home
Shri Datta Swami

 27 Apr 2025

 

త్రిమూర్తులు - త్రిగుణములు

Updated with Part-3 on 29-04-2025


Part-1   Part-2   Part-3


Part-1

[29-03-2003] భక్తిలేని వైరాగ్యము అసంభవము. భక్తి కొరకు ప్రయత్నము చేయవలెనే కాని వైరాగ్యము కొరకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. భగవంతుని రుచి చూసిన తరువాత సృష్టిలో ఉన్న సర్వవస్తువులతో మరియు సర్వవ్యక్తులతో బంధములు వాటి అంతట అవే తెగిపోవును. కావున సంసారబంధములు తెంచుకొనుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. నీవు ఎంత ప్రయత్నము చేసిననూ అవి తెగవు. కేవలము సంసార బంధములు తెంచుకున్నంత మాత్రమున ప్రయోజనమేమి? ఒక రాయి ఉన్నది దానికి ఎట్టి సంసారబంధములు లేవు. ఆ రాయి ముక్తిని పొందినదా? మహాపాపులకు పాషాణజన్మలు వచ్చునని శాస్త్రము చెప్పుచున్నది. కావున సాధన అనగా సంసార బంధములను తెంచుకొనుట కాదు. భగవంతునితో కొత్త బంధమును ఏర్పరచుకొనుటయే సాధన. భగవంతునితో బంధము ఏర్పడునప్పుడు సంసారబంధములు వాటంతట అవే తెగిపోవును. భగవంతునితో బంధము ఏర్పరచుకొనుటయే భక్తి. సంసారబంధములు తెగిపోవుటయే వైరాగ్యము. భక్తి లేనిదే వైరాగ్యము అసాధ్యము. ఒకవేళ దానిని సాధించిననూ అది నిలువదు. భగవంతుడు అను అమృతము రుచి చూచుటయే భక్తి. సంసారమను కాఫీని వదలుటయే వైరాగ్యము.

రోజూ కాఫీ త్రాగుచున్నవానిని, కాఫీ త్రాగుట మానుకొనమని చెప్పిననూ దానిని మానుకొనలేడు. అసలు దానిని త్రాగుట ఏల మానుకొనవలయును? మానుకొన్న వచ్చు ప్రయోజనమేమి? ప్రయోజనములేని దానికి ప్రయత్నము ఏల చేయవలెను? కావున కేవల వైరాగ్యము వలన ప్రయోజనము లేదు. భక్తి లభించినచో వైరాగ్యము అప్రయత్నముగనే సిద్ధించుచున్నది. భక్తికి బ్రహ్మానంద స్వరూపుడగు భగవంతుని ప్రాప్తి అను ప్రయోజనము ఉన్నది. రుక్మిణీదేవి మామూలుగా భోజనముచేసి పానీయములను త్రాగుచూ, చందనాది గంధములను పూసుకొనుచూ, అలంకారములను చేసుకుండెడిది. వాటియందు ఆమెకు ఎట్టి వైరాగ్యము లేదు. కాని నారదుడు వచ్చి కృష్ణుని గురించి ఆయన యొక్క కళ్యాణ గుణముల గురించి వివరించి చెప్పినాడు. భగవంతుని గురించిన ఈ వివరణమే బ్రహ్మజ్ఞానము. ఇదే జ్ఞానయోగము. కావున జ్ఞానయోగమే మొదటిమెట్టు. కావుననే మొట్టమొదట శంకరాచార్యులు వచ్చి ‘జ్ఞానాదేవ తు కైవల్యమ్’ అని జ్ఞానమార్గమును బోధించినారు.

Swami

కృష్ణుని గురించిన జ్ఞానము కలిగిన తరువాతనే కృష్ణుని పొందవలయునని ఆకర్షణ, తపన, రుక్మిణిలో ఏర్పడినది. ఈ తపనయే భక్తియోగము. ఈ భక్తికి కారణము జ్ఞానము. ఆ తపన వల్లనే కృష్ణుడు లభించినాడు. అనగా భక్తికి మాత్రమే భగవంతుడు లభించును. ‘భక్త్యా త్వనన్యయా లభ్యః’ అని గీత. అనన్యమైన భక్తికే నేను లభింతునని అర్థము. అనన్యభక్తి అనగా ఏమి? భగవంతుడు తప్ప అన్యమైన వస్తువునందుకాని, అన్యులైన వ్యక్తులందు కాని ప్రేమ ఏ మాత్రము లేక కేవలము భగవంతునిపై మాత్రమే సర్వేంద్రియములు కేంద్రీకరింపబడుట. ‘అవిచ్ఛిన్న ఘృతధారవత్ భక్తిః’ అని చెప్పినారు. అనగా నిరంతర ప్రవాహరూపమగు భగవత్ర్పేమధారయే భక్తి. ఒక పాత్ర నుండి మరియొక పాత్రలోనికి ఘృతమును ధారగా పోయునప్పుడు ఆ ఘృతము నిరంతరము ప్రవహించుచూ తన ఏకైక లక్ష్యమగు పాత్రయందు మాత్రమే పడుచున్నది. ఆ ధార నుండి ఒక్క బిందువు కూడా బయటకు చిందుటలేదు. అనగా లక్ష్యమైన పాత్రను దాటి ఒక్క బిందువు కూడా బయట పడుటలేదు. ఇదే అనన్య భక్తి ధార.

వర్ణ వ్యత్యయ’ సూత్ర ప్రకారము వ్యాకరణశాస్త్ర ప్రకారముగా ధారా శబ్దములోని వర్ణములు ముందు వెనుకలకు మారుటవలన రాధ అయినది. కావున రాధ యనగా ఒక మహాతత్త్వమును సూచించుచున్న పరమాత్మ శక్తిస్వరూపిణి. భగవంతుని యొక్క ‘హ్లాదిని’ అను శక్తియే రాధగా అవతరించినది. హ్లాదిని అనగా ప్రేమస్వరూపమైన ఆనందము అని అర్థము. అనగా భగవంతుని లోనున్న అపారమైన ప్రేమగుణము రాధగా అవతరించినది. ఆమెకు కృష్ణుడు తప్ప మరియొక వస్తువు మీద కాని, మరియొక వ్యక్తి మీద కాని దృష్టిలేదు. యమునా తటమున ఎక్కడ తనను స్వామి వదలి మధురకు పోయినాడో అచ్చటనే ఉండిపోయినది. ఇంటికి పోలేదు. నిరంతరము యమున వైపే చూచుచుండెడిది. కారణము యమునకు, కృష్ణునకు కొన్ని పోలికలు ఉన్నవి. కృష్ణుడు ఎప్పుడునూ కరుణతో ప్రసన్నముగా, చల్లని చూపులతో ఉండెడివాడు. యమున కూడా చల్లని జలముతో ఉండెడిది. కృష్ణుని వర్ణము, యమున వర్ణము ఒకటిగానే ఉండెడిది. యమునా తరంగములు తనను రమ్మని ఎల్లప్పుడును సైగచేయుచూ ఊపుచుండెడి కృష్ణుని చేతులవలె కనిపించెడివి. నురుగు కణములతోనున్న యమునాజలము ముత్యాల హారములలో అలంకరించబడిన కృష్ణశరీరము వలె కనబడుచుండెడిది. నిరంతరము దూకుచూ ప్రవహించు యమున నిరంతరము ఆటలలో గంతులు వేయుచున్న కృష్ణుని జ్ఞప్తికి తెచ్చెడిది.

ఈ కారణము వలన రాధ ఎప్పుడునూ యమున వైపే చూచుచూ నిరంతరము ఏడ్చుచుండెడిది. కావున సాధకులకు భక్తి యొక్క పరిపూర్ణ స్వరూపము ఎట్లుండునో బోధింపదలచి స్వామి యొక్క ప్రేమశక్తియే రాధగ అవతరించినది. అన్నాహారములు లేక, నిద్ర లేక శుష్కించిపోవుచు, ఆమె నిరంతరమూ కృష్ణుని కొరకు ఒక గీతమును పాడుచుండెడిది.

నీ ప్రేమ కోసమే - నా జీవితంబంత
కర్పూర నీరాజనంబుగా కాలనీ
గోవింద గోవింద పిలుపుతో తపనతో
నా చిట్టచివరి నిశ్వాస మాగిపోనీ! ||

 నిన్నెంత తలచినా - సంతృప్తి రాదాయె
తీరమన్నది లేని - ప్రణయసాగరమీవు
నా జీవితేశ్వరా ! నీ తరంగాలలో
తేలియాడుచు తుదకు నను మునిగిపోనీ ||

 నవకోటి మన్మథా ! - నీ పొందు లేకున్న
ఈ జగముతో పొందు - ఇపుడె ఆగిపోనీ
నీ కౌగిలింతయే - లేకున్న గోపాల !
విరహాగ్నిలో నన్నిక - భస్మమైపోనీ ||

 

Part-2

ఈ మూడు గీతములు త్రిమూర్తి స్వరూపుడగు దత్తుని యొక్క పరిపూర్ణ అవతారమగు కృష్ణునికి నిరంతరము రాధ సమర్పించుచుండెడిది. అయితే ఇక్కడ ఒక్క సందేహము. రాధ స్త్రీ స్వరూపమున ఉన్నది. కృష్ణుడు పురుష స్వరూపమున ఉన్నాడు. కావున ఈ గీతము స్త్రీ జీవులకు మాత్రమే వర్తించునా! పురుష జీవులకు వర్తించదా అన్నచో ఎప్పుడైతే పురుష జీవులు తాము పురుషులమన్న అహంకారమును పరిపూర్ణముగా సంన్యసించెదరో అనగా లింగాహంకారము పోవుచున్నదో అప్పుడు వారు స్త్రీలే అగుచున్నారు అని ‘స్త్రియః సతీః పుంస ఆహుః’ అని వేదము చెప్పుచున్నది. స్త్రీ పురుష భేదములు కేవలము శరీరములో కాని, జీవునకు లేవు. ఏ శరీరమైననూ అగ్నిలో దహనమైనప్పుడు ఒకే భస్మముగా మారుచున్నది. లింగాహంకారము పోయినప్పుడు పురుషుడు నిజముగా స్త్రీ అగుచున్నాడు. నేటి వైద్య విధానములో స్త్రీలను పురుషులుగాను, పురుషులను స్త్రీలగాను మార్చుచున్నారు. ఇవి కేవలము బాహ్య శరీరమునకు సంబంధించినవి. లింగాహంకారము జీవునకు సంబంధించినది. చైతన్య మహాప్రభువు ఈ లింగాహంకారమును పూర్తిగా సంన్యసించిన మహాభక్తుడు. కావున నిరంతరము శ్రీకృష్ణుని ఆలింగనము కొరకు తపించెడివాడు. తాను ప్రియురాలిగను, కృష్ణుని ప్రియుడిగను సంబోధించుచూ గానము చేసెడివాడు. ప్రతిదినము కృష్ణుడు ఆలింగనమును ఇచ్చెడివాడు. ఒక రోజు స్వామి ఆలింగనము ఈయనిచో వియోగతాపము చేత ఆయన శరీరము భస్మమై యుండెడిది.

రామకృష్ణ పరమహంసయును బృందావనమున నెలరోజులు ఉండి తన లింగాహంకారమును పూర్తిగా పోగొట్టుకొని చీరెలు, సొమ్ములను ధరించి గోపికగా ఉండి జగన్మాతగా మారినాడు. ఎన్నో యుగములు తపస్సు చేసిన ఋషులు కూడ లింగాహంకారమును భస్మము కావించి స్త్రీవేషములలో శ్రీరాముని తమ భర్తగా భావించి శరణము పొందినారు. భర్త యనగా భరించువాడు. భార్య యనగా భరింపబడునది. పరమాత్మచే భరింపబడు సమస్తసృష్టియూ ఆయన యొక్క భార్యయే. ఆయన జగన్నాథుడనబడుచున్నాడు. జీవులందరును జగత్తులో భాగమే. పురుష రూపమున ఉన్న జీవుడు ఒక స్త్రీజీవుని భార్యగా తలచి తాను భరించుచున్నాడు కావున భర్త యనుకొనుచున్నాడు. కాని ఆ పురుషరూపములో ఉన్న జీవుడునూ భగవంతునిచే భరింపబడుచున్నాడు. కావున అతడునూ భగవంతునికి భార్యయే. భూమి మీద ఒక పీట ఉన్నది. ఆ పీట మీద ఒక పాత్ర యున్నది. పీట పాత్రను భరించుచున్నది. కాని పీటను, పాత్రను కూడ భూమి భరించుచున్నది.

జీవుడనగా చైతన్య స్వరూపము. జీవునకు పైనున్న శరీరము జడమగు అపరా ప్రకృతి. పరా ప్రకృతి, అపరా ప్రకృతి కలిసి ప్రకృతి యనబడుచున్నది. కావున శరీరములోనున్న ప్రతి జీవుడును ప్రకృతి స్వరూపుడే. ‘ప్రకృతిం పురుషం చైవ’ అను గీత ప్రకారముగా పరమాత్మచేత ప్రకృతి భరించబడుచున్నది. పరమాత్మ ప్రకృతిని భరించుచున్నాడు. ప్రకృతి, పురుషులు భార్యా భర్తలు. ఒక నాటకమున సీత, రాముడు అను పాత్రలను ఇరువురు స్త్రీలు వేసినారు. బాహ్యశరీరము చూడగా స్త్రీ, పురుష బేధము కనిపించుచున్నది. కాని వేషధారులైన నటులను తీసుకొన్నప్పుడు వారిరువురునూ స్త్రీలే. కావున లోకములో ఉన్న సర్వప్రాణులునూ ప్రకృతి స్వరూపులగు స్త్రీలే. పరమాత్మ ఒక్కడే పురుషుడని ‘అథ పురుషో హ వై నారాయణః’ అని శ్రుతి చెప్పుచున్నది. కావున భక్తి సర్వజీవులకూ సంబంధించినది. ఇందులో కులభేదము కాని, లింగభేదము కాని, వయోభేదము కాని, మతభేదము కాని లేదు. ఇది జీవాత్మ పరమాత్మల సంబంధము. కావున ఇట్టి భక్తికై ప్రయత్నించుటకు ప్రతి మానవుడును అర్హుడే. చిలకయైననూ, హంసయైననూ మరి ఏ రూపమైననూ పంచదారతో చేయబడిన అన్నియునూ పంచదారయే కాని దానిలో వేరొక పదార్థము లేదు.

భక్తియే ప్రేమయని వ్యాసమహర్షి చెప్పినాడు. ‘యా నః ప్రీతిః విరూపాక్ష భక్తిరిత్యభిధీయతే’ – అనగా లౌకికములగు వస్తువుల మీద, లౌకికులగు వ్యక్తుల మీద మనము ఏ ప్రేమను చూపుచున్నమో అదే ప్రేమను భగవంతుని పై చూపినచో భక్తియనబడును అని దీని అర్థము. భగవత్ర్పేమను కూడ ప్రేమ యనరాదా అన్నచో లౌకికముల యందు ప్రేమయను శబ్దము ఉపయోగించబడినది. కావున ఆ శబ్దము అపవిత్రమైనది. కావున అదే అర్థముగల మరియొక ప్రత్యేకమైన, పవిత్రమైన శబ్దమును భక్తియని వాడినారు.

లౌకికప్రేమలు ఏల అపవిత్రములు? దీనికి కారణము బృహదారణ్యక ఉపనిషత్తులో ఇట్లు చెప్పుచున్నది. ‘ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి’ అనగా లౌకిక ప్రేమలను నిశితముగా విశ్లేషించినచో అవి స్వార్థములేనని తేలుచున్నవి. భర్త, భార్యను ఏల ప్రేమించుచున్నాడు? తనకు సుఖమును ఇచ్చుచున్నది కావున. అదే భర్త తనకు దుఃఖమునిచ్చు గయ్యాళి భార్యకు వెంటనే విడాకులు ఇచ్చుచున్నాడు. అట్లే భార్య భర్తను ఎట్లు ప్రేమించుచున్నది? తనకు సుఖమునిచ్చు ధనమును భర్త ఇచ్చుచున్నాడు కావున. తండ్రి కొడుకును ఏల ప్రేమించుచున్నాడు? వృద్ధాప్యములో తనకు సేవచేయునని మరియు ఆస్తిని కూడ ఇచ్చుచున్నాడు. వృద్ధాప్యమున తనను చూడని కొడుకును ఉద్దేశించి – వీడిని ఎంత కష్టపడి పెంచితిని, ఇప్పుడు నన్ను చూచుటలేదు అని నిందించుచున్నాడు. అదే విధముగా కుమారుడు, తండ్రి తనను పెంచి పోషించిన కారణముగా ప్రేమించుచున్నాడు. కావున ఈ లౌకిక బంధములన్నియును ప్రేమ అను పైపూత కలిగిన స్వార్థములే. కాని భగవంతుడు నిన్ను ఏల ప్రేమించుచున్నాడు? నీ నుండి ఆయనకేమి లాభము? నీకు మనుష్యజన్మ నిచ్చినాడు. ఆయుర్దాయమును ఇచ్చినాడు. దీర్ఘరోగములతో ఆసుపత్రిపాలు కాకుండా ఆరోగ్యమును ఇచ్చినాడు. ధనమును, సంతానమును ఇచ్చినాడు. నిరంతరము ఒకటే యున్నచో నీకు విసుగు కలుగునని కాలమును పగలు, రాత్రిగా మార్చినాడు. ఎండ, వాన, వెన్నెల, చలి మొదలగు ఋతువులతో వాతావరణములో క్రమబద్ధమైన మార్పును సృష్టించినాడు.

ఖగోళముల యొక్క విస్ఫోటములు ఎన్నియో పరుగెత్తుచున్నవి. అందులో ఒక్కముక్క తగిలిన చాలును భూమి బద్దలైపోవును. వాటి నుండి భూమిని రక్షించుచున్నాడు. ఎన్నో రకముల పంటలను, ఫలములను సృష్టించి వాటిని రుచిగా వండు పాకశాస్త్రమును మానవులకు అందించినాడు. ఎన్నో సుఖసాధనములను కనిపెట్టు విజ్ఞానశాస్త్రమును అందించినాడు. సూర్యరశ్మి తీవ్రముగా భూమికి తగలకుండా ఓజోన్ వాయువు చక్రమును సృష్టించినాడు. అసలు నీ శరీరములో ఎన్ని యంత్రములు పని చేయుచున్నవో వాటన్నిటినీ సృష్టించి, నడిపించి నీకు జీవితమునిచ్చి నిరంతరము ఆనందపరచుచున్నాడు. అంతే కాదు, తనను గురించిన జ్ఞానమును తెలుపుటకు వేద-శాస్త్రములను రచించినాడు. తాను మాటి మాటికి అవతరించుచూ వాటి సారమును బోధించుచున్నాడు. తనను చేరు భక్తిమార్గమును విశదీకరించుచున్నాడు. దానివలన ఆయనను చేరినచో ఆయనకు అణుమాత్రము లాభము లేదు. లాభము అంతా నీకే. అణుమాత్ర లాభమును నీ నుండి ఆశించక, ఎట్టి స్వార్థము లేక, నిన్ను ఇంతగా ప్రేమించుచున్న భగవంతుడిని, ఆయన నుండి ఎట్టి లాభమును ఆశించక నిస్వార్థముగనే నీవునూ స్వామిని ప్రేమించవలెను.

 

Part-3

నిస్వార్థప్రేమకు నిస్వార్థప్రేమయే బదులు ఈయవలెను. కాని మనము ఆయనను ఎల్లప్పుడునూ మన లాభముల కొరకే ప్రేమించుచున్నాము. స్వార్థములను సంకల్పించియే పూజలను చేయుచున్నాము. మన ఇంటిలో పెళ్ళికి వచ్చి ఒకరు బంగారుగొలుసును బహుకరించినారు. మనము వారింటిలో పెండ్లికి పోయి నకిలీగొలుసును బహుకరించినచో ఎట్లుండును? మనము భగవంతుని పై చూపుచున్న ప్రేమ రోల్డ్ గోల్డ్ వంటిది అనగా లోపల ఇత్తడి వంటి స్వార్థముతో కూడిన ప్రేమవంటిది. పైన మాత్రమే ప్రేమ అను బంగారపు పూత ఉన్నది. కాని స్వామి మనపై చూపుతున్న ప్రేమ ఎట్టి స్వార్థము లేక లోపల, బయట మొత్తమూ గోల్డే. ఆ ప్రేమ నిఖార్సైన 24 క్యారట్స్ గోల్డ్. కావున భగవంతుడు మనపై నిస్వార్థప్రేమను చూపుచుండగా మనము ఆయన పై స్వార్థప్రేమను చూపుచున్నాము. ప్రేమ రెండు దిక్కులకును ఒకే తత్త్వము కలిగి ఒకే దిక్కుకు ప్రవహించవలెను. Love is not oneway traffic. స్వార్థముల కొరకు స్త్రీలు కూడా నోములు నోయుచున్నారు. ఇచ్చుకొంటినమ్మా వాయనం, పుచ్చుకొంటినమ్మా వాయనం అంటున్నారు. మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చుచున్నారు. ఆమెకు ఈయవలసిన వాయనం అట్లు కాదు. ఆమె మనపై చూపిన నిస్వార్థప్రేమకు బదులుగా ఆమెపై నిస్వార్థప్రేమ చూపవలెను. అనగా ఎట్టి ఫలమునూ ఆశించక కష్టనష్టములను ఇచ్చిననూ ఆమెను పూజించుటయే నిజమైన వాయనము. పూజలలో భక్తి ప్రధానమైనది.

భక్తి అనగానేమి? మనస్సులో, వాక్కులో, క్రియలో ప్రేమ ఉండుటయే. మనస్సులో భావరూపమున ఉండును. ఇదియే భగవంతుని పైన శ్రద్ధ లేక ధ్యానము అందురు. ఆ తరువాత ప్రేమ వాక్కులో ఉండవలెను. వాక్కు వచనముగను, పద్యముగను, గీతముగను ఉండును. వచనమే యజుర్వేదము. పద్యమే ఋగ్వేదము. గీతమే సామవేదము. ‘వేదానాం సామవేదోఽస్మి’ అని గీత. ఎవరికైనను వచనము కన్న పద్యము, పద్యము కన్న గీతము ప్రియముగ నుండును. కావున సామవేదీయమైన గీతోపానమే శ్రేష్ఠమైన వాక్కు. గానాత్మకమైన వాక్కునే గాయత్రి అందురు. మనస్సును ఆకర్షించునదే మంత్రము. గానమును మించిన మనస్సును హరించు వాక్కు లేదు. కావుననే ‘గాయత్ర్యాః న పరో మంత్రః’ అని చెప్పినారు. గాయత్రి అనగా కేవలం ‘తత్సవితుర్వరేణ్యమ్’ అని ఋగ్వేద శ్లోకము కాదు. మనస్సును ఆకర్షించు గీతము ఏదియైనను గాయత్రియే. అయితే ఆ గీతము కేవలము ప్రకృతికి మాత్రము సంభంధించినచో అది గాయత్రీ మంత్రము కాదు. అనగా ఒక వనమును గురించి కాని, ఒక ఋతువును గురించి కాని వర్ణించు గానము గాయత్రి కాదు. ఏలననగా ‘గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ’, అనగా ఆ గానము మనలను ఈ సంసారనరకము నుండి రక్షించవలెను. కావున రక్షణ సమర్థుడైన పరమాత్మను వర్ణించు ఏ గీత అయినను గాయత్రి మంత్రమే. ఇట్లు గాయత్రి మంత్రము యొక్క అంతరార్థము తెలిసినచో గాయత్రీ మంత్రమును అన్ని కులములవారు, స్త్రీలు, పురుషులును అర్హులేనని తెలియుచున్నది. ఆ తరువాత ప్రేమ, కర్మలో వ్యక్తము కావలెను. అప్పుడు దానిని ‘సేవ’ అందురు. మనస్సు వాక్కులకన్నను క్రియ ప్రధానమైనది. కావున క్రియారూపమైన భక్తియే ప్రధానమైనది. నీవు ప్రేమించు నీ భార్య జ్వరముతో బాధపడుచున్నది. అప్పుడు నీవును ఎదురుగా కూర్చుని మనస్సులో బాధపడుచున్నచో ప్రయోజనమేమి? కావున మనోరూపమైన ప్రేమ అల్పమైనది. ఆ తరువాత వాక్కులతో ఓ భార్యామణీ! నీవు ఎంత బాధపడుచున్నావు? అని పలికినచో దానివల్ల కూడా ప్రయోజనము లేదు. భావము కన్న వాక్కు ఎక్కువ శక్తికలది, కాని అదియును అల్పమే. ఆ పైన నీవు లేచి వైద్యుని తీసుకొనివచ్చి, ఆమెను చూపించి, ఔషధములను ఇచ్చి జ్వరము తగ్గువరకు ఉపచారములు చేసినచో అట్టి క్రియారూపమైన సేవయే నిజమైన భక్తి. అట్టి సేవను నిరంతరము హనుంతుడు కావించి చతుర్దశభువనాధిపతి అయినాడు.

స్వామికి ఎట్టి వ్యక్తిగత సేవయును అక్కరలేదు. ఉపచారములు అంతకన్నను అక్కరలేదు. స్వామి కార్యము కేవలము ఒక్కటే ఉన్నది. ఈ సృష్టిలోని మానవులందరిని మనుష్యజన్మ ముగియు ముందు భక్తి జ్ఞానామృతములందించి ఉద్ధరించవలెను అని. ‘జంతునాం నరజన్మ దుర్లభమిదమ్’ – మనుష్యజన్మ చాలా దుర్లభమైనది. మరల రాదు అని అర్థము. ఈ జన్మ ముగియగనే మన ఫైలు కాలభైరవుడు విచారణ చేయును. దాని ప్రకారముగా ఏ జీవునికైననూ పశుపక్ష్యాది జన్మలే తప్ప మనుష్యజన్మ రాదు. మరల జీవునకు విచారణ లేకుండా మనుష్యజన్మ వచ్చుటకు ఒకే ఒక్క అవకాశము కలదు. అది ఏమనగా జీవుడు స్వామి సేవలో పాల్గొని స్వామి కార్యమున సహకరించినచో అట్టి జీవుడు మరల తాను ఎత్తబోవు నరావతారములో సేవకు అవసరము కావున ఆ జీవునకు ఎట్టి విచారణయు లేక మనుష్యజన్మ అనుగ్రహింపబడుచున్నది. కావున ఈ మనుష్యజన్మ ముగియు లోపల నీవు భగవత్సేవలో పాల్గొనక పోయినచో నీకు పశుపక్ష్యాది జన్మలు తప్పక లభించును. ఏలననగా నీవు నిరంతరము భార్యాపుత్రుల మమకారములో బడి ధనార్జనాలోలుడవై యున్నావు. ధనము యొక్క మొట్టమొదటి ప్రయోజనము తన పొట్టపోసుకోవటము. అట్టి పొట్టకూటి కొరకై అహోరాత్రములు అలమటించుచూ సంచరించు పశుపక్ష్యాది జన్మలు నీకు లభించుటయే న్యాయము. భగవంతుని గురించి చింతించని నీకు మరల మనుష్యజన్మ ఏల? మనుష్యజన్మ ఉన్ననూ నీవు నిరంతరము ఆహార సంపాదనలోనే నిమగ్నమై ఉన్నావు. నీకు భగవంతుడు అక్కరలేదు. కావున నీవు ప్రస్తుతము మనుష్యాకారములో నున్ననూ పశువుగనే జీవించుచున్నావు. ‘ఆహార నిద్రా భయ మైథునాని సామాన్యమేతత్ పశుభి ర్నరాణమ్’ అనగా మనుష్యలకును, పశువులకునూ సమానముగా ఉన్న ధర్మములు ఆహారము, నిద్ర, భయపడుట, మైథునమే (sex) గదా! కనుక ఈ మనుష్యజన్మలో వీటికే ప్రాముఖ్యత ఇచ్చుచున్నందున పశుజన్మ పొందుటలో ఏమి నష్టము.

To be continued...

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch