home
Shri Datta Swami

 12 Dec 2025

 

ఏది నా నిజమైన ఆరాధనము?

[01-04-1993] ఆరోజు శ్రీదత్తస్వామి మా చేత శ్రీశైలములో శ్రీభ్రమరాంబ తల్లికి పూజ చేయించారు. ముగ్గురమ్మల చెంత దీపారాధన చేసి శ్రీసూక్తముతో, సౌందర్యలహరి, షోడశీమంత్ర సంపుటితో చిన్న పటం పెట్టించి భ్రమరాంబాతల్లికి కుంకుమార్చన చేయించారు. అపుడు అమ్మ ఇలా వచించింది – “నాన్నా! ఈ పూజలు తులాత్రాసులో తూచితే ఎడమ వైపు సత్యభామ తన ఐశ్వర్యముతో చేసిన పూజ, కుడివైపున రుక్మిణి, తులసి దళంతో చేసిన పూజలాగా ఉన్నది అని చిరునవ్వు చిందించినది అమ్మ. అమ్మ భ్రమరాంబ తల్లి నా శ్రీమతిని గురించి ఇలా వచించినది. దానితో చెప్పు నేను వెంట ఉంటాను, ఎల్లప్పుడూ రక్షిస్తాను. ఏమీ భయపడవద్దు అని. భక్తి అనగా శుద్ధ ప్రేమ. శుద్ధమనగా ఎట్టి ప్రతిఫలాపేక్ష లేకుండుట అని దత్తవాణి.

1992 నుండి 1996 వరకు గడచిన 4 సంవత్సరములలో ఈ పాషాణాలను రుద్దిరుద్ది మాకు ఒక ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించారు. స్వామి మాతో ఏమన్నారో తెలుసా? “మీకు ఏమీ తెలియకుండా ఉన్నది. ఈ 4 సంవత్సరముల కాలములో మీకు బ్రాహ్మీస్థితిని ప్రసాదించాను. యుగయుగాలు తపస్సు చేసినా అందని బ్రహ్మపదవి అది.” ఆహా స్వామి ధన్యులము. మేము క్షంతవ్యులము అని ప్రణమిల్లుదుము.

నా పై దృష్టిని స్థిరముగ నిలుపుము. త్రిప్పకు పక్కకు
నాదు నామము నీదు ఊపిరి శబ్దము చేయుము
నా ఆజ్ఞ లేకయే యేవ్వడేమియు నీకీయలేడు.
నన్నర్థించియే దేవదేవతలు వరములు నిత్తురు.
నన్ను తెలిసినవాడు ఎవ్వడూ అన్యుల చూడడు.
అన్ని చివరల చిట్టచివరి వాడను నేనే.
నీపై దయతో స్వయముగ వచ్చితిని.
నీవు తరించగ-కంటి మాయ పొరలను త్రోసి గుర్తు పట్టుము.
ఋషులును దేవతలును గుర్తు తెలియక వెదకుచుండగా.
నీదు ఇంట, నీదు వెంట, నీదు జంట ఉంటినే
అని మమ్ములననుగ్రహించారు.

ఇలా ఉండగా శ్రీదత్తభక్తులు కొన్నాళ్ళు మా ఇంటికి రాలేదు. గుంటూరు నుండి నరసరావుపేటకు వెళ్ళేవారు. మేము జాబు వ్రాసాము. “స్వామీ! ఈ భక్త పరమాణువులను మరచిపోయావా? తండ్రీ?” అని. శ్రీదత్తభగవానులు ఇలా తిరుగు జాబు వ్రాసారు. “సాధన సారాంశము ప్రచారము చేసి పతితులగు నీ సోదరులను అనగా నా బిడ్డలను ఉద్ధరించు. తండ్రికి ప్రయోజకుడైన పుత్రునిపై దృష్టి ఉండును. అయితే, పతితుడైన పుత్రుని పైననే విశేషముగా దృష్టియుండును. అంత మాత్రమున నీపై నాకు ప్రేమ లేదనియు, లేక తగ్గినదనియు కాదు. తండ్రికి జ్యేష్ఠపుత్రుని వలె సాయము చేయుచున్న వాడిలా, నీవు నా అంత వాడవని అర్థము. నీపై నాకు ప్రేమ తగ్గినచో నాపై నాకు ప్రేమ తగ్గినట్లేగదా. తన్ను తాను ప్రేమించుకొనని వాడు ఎక్కడైనా ఉండునా? కావున “జ్యేష్ఠః పితృసమో భ్రాతా”. అనగా జ్యేష్ఠ కుమారుడు తండ్రితో సమానమైన వాడని శాస్త్రము. అందువలన ఈనాటి నుండియు పూర్ణతృప్తితో, పూర్ణ శాంతితో నా ఆదేశమును పాటించి, పతితులైన అన్యసోదర జీవులను ఉద్ధరించు కార్యక్రమములో పాల్గొనుము. నీవెన్ని జన్మలెత్తినను చేయవలసినది ఇదియే. నేను ఎన్ని అవతారములనెత్తినను కూడా చేయవలసినది ఇదియే” అని అనుగ్రహించారు. ఇంకా ఇలా అన్నారు.

స్వామి దత్తభక్తులుగా వ్యవహరించు రోజులవి. హైదరాబాద్‌లో మా కాత్యాయని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా శ్రీదత్తభక్తులు మా దంపతులను దగ్గర తీసి మా చేతిలో శ్రీదత్తాత్రేయస్వామి వారి చిత్ర పటమును, చిన్న పారాడే బాలకృష్ణుని విగ్రహమును పెట్టి “నేను ఈనాటి నుండి మీకు దత్తపుత్రుడనైనాను” అని అన్నారు. అంటే శ్రీదత్తభక్తులకు మేము తల్లిదండ్రుల మైనామనే గదా! స్వామి ఇంకా అన్నారు - మీరు సాక్షాత్తుగా అప్పటి అత్రి-అనసూయలే అని. అహా! దేవరహస్యములను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వివరించి మాదంపతులను ధన్యులను చేసారు సద్గురువులు శ్రీదత్తస్వామి వారు.

Swami

[శ్రీ శైలంలో 02.04.93]

శ్రీదత్తభక్తులలో (స్వామిలో) శ్రీనరసింహసరరస్వతిగా వచ్చిన శ్రీగురుడే ఆవహించారు. మమ్ములను కూడా భోజనానికి కూర్చోపెట్టారు. శ్రీదత్తప్రభువు యొక్క ప్రసాదము అనుగ్రహించారు. మావద్ద భిక్ష స్వీకరించారు. ఆపై చాలా సంతోషించారు. భోజనానంతరం హస్తమస్తక స్పర్శచే మాకు కైవల్యప్రాప్తిని అనుగ్రహించారు. ఆనాటి దివ్యవాణి లో “శక్తి వృథా చేసుకొనవద్దు. పసిపాపలు కాదు గదా, సదా నా పాదపద్మముల నాశ్రయించి, తరించండి అని వచించారు శ్రీదత్తుడు. “కాలము-శక్తి” వీటియొక్క ప్రాముఖ్యమును గ్రహించి నడుచుకోవాలి. ఈ రెండూ సాధనలో చాలా ముఖ్యములు.

[03.03.2007]

బ్రహ్మమును తెలుసుకొనిన వాడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మమును బ్రహ్మము తప్ప ఎవరు తెలుసు కొనలేరు. కనుక బ్రహ్మమే బ్రహ్మజ్ఞాని యని తెలుసుకోవాలి. బ్రహ్మమును ఎవరూ తెలుసుకొనలేరు. కాని బ్రహ్మము ఏ నరశరీరములో ఆవహించియున్నదో గుర్తించవచ్చును. అట్లు గుర్తించిన వాడు కూడా బ్రహ్మజ్ఞానిగా పిలువబడతాడు. ఉదాహరణకు శ్రీరామచంద్రుని గుర్తించిన హనుమంతుడు, శ్రీకృష్ణుని గుర్తించిన గోపికలు, వీరందరినీ ఇట్లే గ్రహించవలెను. మా దంపతులకు శ్రీదత్తుని ఆజ్ఞ ఈ విధముగా ఉన్నది: “నా సందేశములను గ్రంథరూపంచేసి, ముద్రించి, ఎందరో జీవులకు నా ప్రాప్తి యందు సహకరించుటకు చేయు ఈ ప్రయత్నము కూడా నా ఆరాధనమే. ఎందరు దీని చేత తరింతురో, వారి అందరి పుణ్యముల భాగములు నిన్ను చేరుచున్నవి. కాన నా తత్త్వప్రచారము వలన చాలా పుణ్యమును సాధించుకొని దాని ద్వారా నా అపరిమిత అనుగ్రహమునకు పాత్రులగుదురు. మిగిలిన సాధన అంతయు నిన్ను నీవు ఉద్ధరించుట కొనుట. కాని, ఇది పరులను ఉద్ధరించుట కాన నా కార్యక్రమమున నీవు భాగముగొని, నా కృపకు పాత్రుడవగుదువు అని మా దంపతులకు ఆజ్ఞ ఇచ్చారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch