home
Shri Datta Swami

 06 Oct 2025

 

త్రిమతాచార్యులు - శంకర రామానుజ మధ్వాచార్యులు

"జీవుడు స్వామి కన్న వేరు, దాసుడే" నన్న మాటను జీవునిచేత పలికించుటకు స్వామికి శంకర రామానుజ మధ్వావతారములు అను మూడు అవతారములు పట్టినవి. గురువు చెప్పిన మాటనే శిష్యుడు పలుకును. శంకరులు తానే దేవుడనని సత్యము చెప్పగా, శిష్యుడు తానూ దేవుడననే అన్నాడు. ఆనాడు అందరూ నాస్తికులే. దేవుడు లేడు అంతా శూన్యమేనని బౌద్ధులు, సృష్టి మాత్రమే ఉన్నది సృష్టికర్త లేడు అని పూర్వ మీమాంసకులు అను రెండు తెగలుగా నాస్తికులున్నారు. వారి చేత ముందుగా దేవుడున్నాడని అనిపించాలి. నాస్తికుడు తన కన్న అధికుని గాని, తనతో సమానుని కానీ అంగీకరించడు. ఒకవేళ ఇతర జీవులు తమతో సములైన అంగీకరిస్తాడేమో కాని అధికుని మాత్రము అంగీకరించడు. శంకరులు "అసలు నీవు ఉన్నావా?" అని ప్రశ్నించారు నాస్తికుడిని. వాడు "ఉన్నాను" అన్నాడు. "అయితే నీవే దేవుడవు, నీవు ఉన్నావు కావున దేవుడు ఉన్నాడు కదా" అని అన్నారు శంకరులు. వాడు దేవుడు ఉన్నాడని అంగీకరించినాడు. "అయితే దేవుడున్నాడు నేనే దేవుడను ఇక సాధన ఎందులకు?" అన్నాడు నాస్తికుడు. అప్పుడు శంకరులు "నిజమే నీవు దేవుడవే. కాని యింతకాలము నీవు జీవుడనని అనుకున్నావు కదా. ఆ భ్రమ తొలగవలయునన్నచో కాస్త జ్ఞాన విచారణ గట్టిగా చేయాలి. జ్ఞానము చేత ఆవరణమైన అజ్ఞానము నివర్తించును. చాలాకాలము నుండి ఉన్న అజ్ఞాన విక్షేపము తొలగవలయునన్నచో నీవు సద్ర్గంథ విచారణ నిరంతరము చేసిన కాని విక్షేపముగ నున్న అజ్ఞానము నివర్తించదు. అప్పుడు నీవు నిజంగా బ్రహ్మమౌతావు" అని జ్ఞాన విచారణకు వాడిని ప్రేరేపించినారు. వాడు జ్ఞాన విచారణము చేయనారంభించినాడు. శంకరులు మెల్లగా "ఈశ్వరుడు" అనే శబ్దమును ప్రయోగించినారు. "జీవుడు వేరు ఈశ్వరుడు వేరు" అన్నారు. "ఇదేమిటి మాట మార్చినావు" అని నాస్తికుడు నిలదీసినాడు. అప్పుడు శంకరులు ఇట్లు పలికినారు. "దేవుడు అనగా ఈశ్వరునిలోని అసలు తత్త్వమైన బ్రహ్మము. జీవుడిలోను ఆ అసలు తత్త్వమైన బ్రహ్మమున్నది. కావున జీవుడు బ్రహ్మమే కాని ఈశ్వరుడు కాడు. బురదనీరు అను జీవుడిలోను సుగంధ జలము అను ఈశ్వరునిలోను ఒకే శుద్ధ జలము ఉన్నది. నీవు బురద నీటిలోనున్న శుద్ధ జలానివి. కాని దానిలోని మట్టి కణములు కావు. ఇప్పుడు ఈశ్వరునిలో నున్న అనగా సుగంధ జలములో నున్న శుద్ధ జలము నీవే కదా" అన్నారు.

Swami

నాస్తికుడు:- నేను ఈశ్వరుడను కావాలి. బ్రహ్మము నాకు అక్కర లేదు.

శంకరులు:- ఈశ్వర జీవులలో ఉన్న చైతన్యమే బ్రహ్మము. చైతన్య దృష్టిని మాత్రమే తీసుకొన్నచో నీవు ఈశ్వరుడవు.

నాస్తికుడు:- చైతన్య దృష్టి మాత్రమే కాకుండా, పూర్ణ దృష్టితో నేను ఈశ్వరుడిని కావాలి.

శంకరులు:- బురదనీటిలో నున్న శుద్ధ జలము, సుగంధ జలములో నున్న శుద్ధ జలము ఒక్కటే. అదే బ్రహ్మము. ఇక బురద నీటిలో నున్న మట్టికణములు, సుగంధ జలములో నున్న చందనగంధ కణములు సృష్టి. సృష్టి మిథ్య కావున ఆ కణముల గురించి నీవు చింతించవలసిన పనిలేదు. బ్రహ్మ సత్యము. కావున ఈశ్వరుని గురించి పట్టించు కొనవద్దు.

నాస్తికుడు:- నేను సుగంధ జలమగు ఈశ్వరుడగుటకు మార్గమే లేదా?

శంకరులు:- ఉన్నది. ఈ నేను అనబడు జీవుడెవరు? నీవు బురద నీరా? లేక శుద్ధ జలమా? లేక మట్టి కణములా?

నాస్తికుడు:- నేను బురద నీరు.

శంకరులు:- అట్లు అయినచో నీలోని మట్టి కణములను జీవ గుణములను వడపోసి వేరు చేసి తీసివేయుము. అప్పుడు నీవు శుద్ధ జలముగా మిగులుదువు. ఇప్పుడు నీవు పోయి సుగంధ జలములో కలసిపోదువు. ఈ మార్గములోనే నీకు ఈశ్వరునితో కైవల్యము సాధ్యము. అది చేత కాకపోయినచో, నిన్ను నీవు శుద్ధ జలముగా నిశ్చయించుకొని, సుగంధ జలములోని శుద్ధ జలము నీవేనని సంతృప్తిపడుము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch