home
Shri Datta Swami

 03 Nov 2025

 

నారాయణుడు అనగా ఎవరు?

Updated with Part-4 on 06 Nov 2025


Part-1   Part-2   Part-3   Part-4


Part-1

[16.12.2002] నారాయణుడు అనగా ఎవరు? "నారం అయనం యస్య సః నారాయణః" అనగా నారమును ఆశ్రయించిన వాడు నారాయణుడు. "నారము" అనగా ఏమి? నరునకు సంబంధించినదే నారము. నరుడు అనగా అర్థమేమి? ‘‘న రీయతే క్షీయతే ఇతి నరః’’ అనగా నశించని వాడు నరుడు అని అర్థము. నరునకు బాహ్య శరీరము ఉన్నది. దాని యందు వ్యాపించిన చైతన్యము అను జీవుడున్నాడు. శరీరము నశించినను జీవుడు నశించక పరలోకమునకు పోవుచున్నాడు. కావున జీవుడు నిత్యుడు. శరీరము కూడ నశించినట్లు కనబడుచున్నదే కాని నశించుట లేదు. ఏలయనగా శరీరము లోని పంచభూతములు సృష్టిలోని పంచభూతములతో కలయుచున్నవి. ఆ పంచభూతములు మరల ఇతర శరీరములకు కారకములగుచున్నవి. కావున జీవుడు నిత్యుడే. శరీరములోని పంచభూతములు కూడా నిత్యములే. ఈ శరీరము యొక్క రూపము మాత్రము నశించుచున్నది. కావున నరుడు అనగా నిత్యుడు, అనగా జీవుడు మరియు శరీరము అని తీసుకొనవచ్చును. శరీరము బాల్య, యవ్వన, కౌమార, వార్ధక దశలు అన్నింటి యందును నిత్యముగనే ఉన్నది కదా. మనము నరుడు అన్నప్పుడు కూడ ఒక మనిషి అను అర్థమునే తీసుకొనుచున్నాము. అనగా జీవునితో కూడిన శరీరమునే తీసుకునుచున్నాము. కావున శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవునితో కూడిన ఒక నర శరీరమును ఆశ్రయించిన వాడే నారాయణుడు. "మానుషీమ్‌ తను మాశ్రితమ్‌" అను గీత కూడా నేను మనుష్య శరీరమును ఆశ్రయింతును అని చెప్పుచున్నది. ఐతే పరమాత్మ అవతరించునప్పుడు ఆశ్రయించు నరశరీరములో ఉన్న జీవుడు నిర్గుణుడైన శుద్ధ చైతన్యము మాత్రమే. ఇట్టి శుద్ధ చైతన్య స్వరూపుడైన జీవుని పైన శరీరమును మాతృ గర్భములో యున్నపుడు పరమాత్మ ఆశ్రయించ వచ్చును. లేక పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు ఆశ్రయించ వచ్చును. మరి మాతృ గర్భమున శరీర పిండమున ఉన్న శుద్ధ చైతన్యమును జీవుడన్నారు గదా. మరి పరలోకము నుండి దిగివచ్చిన ఈ రెండవ జీవుడెవరు? అనగా పిండ శరీరమున ఉన్న జీవుడు శుద్ధ చైతన్యము.

Swami

పరలోకము నుండి వచ్చిన జీవుడు నానా కర్మవాసనా గుణములతో కూడిన చైతన్యము. ఒక ఉదాహరణము. ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర జడపదార్ధము. మాతృ గర్భంలో యున్న జడమైన పిండ శరీరము జడమైన ఆ పాత్ర వంటిది. ఆ పాత్రలో శుద్ధ జలమున్నది. పిండ శరీరములో యున్న శుద్ధ చైతన్యము శుద్ధ జలము వంటిది. ఇప్పుడు ఈ పాత్రలో యున్న శుద్ధ జలములో కొంచెము బురద నీరు కలిపినాము. ఈ బురద నీరే పరలోకము నుండి దిగి వచ్చిన జీవుడు. ఈ బురద నీటిలో కూడ శుద్ధ జలము ఉన్నది. అనగా దిగివచ్చిన జీవునిలో కూడ శుద్ధచైతన్యము ఉన్నది. ఐతే బురద నీటిలో శుద్ధ జలముతో పాటు మట్టి కణములు కూడ వున్నవి. ఈ మట్టి కణములే దిగి వచ్చిన జీవునిలో ఉన్న కర్మ వాసనా గుణములు. ఇప్పుడు బురద నీరు పాత్రలోని శుద్ధ జలముతో కలసినప్పుడు ఏమైనది? బురద నీటిలోని శుద్ధ జలము పాత్ర నీటిలోని శుద్ధ జలముతో కలసి పోయినది. అనగా పిండ శరీరములోని శుద్ధ చైతన్యము దిగివచ్చిన జీవుని యొక్క శుద్ధ చైతన్యము కలసిపోయినది. కాని మట్టి కణములు మాత్రము శుద్ధ జలములో కలసిపోవు. అట్లే వాసనాగుణములు శుద్ధ చైతన్యముతో ఐక్యము కాజాలవు. కాని శుద్ధ జలము అది మట్టి కణములు వేరు చేయని స్థితిలో కలసిపోయి శుద్ధ చైతన్యము కన్న విడిగానే యుండును. అట్లే వాసనా గుణములు కూడ శుద్ధ చైతన్యము నుండి వేరు చేయలేము. కాని గుణములు ప్రత్యేకముగా విడిగనే యుండును. ఇదంతయు జరిగిన తర్వాత చివరకు పాత్రలో బురద నీరు మాత్రమే మిగిలినది. అనగా మాతృ గర్భస్థ పిండకణము నందు పరలోకము నుండి దిగివచ్చిన జీవుడు మాత్రమే ఉన్నాడు. పాత్రలో ఉన్న శుద్ధ జలముతో బురద నీటిని కలిపిన తరువాత బురద నీటి యొక్క ప్రమాణము పెరిగినది. కాని మట్టి కణముల సంఖ్య పెరగలేదు.

అట్లే దిగివచ్చిన జీవుడు మాతృగర్భ పిండమున ప్రవేశించగనే వాని కర్మ వాసనా గుణములలో ఎట్టి మార్పు రాదు. కాకున్న శుద్ధ జలము యొక్క ప్రమాణము అధికమైనందున బురద నీరు మరింత అయినట్లు పరలోకము నుండి వచ్చిన జీవుడు మరింత శుద్ధ చైతన్యముతో చేరినందున బాగుగా బలపడును. అనగా జీవుని వాసనా గుణములు పిండ ప్రవేశము చేత బలపడుచున్నది. ఆ తల్లి తిను ఆహారము వలన లభించిన శుద్ధ చైతన్య శక్తి రోజు రోజుకు ఎక్కువ అగుచుండగా ఈ జీవునిలో వాసనా గుణములు నానాటికి బలపడుచుండును. ఈ బలపడిన వాసనా గుణములు ఆ జీవ శిశువును ప్రసవించిన తరువాత ఆ శిశు శరీరములో అకారణముగా ఏడ్చుట, అకారణముగా నవ్వుట మొదలగు క్రియలను కల్గించుచుండును. ఆ శిశువు రోజు రోజుకు అన్నశక్తి చేత శుద్ధ చైతన్యము వృద్ధి యగుచుండగా ఆ వాసనా గుణములు బాల్యమున వాటికి అనుకూలమగు మంచి చెడు కర్మలను చేయించు చుండును. ఈ జీవుడు క్రమముగా బలపడి పెరిగి ఇతర జీవుల సంగము యొక్క ప్రభావము చేత కొత్త కొత్త వాసనలను సంపాదించుకొని, తదనుగుణముగా కొత్త కొత్త కర్మలను చేయుచుండును.

 

Part-2

కాని పరమాత్మ అవతరించునపుడు జరుగు విషయము దీని కన్న వేరుగనున్నది. ఇదివరలో చెప్పిన పాత్రలో యున్న శుద్ధ జలమునకు కొంత చందన సుగంధ జలమును కలిపినప్పుడు ఆ పాత్రలో నున్న శుద్ధ జలమంతయు సుగంధ జలముగా మారుచున్నది. ఇదే విధముగా శుద్ధ చైతన్యముతో కూడిన గర్భస్థ పిండ శరీరము లోనికి ఈశ్వరుడు ప్రవేశించుచున్నాడు. ఈ ఈశ్వరునిలో శుద్ధ చైతన్యమను శుద్ధ జలముతో పాటు కలిసిపోయిన చందన సుగంధ రేణువులను కల్యాణ గుణములున్నవి. కావున ఇప్పుడు మాతృ గర్భపిండ శరీరమున జీవునకు బదులు పై లోకము నుండి దిగివచ్చిన ఈశ్వరుడున్నాడు. ఆ తల్లి ప్రసవించగనే ఈశ్వరావతార పురుషుడు జన్మించినాడు. మానవ శిశువునకు, అవతార శిశువునకు బేధమేమి? ఇరువురిలోను జడ శరీరము లను రెండు పాత్రలున్నవి. ఇరువురిలోను శుద్ధ చైతన్యమను శుద్ధ జలమున్నది. అవతార శిశువులో చందన సుగంధ రేణువులగు కల్యాణ గుణములున్నవి. మానవ శిశువులో వాని పూర్వ కర్మ వాసనా గుణములను మట్టి రేణువులున్నవి. గుణములను తీసివేసినచో ఈశ్వరుడు జీవుడు ఒక్కటియే అగుదురు. బురద నీటి పాత్ర నుండి మట్టి కణములను వడపోసినాము. సుగంధ జలపాత్ర నుండి సుగంధ రేణువులను వడపోసినాము. ఇప్పుడు మిగిలినది శుద్ధ జలముతో కూడిన రెండు పాత్రలు. ఈ రెండు పాత్రలలో ఉన్న శుద్ధ జలము ఒక్కటే. అనగా జీవునిలోను ఈశ్వరునిలోను ఉన్న శుద్ధచైతన్యము ఒక్కటే. ఈ శుద్ధ చైతన్యమునే బ్రహ్మము అన్నారు. కావున గుణములను తీసివేసిన నిర్గుణ చైతన్యము ఒక్కటే కావున జీవుడు బ్రహ్మమే ఈశ్వరుడు బ్రహ్మమే అన్నారు శంకరులు. ఇది నిజమే కాని శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేయలేము. శుద్ధ చైతన్యము గుణములకు ప్రాణము. ప్రాణము పోయిన కుక్కను కుక్క అని పిలువలేము. అది యొక రాయి వంటి జడ పదార్ధమే. ఆట్లే శుద్ధ చైతన్యము నుండి గుణములను వేరు చేసినపుడు వాటిని అసలు గుణములు అనలేము. గుణములను వదలి శుద్ధ చైతన్యము ఉండగలదు. కాని శుద్ధ చైతన్యమును వదిలి గుణములు ఉండలేవు. కాని నీటిని విడచి చేప ఉండలేదు. కావున సాధన యనగా జీవుడు తనలో నున్న పూర్వ కర్మ వాసనా గుణములను నిత్యము జ్ఞాన విచారణ అను వడపోత గుడ్డ సాయముతో వేరు చేయవలయును. అప్పుడు ఆ గుణములు నీటిని వదలిన చేపల వలె నశించును. అయితే అది మరల ప్రవేశించకుండా ఎంతో శ్రద్ధతో ఉండవలయును. ఏలయనగా మహా భక్తులకే ఒక్కొక్కసారి అహంకార, మాత్సర్యాది గుణములు ప్రవేశించుచున్నవి. పెక్కు మాటలేల? సాక్షాత్తు హనుమంతునికే యయాతి రక్షణమున క్షణకాలము అహంకారము ప్రవేశించినది.

నారాయణ ఋషి వెంట జన్మ జన్మల వెంట యున్న నర ఋషియగు అర్జునుడే గయుని రక్షణ విషయమున అహంకారమును పొందెను. ఈ జీవుని గుణములలో పునాది వంటి మూల గుణమే అసూయ. ఈ అసూయనే ఈర్ష్య లేక మాత్సర్యమందురు. అసూయయే అహంకారమునకు కారణమగుచున్నది. తన కన్న గొప్పవానిని చూచినపుడు అసూయ కలుగును. వాడి కన్నను నేను గొప్పవాడను అను అహంకారము కాలక్రమముగా అసూయ నుండి జనించుచున్నది. ఈ అహంకారము యొక్క శాఖోపశాఖలే మిగిలిన జీవగుణములు. కావున అసూయ పోగానే సర్వజీవ గుణములు నీటి నుండి విసిరివేయబడిన చేపల వలె నశించుచున్నవి. నీ ఎదురుగ నరాకారమున పరమాత్మ యున్నపుడు నీవు ఎంత శ్రద్ధగా ఆరాధించినను ఒకానొక రోజుకు నీలో అసూయ గుణము బయటపడక మానదు. ఆ నరాకార పరమాత్మ సిద్ధులను ప్రదర్శించినచో నీలో అసూయ మరింత బలముతో బయటపడును. అందుకే శ్రీ రాముని ద్వేషించిన వారు చాలా తక్కువ. శ్రీ కృష్ణుని ద్వేషించిన వారు చాలా ఎక్కువ. షిరిడి సాయిని నిందించిన వారు చాలా తక్కువ. సత్యసాయిని నిందించిన వారు చాలా ఎక్కువ. కావున సిద్ధులు విశ్వాసమును కల్గించినను, కాలక్రమమున జీవునిలో మాత్సర్యము కల్గించును. జీవునిలో స్వామిపై పెరుగుచున్న మాత్సర్యము జీవునికే తెలియక ఒక్కసారి అనుకోకుండా అకస్మాత్తుగా బయటపడును. కాని ఆ మాత్సర్యము పెరుగుదల స్వామికి గోచరించును. అది బయట పడక ముందే దానిని శాంతింప చేయుటకు (స్వామీ! క్షంతవ్యుడను. నేను అహంకరించలేదా? తాతయ్యగారి అబ్బాయి అయితే మీతో నాకేమి పని? అనలేదా? క్షమించండి స్వామి.) స్వామి తన్ను తాను తగ్గించుకొనుచు చండాలాది రూపములతో గోచరించును. అధమ నరుండను నేను అని చెప్పుకొనును. అప్పుడు ఆ మాత్సర్యము వానిలో శాంతించును. జీవునిలో మాత్సర్యము శాంతింపచేయుటకు స్వామి వాడు మరియొక ఔషధము ఏమనగా "సర్వజీవులు పరబ్రహ్మ స్వరూపులే" అనుట. దీనినే శంకరులు వాడినారు. ఈ ఔషధము చేత మాత్సర్యము పూర్తిగా శాంతించిన తరువాత కూడ గురువు చేసిన బోధ నిజమే అనుకొని "అహం బ్రహ్మాస్మి" అను భావములో కొందరు శిష్యులున్న సమయములో వారికి నిజమును బోధించ తలచినారు శంకరులు. నిజమును చెప్పినచో, ఇంక వారిలో మాత్సర్యము జన్మించదు అని నిశ్చయము చేసుకున్న తర్వాత తాను ఒకనాడు కరిగిన సీసమును త్రాగి మీరును బ్రహ్మమే అయినచో దానిని త్రాగమని శిష్యులను అడిగినాడు. అప్పుడు వారికి చిత్తశుద్ధి పూర్ణమైనందున మాత్సర్యము పుట్టలేదు. కావున దాసోహం అని శంకరుల పాదముల పడినారు. అయితే కొందరు చిత్తశుద్ధి పూర్ణముగా జరగని వారు మాత్సర్యము మరల విజృంభించుట చేత ఇది గారడి విద్యలెండు అని తలచి "అహం బ్రహ్మాస్మి" అని భావించుచునే యుండిరి.

 

Part-3

కావున ఆ జీవులను ఉద్ధరించుటకు శంకరులు రామానుజులుగ అవతరించినారు. తనను తాను స్వామి యని చెప్పుకొనుట జరిగిన ప్రమాదమును శంకరులు గుర్తించినారు. శంకరులు నిజముగా శంకరుడే. ఇది శ్రుతి ప్రమాణ సిద్ధము. "నమో వ్యుప్త కేశాయ చ" అని శ్రుతి. శివుడు ఎప్పుడును జటాజూటమును ధరించి యుండును. కాని రుద్ర నమకములో కేశములు గొరిగించుకున్నవాడని చెప్పబడినది. ఇది శ్రుతి వాక్యము కావున ఇది పరమ సత్యము. త్రోసివేయుటకు వీలులేదు. శివుడు శంకరులుగా అవతరించినపుడు సంన్యాసాశ్రమమున శిరోముండనము చేయించుకున్నాడు. కావుననే "శివోఽహం శివోఽహం" అని యెలుగెత్తి చెప్పినాడు. అహం బ్రహ్మాస్మి అని ఘోషించినాడు కాని ఈ జీవులు పరమానందయ్య శిష్యులు. ప్రతి శిష్యుడును శివోఽహం, అహం బ్రహ్మాస్మి అన్నారు. పరమానందయ్యగారు శిష్యులతో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. వెంటనే శిష్యులు పరమానందయ్యగారితో నేను చెప్పినట్లు పలకండిరా అన్నారు. అందుకే రామానుజులు సాక్షాత్తు విష్ణు స్వరూపులైనను, నేను విష్ణు భక్తుడగు శేషుని అవతారము అన్నాడు. అప్పుడు గాని శిష్యులు మేము స్వామి భక్తులము అని అనలేదు. రామానుజులు స్వామి అయినను తాను జీవుడనని చెప్పుకున్నారు. అప్పుడు జీవులు తాము కూడా జీవులమే అన్నారు. ఇదే జీవుల స్వభావము. దీనికి కారణము జీవుని కన్న అధికత్వమును ప్రత్యక్షముగ యున్న జీవుని రూపములో మాత్రము ససేమిరా ఒప్పుకొనరు. కావున స్వామి జీవుని రూపములో వచ్చినప్పుడు తనను తాను స్వామియని ప్రశంసించుకొనుట జీవులతో చాలా ప్రమాదకరము. ఎదో ఒక పరిపూర్ణ చిత్తశుద్ధి గల జీవునకు మాత్రమే అదియును ఏకాంతముగా తాను స్వామిని యని ప్రకటించును. ఒక్క అర్జునునకు మాత్రమే ఏకాంతముగా గీతలో తన్ను తాను పరమాత్మనని చెప్పుచున్నాడు. అన్ని మహిమలను చేసినను యాదవులకు ఎన్నడును తనని తాను స్వామియని చెప్పుకొనలేదు. అంత పరిపూర్ణ చిత్తశుద్ధి గల, అంతకు ముందు వేయి జన్మలలో ఒక్కొక్క జన్మలో వేయి సంవత్సరములు తపస్సు చేసిన నరఋషి అవతారమగు అర్జునునికే చెప్పినాడు. ఆ మాటను భీష్మ ధర్మరాజాదులకు కూడా చెప్పలేదు. కాని అట్టి అర్జునుడే గీతాబోధ జరిగినా, 18 అధ్యాయములు విన్నా, పదునెనిమిదో రోజు సాయంకాలమునకే మాయలో పడినాడు. యుద్ధము ముగిసి పాండవ శిబిరమునకు రథము రాగానే ప్రతిరోజు సారథియగు తాను ముందు దిగి రథ ద్వారమును తెరచిన తరువాత రథికుడు అర్జునుడు దిగు సంప్రదాయము విడచి, పార్థుని ముందుగా దిగమన్నాడు. ఆ క్షణములో రథికున కన్న సారథి గొప్పవాడు కానందున అహంకారముతో అర్జునుడు క్రిందకు దిగలేదు. కావున అర్జునిలోను అహంకారము ప్రవేశించినది. ఈ అహంకారమునకు కారణమేమి? కృష్ణునిపై గల అసూయయే. ఈ అసూయ ఎప్పుడు కలిగినది? భగవద్గీత చెప్పుటకు ముందు అర్జునునికి కృష్ణునిపై అసూయ కలుగలేదు.

ఏలననగా అంతకు ముందే జరిగిన గయోపాఖ్యానమున కృష్ణుని తాను గెలిచినాడు. కావున కృష్ణుడు తన కన్న తక్కువవాడు అన్న భావము వలన అసూయ కలగలేదు. మరియును తాను స్వామియని అప్పుడును ప్రకటించలేదు. అప్పుడే పదునెనిమిది రోజుల ముందే కృష్ణుడు తాను స్వామియని ప్రకటించుట, విశ్వ రూప దర్శనములో తాను గడగడ వణికి ఓడిపోవటము జరిగినది. కృష్ణుడు తాను పరబ్రహ్మమునని తెల్పుటయే కాక నిరూపించుట చేత అర్జునునకు అసూయ జనించినది. ఆ పదునెనిమిది రోజులలో అసూయ పెరిగి పెరిగి అహంకారమును మొలకెత్తించినది. ఇది పార్థునికి తెలియకుండగనే, పార్థుని మనములో జరిగిన పరిణామము. కావున స్వామి అవతరించినపుడు, తనను తాను స్వామియని ప్రకటించుకొనుటకు అర్హుడైన జీవుడు ఈ సృష్టిలో లేడు. ఒక్క జీవుడు తప్ప. ఆ జీవుడే రాధ. ఆ జీవుడు ఎప్పుడును ఓడిపోలేదు. ఆ జీవుడు ఎట్టి అడ్డునైనను దూకగల ఒక నిరంతర భగవత్ప్రేమ మహాధార. అట్టి జీవుని కూడ దత్తుడు నిరంతర పరీక్షలోనే పెట్టుచున్నాడు. తన లోకమునకు పైన గోలోకమును సృష్టించి ఆమె పాదముల క్రింద తన శిరస్సును నిలిపి, ఆమెకు ఏ క్షణమైన అహంకారము వచ్చునేమో అని పరీక్షించుచునే ఉన్నాడు. కాని ఆ జీవునిలో ఇంతవరకు అహంకారము ప్రవేశించలేదు. భవిష్యత్తులో కూడా ప్రవేశించదు. కావుననే అమె పదవి పదిలముగనే యున్నది. ఉండును కూడా. కాని ఆ రాజరాజేశ్వరి భక్తులగు శాక్తేయులు మాత్రము అహంకారముతో మిడిసిపడు చున్నారు. శక్తి యొక్క శ్రీ మత్సింహాసనము శక్తిలో అహంకారము ప్రవేశింపలేదు. శాక్తేయులలో అహంకారము ప్రవేశించినది. స్వామి కన్నను శక్తియే గొప్పదని వాదించుచున్నారు. అది శక్తికి పరీక్షయని వీరికి తెలియదు. పరీక్షించుట దత్తునికి స్వభావ సిద్ధమైన గుణము. రామానుజుడు తనను తాను శేషుడు అనుటలో అర్థము శేషుడు అనగా అవయవము అని అర్థము. అనగా తాను విష్ణువు యొక్క అంశయని అర్థము. సాక్షాత్తుగా స్వామి కాక పోయినను స్వామి యొక్క అంశయే అనుట చేత అద్వైతము మత్తు యొక్క నిషా కొంత తగ్గినది. మత్తును కూడా ఒక్కసారిగా క్రిందకు దించ కూడదు. ఆ తరువాత బ్రహ్మ దేవుని అవతారమగు మధ్వాచార్యులు వచ్చినారు. ఆయన నేను భగవంతునిలో అంశ కాదు. స్వామి కన్న వేరు. కేవలము స్వామి యొక్క దాసుడనే అని స్వామి సేవ్యుడు జీవుడు సేవకుడు అను సిద్ధాంతమును స్థాపించినాడు. ఆయన స్వయముగా స్వామి అయిననూ తనను మూడవ వాయుపుత్రునిగా వర్ణించుకున్నారు.

Part-4

హనుమంతుడు, భీముడు, మధ్వుడు అని వరుస చెప్పుకొని తనను తాను దాసుడనని శ్రీవారి యొక్క కాలి కుక్కనని చెప్పుకున్నారు. అప్పుడు జీవుల యొక్క అద్వైత నిషా పూర్తిగా దిగినది. వారు మేము స్వామిలో భాగము కాదు. స్వామి కంటె వేరు. దాసాను దాసులము అన్నారు. ఇట్లు మూడవ అవతారమునకు గాని జీవుల వారి యొక్క సత్యమైన స్థితికి రాలేదు. జీవుడు స్వస్థితికి వచ్చుటకు స్వామి మూడు అవతారములు ఎత్తవలసి వచ్చినది. కావున ఒక్క జీవుని ఉద్ధరించుటకు స్వామి వేల అవతారములను ఎత్తవలెను. జీవుని చేత సత్య వాక్యమును పలికించుటకు స్వామి మూడు భాష్యములను చెప్పవలసి వచ్చినది. ఒక వ్యక్తి రైల్వేస్టేషనుకు పోయి, Who is the station master? అని అడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I is the station master" అన్నారు. ప్రశ్నించినవాడు తన ప్రశ్నలో ఏ క్రియను వాడినాడో (is) అదే క్రియను (is) తన సమాధానములో వాడినాడు. కావున గురువు తనను గురించి తాను ఏమి చెప్పునో శిష్యుడు కూడ తనను గురించి తాను ఆనాడు కాకపోయినను మరియొక నాటి కైనను అదే పలుకును. అప్పుడా వ్యక్తి "Are you the station master? అని అడిగారు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు "I are the station master" అన్నాడు. అప్పుడా వ్యక్తి ఆ స్టేషన్‌ మాస్టరు చేత సరియైన ఇంగ్లీషు వాక్యము పలికించవలయునని I am the station master అన్నాడు. అప్పుడు స్టేషన్‌ మాస్టరు బల్లగుద్ది "I am the station master" అని కరెక్టుగా పలికినాడు. అట్లే శంకరులు తాను స్వామి అనగా, శిష్యులును తాను స్వామి అన్నారు. రామానుజులు తాను స్వామి యొక్క అంశలాగు భక్తుడననగా, శిష్యులు కూడ తాము స్వామి యొక్క అంశలాగ భక్తులమే అన్నారు. ఈ శిష్యుల చేత సత్యమును పలికించవలయునని మధ్వాచార్యులు "నేను వేరు, స్వామి వేరు, నేను స్వామి దాసుడను" అని చెప్పగా శిష్యులు కూడా "నేను వేరు, స్వామి వేరు, నేను స్వామి దాసుడను" అని పలికారు. ఈ విధముగా "సోఽహం" అని ఆరంభించి "దాసోఽహం" అను మాటతో ముగిసినది.

||శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనమ్||

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch