద్ధచైతన్యమైన సామాన్య జీవుడు, మూడు పరమాత్మ.
సామాన్యమానవునిలో ఉన్నవి ఒకటి శరీరము, రెండు శుద్ధ చైతన్యమైన సామాన్యజీవుడు, మూడు కర్మశేషగుణమైన విశిష్ట జీవుడు. మరల అక్కడా మూడే, ఇక్కడా మూడే కనుక సమానమనరాదు. కాని అక్కడున్న మూడు వేరు. ఇక్కడున్న మూడు వేరు. కాకపోయినచో ఒకటి శరీరము, రెండు శుద్ధ చైతన్యమైన సామాన్యజీవుడు ఇరువురిలో సమానముగా ఉన్నారు. కాని సామాన్యమానవునిలో కర్మశేష స్వరూపుడైన జీవుడు ఉన్నాడు. రామునిలో ఆ విశిష్టజీవునికి బదులు పరమాత్మ ఉన్నాడు.
కావున ప్రకృతి, పురుష, పురుషోత్తమ శబ్దముల యొక్క అర్థములను సంకలీకృతము చేసి జీవునిలోను ఈశ్వరునిలోను అభేదములు శబ్దార్థముల నృత్యము చేత ఊహాత్మకముగా సాగించి అద్వైత పండితులు జీవుడే దేవుడనుచున్నారు. శంకర భాష్యమును అపార్థము చేసినారు. శంకరులు చెప్పిన అద్వైతము కేవలము అవతార పురుషుని విషయములోనే. భాష్యమును అపార్థము చేసుకొని "నేను దేవుడనే" అని భావించుచున్న శిష్యులను మరల భాష్యము చెప్పి శంకరులు దిద్దదలచుకొనలేదు. ఏలననగా మరల రెండవ భాష్యమును అపార్థము చేసుకొనుదురు.
కావున అపార్థము రాకుండా ఉండుటకు ఒక క్రియ ద్వారా బోధను చేసినాడు. ప్రతి జీవుడూ బ్రహ్మమే కావున తాము బ్రహ్మమే అని భావించుచున్న శిష్యులను కరిగిన సీసమును తాను త్రాగి వారునూ బ్రహ్మమే కావున వారిని కూడా త్రాగమన్నాడు. ఇది భాష్యము కాదు. ఆచరణము. కావున దీనిని ఇంక వక్రీకరణము చేయు అవకాశము లేనందున శిష్యులు సత్యమును తెలుసుకుని దేవుడు జీవుడుగా అవతరించునే తప్ప జీవుడు దేవుడు కాడని తెలుసుకుని దేవుడే జీవుడైన శంకరులకు దాసోఽహమ్ అని పాదములపై పడినారు.
కాని తరువాత అద్వైత మతపండితులు ఈ సన్నివేశమును ఎప్పుడును స్మరించరు. ఏలననగా అది వక్రార్థమును చేయుటకు వీలుకానిది. అందరానిదానిని అందినట్లు ఊహించుకుని సంతసించుట మానవునికి ఉన్న ఒక బలహీనత. కావున "సోఽహమ్" అను మార్గములో అద్వైత కైవల్యమును కోరి శంకరుల శిష్యుల వలె పరాభవము పొందనేల? ఇట్టి అద్వైత కైవల్యమునే కోరి, పొంది నిలుపుకొనలేక పరాభవమును పొందినవాడు పరశురాముడు.
పరశురాముడు ఒక సామాన్య మానవుడు. ఆయనలో శరీరము, రెండు శుద్ధ చైతన్యమైన సామాన్యజీవుడు, మూడు పూర్వకర్మ వాసనా ఫలమైన విశిష్టజీవుడు. ఈ ఋషికుమారుని లోనికి పరమాత్మ ప్రవేశించి వ్యాపించినాడు. ఇప్పుడు పరశురాముడిలో పై మూడింటితో పాటు నాల్గవ వాడగు పరమాత్మ ఉన్నాడు.
ఆ పరమాత్మయే సకల క్షత్రియసంహారము చేసినాడు. కార్తవీర్యుని వధించినాడు. కాని విశిష్టజీవునిలో పూర్వ వాసనా గుణములు ఉన్నవి కావున ఆ విశిష్టజీవుని గుణమగు అహంకారము వెలిగినది. ఈ మహిమనంతయు తానే చేసితినని అహంకరించినాడు. దీనితో రాముని చేత పరాభవించబడినాడు. సత్యమును తెలుసుకుని తానింకనూ సాధన చేయవలెనని గ్రహించి తపస్సు చేయ నారంభించినాడు.
ఇట్లు రామావతారము మానవునకు అద్వైత కైవల్యము వలదని బోధించి శరణాగతి ప్రపత్తి మార్గములో హనుమంతునకు సృష్టి స్థితి లయాధికార పదవిని ఇచ్చి నిజమైన పరబ్రహ్మముగా చేసినాడు. కాని రామావతారమున ఎట్టి సిద్ధులు ప్రదర్శించక సామాన్య మానవునితో సమానమైన స్థితిలోనే ఉండెను. అప్పటి మానవుడు తనతో సమానుని అంగీకరించినారే తప్ప సాటి మానవ రూపమును తనకన్నా అధికముగా భావించు స్థితికి రాలేదు. కావున సిద్ధులు ప్రదర్శించి రాముడు మానవత్వమును మించిన దైవత్వమును చూపించలేదు. సిద్ధులను దైవత్వమును ఒక వానరమగు హనుమంతుని ద్వారా ప్రదర్శింపజేసినాడు. అది సాటి మానవుడు కానందున, కోతి అయినందున అంగీకరించిరి.
క్రమముగా మానవుని అసూయ మరియొక కిలో తగ్గినది. సాటి మానవుని ఆధిక్యతను అంగీకరించు స్థితికి మానవుడు వచ్చినాడు. అప్పుడు సాటి మానవునిగా కృష్ణావతారమున సిద్ధులను ప్రదర్శించి ఆధిక్యమును చూపించినాడు. కృష్ణావతారము తరువాత కలియుగారంభమున సిద్ధులే దైవత్వమని మానవుడు మరల భ్రమించినాడు. ఈ భ్రమను నివారించుటకు జ్ఞానము, కరుణ, శాంతి మొదలగు కల్యాణ గుణములే దైవత్వమని సిద్ధులు కేవలము భగవంతుని ఆభరణములేనని వాటిని పరమాత్మ నుండి పొంది రాక్షసాదులు కూడా ప్రదర్శింపగలరని బోధించుటకే, ఎట్టి మహిమలు చేయని కరుణా, శాంతి, జ్ఞానము త్యాగము మొదలగు కల్యాణ గుణములు గల బుద్ధావతారము వచ్చినది.
ఈ విధముగా జ్ఞానానంద, శాంతి, కరుణాది గుణములు గల నరాకారమునే స్వామి నిరంతరము ఆవేశించి ఉండునని బోధించి జ్ఞానబోధలు సమాప్తి చేసినారు. ఇంత బోధ చేసిననూ అసూయ, అహంకార, స్వార్థములతో మారని జీవులను కల్కి అవతారములో ఖండించి వారిని శాశ్వతముగా పశుపక్ష్యాది జన్మలకు త్రోసి వేయుదురు.
కావున విష్ణువు మత్స్యావతారమున చేపగా వచ్చినప్పుడు ప్రతి చేపయూ విష్ణువు కాదు. ప్రతి చేపయూ విష్ణువైనచో సాక్షాత్తు పరమహంసయే చేపను ఎట్లు భుజించెను? ప్రతి మానవుడు దేవుడే అయినచో గోపికలు పతి పుత్రాదులను త్యజించి బృందావనమునకేల వెళ్ళిరి? మీరా భర్తనేల వదిలెను? బుద్ధుడు భార్యా పుత్రులనేల త్యజించెను? పరమాత్మ కొరకు శంకరులు తల్లినేల వదిలెను? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఏల ధిక్కరించెను? ప్రతి జీవుడు దేవుడే అయినచో ఇంక సాధన ఏల?
కావున అసూయాతత్త్వము పూర్తిగా అంతమొందించుకున్న జీవుడు అనసూయ అగును. ఇందు స్త్రీపురుష భేదము లేదు. అందరు జీవులునూ ప్రకృతిరూపులే. శరీరము అపరాప్రకృతి. జీవుడు పరాప్రకృతి. కావున సర్వజీవులునూ స్త్రీలే. పురుషసూక్తము ప్రకారముగా స్వామి ఒక్కడే పురుషుడు. కావున ప్రతి జీవుడూ అసూయను పరిపూర్ణముగా తుడిచివేసినచో అనసూయగా మారవచ్చును. అనసూయా గర్భముననే దత్తుడు ప్రవేశించెను. అనగా నీలో దత్తుడు లీనమై తనను తాను దానము అనగా దత్తత చేసుకొనును. అప్పుడు నీవు దత్తస్వరూపుడవై సాక్షాత్తు దత్తావతారము అగుదువు.
★ ★ ★ ★ ★