home
Shri Datta Swami

 01 Dec 2025

 

నిజమైన దత్తజయంతి

[26.12.2004] దత్తజయంతి తారణ నామ సంవత్సరము నేను నా శ్రీమతి శ్రీదత్తస్వామివారిని దర్శించాము. ఆరోజు గురువారము. స్వామీ! ఈనాడు దత్తజయంతి కదా! మీరు దయచేయండి. మమ్ము అనుగ్రహించండి అని స్వామివారికి వినతి చేశాము. స్వామి చిరునవ్వు చిందించుచూ ఇలా వచించారు. “శ్రీదత్తభగవానుడు మానుషరూపంలో దత్తస్వామిగా వచ్చి అనుగ్రహిస్తున్నారు గదా! ఈ మానుష తనువుకు జయంతి 24 ఫిబ్రవరి. అదే నిజముగా దత్తజయంతి" అంటూ నవ్వారు. 24.02.2007 కు స్వామికి 60 సంవత్సరములు వయస్సు నిండుతుంది. అంటే స్వామికి షష్టి పూర్తి అన్న మాట. 09.06.2000 సం||న విష్ణుదత్తునకు (శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి) దత్తస్వామి చెప్పిన చివరి రెండు ముక్కలు.

  1. నీకిక సాధన లేదు.
  2. సాధక జీవులకిలలో సాయపడుము సాధనలో.

[24.07.1999] నాయనా! “బాలకృష్ణా! నీవు ధన్యుడవు. నీవు పొందవలసినది ఏమియును లేదు. పొందినదానిని గుర్తించుము. నా సేవయే పరమముక్తి. నేను అనుగ్రహిస్తేనే నా సేవ చేయగలవు. అది నేను ప్రసాదించు చరమముక్తి. ఏలనన వానికి నేను సేవకుడిగా ఉంటాను. హనుమంతునికి మించిన ముక్తుడు లేడు. ఇక నా దర్శనమంటావా, అది ఎంత భాగ్యము! ఆ సమయము నాచే నిర్ణయింపబడియేయున్నది. సర్వము నాకు వదలిన వాడు క్షేమముగా నుండును. తన నిర్ణయానుసారము నా నిర్ణయము ఉండవలయునను వాడు విపన్నుడగును. స్వామి ఇచ్ఛకు సర్వ సమర్పణము చేసినవాడే పూర్ణసేవకుడగును. కనుక అంతా స్వామి ఇచ్ఛ ప్రకారము జరుగనీయుము. స్వామియే సర్వస్వము. మనము స్వామి సేవకులము.

[02.05.2003 సా. 06.00] స్వామి మా దంపతుల వంక చూపుచూ "వీళ్లు నా అంతఃస్వరూపాన్ని గుర్తించి, సేవించి ప్రకటించటం అనే నేరం చేశారు. నేరానికి శిక్ష విధించాలి గదా! కనుక వీరిద్దరికి దత్తలోకాన్ని ప్రసాదిస్తున్నాను” అని అన్నారు. స్వామీ మేము ధన్యులము. తరువాత స్వామి అన్నారు – ‘శర్మగారు నా అంతఃస్వరూపాన్ని బయటకు తెచ్చి చిత్రపటాల రూపములో బహిర్గతం చేసిన నేరానికి ఈయనకు వైకుంఠలోకము ప్రసాదిస్తున్నాను” అంటూ కుడిహస్తమును పైకి ఎత్తి అనుగ్రహించారు స్వామి. మా దంపతులము స్వామికి వందనము చేసి ధన్యులమయ్యాము. తరువాత, కొంచెము సేపు నిశ్శబ్దముగా ఉన్నాము. ఆ తర్వాత శర్మగారు వచ్చారు. స్వామి శర్మగారితో ఇలా వచించారు. నావంక చూపుతూ "ఈయన హనుమంతుడు గదా, నాకిరీటం ఆయన తలపై పెట్టాను. భవిష్యత్‌బ్రహ్మగా ఆశీర్వదించాను. కనుక నా లోకము ప్రదానం చేశాను". మరల శర్మగారి వంక చూపుతూ,  ఈయన నల్లగా ఉన్నాడు గదా. ఈయన చేసిన సేవకు వైకుంఠ లోక ప్రదానము సముచితమే. తరువాత, అజయ్‌గారి వంక చూపుతూ మీరు ఎలాగో వైకుంఠానికి చేరవలసినదే గదా, ఈ శర్మ గారిని కూడా వెంట పెట్టుకు రండి అని వచించారు.

Swami

స్వామి ఇలా అన్నారు – "నాకు ఒక కోరిక ఉన్నది. ఈ వేంకటదత్తుని చిత్రపటాన్నిచూస్తూ నా చివరి శ్వాస విడవాలని" అని అన్నారు స్వామి. అప్పుడు నేనన్నాను “స్వామీ! ఎందుకు మీరు ఇంకా మాయలో కప్పుతారు మమ్మల్ని" అని. స్వామి ఇలా అన్నారు, "ఈ శర్మగారు నాలోని అంతఃస్వరూపమైన వేంకటదత్తుని బయటకు తీసుకువచ్చారు. ఇంకా ఈ శరీరములో ఏమి మిగిలినది?" అని. అప్పుడు నేను, “స్వామి! అద్దములో ప్రతిబింబము చూచుకున్నంత మాత్రాన వ్యక్తి నుండి ఏమి పోయింది? ఏమీ పోలేదు. స్వామి మీలో సంపూర్ణంగా ఉన్నారు” అని అన్నాను. అప్పుడు స్వామి ఇలా వచించారు. ఈయన హనుమంతుడు గదా, ‘వైయాకరణి, బుద్ధిమతాం వరిష్ఠం’ గదా, అందుకే సరిగా కనుక్కున్నాడు అని నవ్వారు. అప్పుడు నేను అన్నాను, స్వామీ, మీరు సాక్షాత్తు చిలుకూరులో వెలసియున్న శ్రీవేంకటేశ్వరులే. ఆ శ్రీవేంకటేశ్వరులే ఇక్కడ మా చిలుకూరు వారి ఇంట నరావతారులుగా వెలిసారు. మేము ధన్యులం అని అన్నాను. స్వామి మందహాసం చేసారు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch