home
Shri Datta Swami

 09 May 2025

 

విశ్వమత సమన్వయము

(స్వామి మరియు క్రిస్టియన్ ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ)

[13-07-2003]

ఒకసారి స్వామి నరసరావుపేట-విజయవాడ రైలులో ప్రయాణించుచున్నారు. ఒక క్రిస్టియన్ మతస్థుడైన ఫాదర్ కూడా స్వామితో ప్రయాణించుచున్నారు. స్వామి మరియు ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ:

ఫాదర్: నాయనా విను, క్రీస్తును నమ్మి ఆరాధించని వారు శాశ్వత నరకమున పడిపోవుదురు. ఇది మా మతధర్మము.

స్వామి: క్రీస్తు పుట్టక ముందు జీవులకు ముక్తిలేదా? దేవునకు, ఆ తరముల వారికి ఈ అవకాశమును ప్రసాదించని కారణమున పక్షపాతము వచ్చినది గదా! అనగా క్రీస్తు ముందు తరముల వారిని నిష్కారణముగా అనుగ్రహించకపోవుట తప్పుకదా!

ఫాదర్: క్రీస్తు పూర్వము యొహోవా పేరుతో దేవుడున్నాడు. కావున దేవునకు ఈ నింద రాదు. యొహోవాను ఆరాధించిన వారు కూడా పరలోకమునకు పోవుదురు.

స్వామి: మంచిది. అయితే ఈ భారతదేశమునకు యొహోవాను గురించి కాని, క్రీస్తును గురించి కాని వాస్కోడిగామా ఇండియాకు రాకముందు వరకు ఏమీ తెలియదు. మరి ఈ భారతదేశమున వాస్కోడిగామా రాకముందున్న జీవులందరును నిష్కారణముగా అన్యాయముగా నరకమునకు పోయినారు. వారికి యొహోవా క్రీస్తుల గురించి తెలియకపోవుట వారి తప్పుకాదు. తెలిసి ఆరాధించకపోయినచో వారి తప్పు ఒప్పుకొనవలసినదే. వారికి భగవంతుడు యొహోవా, క్రీస్తుల గురించి తెలియచేసి ఉండవలెను. అనగా ఒక చిన్న దేశమునకే కాక, అన్ని దేశములనున్న సర్వజీవులకు యొహోవా, క్రీస్తుల గురించి ఏల తెలియబడలేదు? ఒకేసారి కేవలము ఒక దేశమునకే యొహోవా, క్రీస్తుల గురించి ఏల పరిమితమైనది? ఆ దేశము వారికి అవకాశము ఇచ్చుట దేవుని పక్షపాతము కదా? మీ సిద్ధాంతమున జీవునకు పునర్జన్మ లేదు. కావున భారతదేశమున ఆనాటి తరములందరును యొహోవా, క్రీస్తుల గురించి తెలియక అన్యాయముగా నరకమున పడినారు! పోనీ మరల భూమిపై జన్మించి యొహోవా, క్రీస్తుల గురించి ఇప్పుడు తెలుసుకొను అవకాశము కూడా లేదు కదా. ఏలననగా వారికి పునర్జన్మ లేదు కదా! కావున మీ వాదము దేవునకు పక్షపాతము అంటకట్టుచున్నది అనుట నిస్సంశయము.

ఫాదర్: సరే దేవుడు పక్షపాతము కలవాడన్న వాదము మీ మతమునకూ అంటక తప్పదు. ఏలననగా మీరు నారాయణుడు, కృష్ణుడు తెలియనివారు నరకమున పడుదురని వాదించుచున్నారు గదా. విదేశములకు పాత కాలములో నారాయణ, కృష్ణుల గురించి తెలియక నరకమున పడినందున మీ దేవునకు గూడ పక్షపాతము వచ్చినట్లే గదా!

స్వామి: మంచి ప్రశ్న వేసినావు. క్రీస్తు, యొహోవాల గురించి తెలియని వారు నరకమున పడుదురనువారు వీరక్రైస్తవులు. అలానె కృష్ణుడు, నారాయణుడు గురించి తెలియని వారు నరకమున పడుదురన్న మా హిందువుల శాఖ వారు వీరవైష్ణవులు. ఈ రెండు మతముల వలే వీరశైవులునూ ఉన్నారు. వీరు శివుని ఆరాధించకపోయిన నరకప్రాప్తియని వాదింతురు. హిందూమతములో వీరశైవ, వీరవైష్ణవ మతములవారు ఇట్లే కలహించుకొనుచున్నారు. హిందూమతము ఒక చిన్న విశ్వముగా ఉన్నది. హిందూ మతములోని అవాంతరమతములగు శైవ, వైష్ణవ మతములలోనే ఏకత్వమును చూడలేని వారు, ప్రపంచ మతములలో ఏకత్వమును చూడగలరా? ఇంటిలోని గోడలను పగులకొట్టి, ఇల్లు మొత్తము ఒకే హాలు చేయలేని వారు, ఇండ్ల మధ్యగోడలను పగులకొట్టి అన్ని ఇళ్ళను ఒకే ఇల్లు చేయగలరా? కావున ఈ వీర మతములన్నియు దేవునకు పక్షపాతమును తెచ్చుచున్నవి. కానీ, దేవుడు నిష్పక్షపాతియని నిరూపించుటకు ఒకే ఒక మార్గమున్నది. అది ఏమనగా--అన్ని కాలములందును, అన్ని దేశములందును, ఒకే దేవుడు భిన్న రూపములతో వచ్చి, ఒకే జ్ఞానమును బోధించియున్నాడు. కావున, ఆ జ్ఞానమును అనుసరించినవారు అన్ని కాలముల, అన్ని దేశములలో ముక్తులగుచున్నారు. అనుసరించని వారు అన్ని కాలముల, అన్ని దేశముల నరకమున పడుచున్నారు.

Swami

చూడండి! ఈ సిద్ధాంతములో దేవుడు నిష్పక్షపాతియని నిరూపించబడుచున్నాడు. ఇంతకన్న వేరు మార్గము లేదు. కావున, నీ దేశకాలములకు సంబంధించిన నీ మతములో నీవు ప్రయాణము చేయుము. తప్పక లక్ష్యము చేరుదువు. పరమతమును విమర్శించవద్దు. నీ మతమును ఇతర మతస్థులపై రుద్దవలదు. అది మతాహంకారము అగును. నీవు తలవంచుకొని, పక్కమతముల వైపు చూడక నీ మతమున ప్రయాణించినచో నీవు తప్పక దేవుని చేరుదువు. అన్ని నదులూ, సముద్రమునే చేరును. ఒక నది "నేనే సముద్రమును చేరుచున్న ఏకైక నదిని" అని అహంకరించినచో, దేవుడు ఆ నదికి అడ్డముగా ఆనకట్టను కట్టించును. ఆ నది తప్ప, ఇతర నదులన్నియును సముద్రమును చేరును! నీవు నీ మతములో ముందుకు పోతే లక్ష్యమును చేరగలవు. అట్లుకాక అడ్డముగా పరమతములోకి పోతే, ఆ మతములో లక్ష్యము నుండి అదే దూరములో ఉంటావు.

నీ మతమును స్తుతించుము. కాని ఇతర మతమును నిందించకుము. దేశ, కాలభేదము వలన భాషా వ్యవహార సంస్కారములు మారుచున్ననూ, మానవుడు ఒక్కడే. అలానే అన్ని దేశములందు అవతరించిన అవతారములలో కూడా దేశ, కాలభేదము కనిపించిననూ, దేవుడు ఒక్కడే. అలానే దేవుని చేరు మార్గములైన మతములలో - క్రీస్తు ఎలా భక్తుల పాపములను తాను భరించి, జీవులకు పుణ్యఫలములనిచ్చు దయామయుడో అలానే కృష్ణుడు కూడా, కుచేలుని పాప ఫలమగు దారిద్ర్యమును తాను తీసుకొని, తన సంపదనంతయును భక్తుడగు కుచేలునకు ఇచ్చుటకు సిద్ధపడలేదా? "అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి – అనగా అ మీ పాపములనన్నింటి నుండి మీకు విముక్తినిచ్చుచున్నాను" అని అనలేదా? కావున క్రీస్తు అయినా, కృష్ణుడు అయినా ఆ కరుణాతత్త్వము ఒక్కటే.

దత్తావతారములన్నియును భక్తుల పాపకర్మఫలములను ఆకర్షించుకొని తాము అనుభవించి, భక్తులకు సౌఖ్యమును కలిగించుట అందరూ చూచుచున్నారు కదా! (స్వామి తన భక్తుల రోగములను ఎన్నిసార్లు తనపై ఆకర్షించుకొని అనుభవించుట, స్వామి భక్తులమైన మనము ఎన్నిసార్లు చూడలేదు?)

ప్రతిమతములోను జీవులు వివిధస్థాయిలలో ఉన్నారు. ఆ స్థాయులననుసరించి, ఆ మతములోనే వివిధ బోధలున్నవి. ఆంధ్రలో, స్కూల్, కాలేజీ స్థాయిలలో సిలబస్ లు తెలుగులో ఉన్నవి. తమిళనాడులో అదే స్కూల్, కాలేజీ సిలబస్ లు తమిళములో ఉన్నవి. రెండు రాష్ట్రములలోను స్కూల్ సిలబస్ ఒక్కటే. అలానే కాలేజీ సిలబస్ కూడా ఒక్కటే. ఏ రాష్ట్ర విద్యార్థి అయినా స్కూల్ విద్యార్థి కన్నా కాలేజీ విద్యార్థి గొప్పయగును. అలానే, నీవు ఏ మతస్థుడవైననూ నీవు స్కూల్ స్థాయిలో ఉన్నావా? లేక కాలేజీ స్థాయిలో ఉన్నావా అనునది ముఖ్యము. తెలుగు స్కూల్ విద్యార్థి, తమిళ కాలేజీ విద్యార్థి కన్నా గొప్ప కాదు. రెండు భాషలూ సమానమే. అయితే స్కూల్ సిలబస్ కన్నా కాలేజీ సిలబస్ గొప్పది. తమిళ స్కూల్ విద్యార్థి తెలుగు స్కూల్ లో చేరినంత మాత్రమున గొప్పవాడు కాదు.

కావున నీ మతమును మార్చుకొనుట కాదు. నీ మతములో పై స్థాయికి పొమ్ము. అప్పుడు గొప్పవాడగుదువు. నీ తమిళభాషలోనే స్కూల్, కాలేజీ రెండూ ఉన్నవి. నీవు తెలుగు మీడియముకు మారనక్కరలేదు. అలానే ప్రతిమతములోను ఆది నుండి అంత్యస్థాయి వరకును జ్ఞానమున్నది. ఈ సత్యమును తెలియక పోవుటయే అజ్ఞానము. ఇదే మత ద్వేషములకు మూలమై ఇహలోకములో సుఖముగా ఉండుటకే అడ్డుగా మారుచున్నది. ఇట్టివారు పరలోక సుఖమును పొందుదురా! "ఉట్టికెక్కలేనివారు స్వర్గమునకు ఎక్కగలరా?"

ఈ సంభాషణము జరిగిన తరువాత ఆ ఫాదరు లేచి స్వామికి నమస్కరించి ఆశ్రునయనాలతో ఇలా అన్నారు. "క్రీస్తు మరల వచ్చును అన్నమాట నేడు సత్యమైనది. క్రీస్తు తప్ప ఎవరును ఇలా బోధించలేరు". స్వామి ఇంటికి రాగానే "చూశారా! అతడెంత విశాల హృదయుడో. అన్ని మతములలోను మంచి వారున్నారు. అట్టి వారి కొరకే నా యీ జ్ఞాన ప్రచారము అని వచించారు."

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch