home
Shri Datta Swami

 29 Oct 2025

 

నిజమైన బ్రాహ్మణుడెవరు?

Updated with Part-2 on 30 Oct 2025


Part-1   Part-2


Part-1

[09.03.2000 ఉదయం 6 గంటలకు]

బ్రహ్మోఽహం బ్రహ్మదేవోఽహం, బ్రాహ్మణోఽప్యహమేవ చ |
ఇతి మాం యో విజానాతి, బ్రహ్మజ్ఞానీ స ఉచ్యతే ||

అనగా–బ్రహ్మము నేనే. బ్రహ్మదేవుడను నేనే. బ్రాహ్మణుడన్నను నేనే. ఇట్లు నన్ను ఎవరు తెలుసుకొందురో వారే బ్రహ్మజ్ఞానులు. ‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ – నేహ నానాస్తి కించన’ అని శ్రుతి. అనగా బ్రహ్మ ఏకము. నానాత్వము (multiplicity) లేదు అని అర్థము. ఏకత్వమును అర్థము చేసుకొనక, జాతిమత కుల భేదములతో నున్నంత కాలము బ్రహ్మజ్ఞానము లేనట్లే. అట్టివారికి బ్రహ్మత్వము చాల దుర్లభము.

Swami

బ్రాహ్మణుడు మిగిలిన కులములను తన సొంత తమ్ముళ్ళనుగా చూసుకొనుచు, వారి ఆధ్యాత్మిక అభివృద్ధికై పాటు పడవలెను. అప్పుడే అతడు నా జ్యేష్ఠకుమారుడనిపించుకొనును. ‘జ్యేష్ఠః పితృసమో భ్రాతా’ జ్యేష్ఠుడు తండ్రి యంతటివాడు. తండ్రి ఎట్లు తన పుత్రుల కొరకు పాటుపడునో, జ్యేష్ఠుడును తన కనిష్ఠసోదరులను ప్రేమించి ఉద్ధరించవలెను కానీ, వారిని ఈర్ష్యతో (jealousy) ద్వేషించరాదు. అట్లే ఇతర కులముల వారును బ్రాహ్మణులను తమ అన్నలవలె భావించి, అన్నలో తప్పులున్నను మన్నించి, వారిని గౌరవించవలెను. బ్రాహ్మణులు వేదమును స్వరసహితముగా అధ్యయనము ద్వారా, ప్రక్షేపములు రానీయకుండ రక్షించువారు. వారు ఎట్టి భోగములను అనుభవించక, వేదార్థమును లోకమునకు అందించుటకై వేదమును రక్షించిన పవిత్రులు. అయితే మధ్యకాలమున కొందరు అహంకార–అసూయలతో ఇతర కులములను కించపరచిన మాట నిజమే. ప్రస్తుతము బ్రాహ్మణులు తమ వారు చేసిన తప్పులను తెలుసుకొని పరివర్తనము చెందినారు. కావున, వారి తాత ముత్తాతలను వేలెత్తి చూపించి వారిని ద్వేషించుట ధర్మము కాదు. తాత తండ్రుల ప్రవర్తనకు వారేమి చేయగలరు? కశ్యపమహర్షికి రావణుడు జన్మించలేదా? హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడు జన్మించలేదా? పూర్వబ్రాహ్మణులు కశ్యపుని వంటి ఉత్తములు. వారికి మధ్యకాల బ్రాహ్మణులను రావణాసురులు జన్మించిరి. మరల వారికి ప్రహ్లాదులు వంటి ఉత్తములు జన్మించి ఉన్నారు. ప్రహ్లాదుని గౌరవించుటకు కశ్యపుని ఉత్తమత్వము చూడనవసరములేదు. అలానే, హిరణ్యకశిపు, రావణులను తలచి, ప్రహ్లాదుని నిందిచనవసరములేదు. పూర్వుల ప్రవర్తన వారిదే. ఏ జీవుల సంస్కారము వారిదే.

ఒక జీవునికి మరియొక జీవునకు ఎట్టి సంబంధములేదు. ఒకరికి మరియొకరు పుట్టుట అనునది నాటకము. నాటకములో తండ్రి కుమారుల సంబంధమెంత నిజమో, ఈ విశ్వనాటకములోను అంతే. ఈ చేతన శరీరములను త్యజించిన తరువాత ఈ జీవులు ఒకరినొకరు గుర్తించరు. నాటకము ముగిసిన తరువాత తండ్రి-కుమారుల సంబంధము ముగిసినది. మరియొక నాటకములో ఈ ఇరువురికి మరియొక సంబంధముండును. ఒక నాటకములో బ్రాహ్మణవేషమును ధరించిన వాడు, మరియొక నాటకములో చండాలవేషమును ధరించవచ్చును. ఒక నాటకములో చండాలవేషధారి మరియొక నాటకములో బ్రాహ్మణవేషమును ధరించవచ్చును. ఈ నటులు బ్రాహ్మణులు కారు, చండాలురూ కారు. అట్లే ఒక జన్మ బ్రాహ్మణునిగా జన్మంచిన వాడు మరియొక జన్మలో చండాలుడు కావచ్చును. గురుచరిత్రలో ఒక చండాలుని చేత, వాని పూర్వ బ్రాహ్మణజన్మ స్మృతిని తెప్పించి వేదములను పలికించినట్లు కలదు కదా.

అష్టావక్రసంహితలో ‘ఒక జన్మలో మాతాపుత్రులుగా జన్మించినవారు, మరుసటి జన్మలో భార్యాభర్తలుగా జన్మించిరి’ అని కలదు. ఈ శ్లోకము రాగానే ఒక పండితుడు, తాను చెప్పు పురాణ ప్రవచనమును ఆపి, ఈ శ్లోకార్థమును ఎట్లు చెప్పగలను? అని దిగులుతో కృశించుచు మంచమెక్కినాడు. అట్టి పండితుడు నా వద్దకు వచ్చునట్లు చేసుకొని వాని ప్రశ్నను విని నేను ఇట్లు పలికితిని ‘అయ్యా! అష్టావక్రుడు నిజమే చెప్పినాడు. మీ ఇంటి వద్ద రెండు సినిమాహాళ్ళు కలవు కదా. ఒక సినిమాహాలులో ఇద్దరు నటీనటులు భార్యాభర్తలుగా నటించినారు. ప్రక్కనే సినిమాహాలులో ఆ ఇద్దరు నటులే మాతాపుత్రులుగా నటించుచున్నారు కదా! ఈ విశ్వమంతయును ఒక సినిమాయే కదా. ఈ జీవులు అందరును మాయాకల్పితులగు నటులే కదా. ఈ రెండు సినిమాలూ ఆడుచున్నవి. ఆ నటులిద్దురును ఈ బాహ్యలోకములో భార్యాభర్తలు కారు, మాతాపుత్రులూ కారు. ఎవరికి వారే వేరుగా ఉన్నారు. అట్లే జీవులును, ఎట్టి సంబంధములు లేకయుందురు. ఈ సినిమాలోకి వచ్చునపుడు ఒక్కొక్క సినిమాలోకి ఒక్కొక్క సంబంధముతో వచ్చుచుందురు.’ అని బోధించగా, ఆ పండితుడు ఎంతో సంతోషముతో ఆరోగ్యవంతుడై తన పురాణప్రవచనమును కొనసాగించినాడు.

 

Part-2

కావున ఓ జీవులారా! నేను బ్రాహ్మణుడను, వీరు నా కులము వారు. వీరు నా భార్యాపుత్రులు అను కుల–బంధుత్వములను విడచి ప్రవర్తించుడు. వెనుక జన్మలో పరకులమువాడు నీ కులమువాడై యున్నాడు. నీ కులమువాడు పరకులమువాడై యున్నాడు. ఎవరిని నా భార్యాపుత్రులనుకొనుచున్నావో, వారు వెనుకజన్మలో పరకులములో జన్మించి నీకు శత్రువులై యున్నారు. ఎవరు ఈ జన్మలో నీకు పరకులమున జన్మించి నీకు శత్రువులుగా ఉన్నారో, వారే వెనుక జన్మలో నీ కులమున జన్మించి నీ కుటుంబమైయున్నారు. కావున, ఈ విశ్వనాటకభ్రమకు లోనుకావద్దు.

కావున, తాత-ముత్తాతలను చూపించి వర్తమాన బ్రాహ్మణులను అన్యకులముల వారు ద్వేషించరాదు. అట్లే తాత ముత్తాతలను చూపించి, బ్రాహ్మణులును అన్యకులము వారిని హీనముగా చూడరాదు. వర్తమానములగు గుణకర్మలను, సంసారములను బట్టి నిర్ణయించుకొనుడు. ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః’ అని చెప్పితిని. వారి వారి గుణములు, కర్మలు, బుద్ధులు, సంస్కారములను బట్టి కులములను నిర్ణయించుకొని అప్పుడు కులప్రకారముగా ఏకము కావలయును. వేదార్థవిచారముతో, బ్రహ్మజ్ఞానమును కలిగి, బ్రహ్మమును గుర్తించి, బ్రహ్మమును ఉపాసించువారు ఏ కులమువారైననూ బ్రాహ్మణులే. అట్టి వారందరును ఏకమై సత్సంగము చేయుడు. ఆహారము, ఆచారము, వ్యవహారములలో భేదము వలన, భోజన, వివాహాదులను ఎవరికి వారే చేసుకొనుడు.

రెండు కులములకు చెందిన స్త్రీ పురుషు లిరువురును ఒకే ఆహార–సంస్కారముల వలన వివాహము చేసుకున్నారు అనుకొనుడు. ఆ ఇరువురి వరకును బాగానే ఉన్నది. వారింటికి వరుడి బంధువులు కానీ, వధువు బంధువులు కానీ వచ్చినారు. వారు మాంసాహారులు కావచ్చును. వారితో కలసి భోజనము చేయుటకు వధూవరు లిరువురును నిరాకరింపవలెను. అది ఒకరికి కష్టము కావచ్చును. భార్యాభర్తలలో భేదము రావచ్చును. మాంసాహారమును జన్మ నుండి అంటకుండ, మంసాహారులగు వారితో కలసి భోజనము చేయని నియమము కలవాడు అన్యకులజుడైనను బ్రాహ్మణుడే. వానితో కలసి బ్రాహ్మణుడు భోజనము చేయవచ్చును. కానీ అట్టి నియమము దుర్లభము, కఠినము. కావున, ఆహార వివాహాదులలో వర్ణసాంకర్యము అనేక సమస్యలను తెచ్చును. ఆహార, వివాహాదులు ప్రధానములు కావు. అవి అత్యల్ప విషయములు. అట్టివి సాంకర్యము చేసుకొన్నను సాధించినది ఏమియును లేదు. ఈ జన్మలోనే యీ ఆహార వివాహాదులన్నియును నశించుచున్నవి. అవి ఈ విశ్వనాటకములోనివి. కావున, వాటిని గురించి ప్రాధాన్యతనీయవలదు.

మాంసాహారమును త్యజించి, జీవహింసను నిషేధించిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. రాముడు, కృష్ణుడును మాంసాహారులు కాదు. వారు క్షత్రియులైననూ, నా అవతారములు. రామాయణములో పంచవటిని నిర్మించిన తరువాత రాముడు జింకను వేటాడినట్లు చెప్పినది – రామాయణములో దూర్చిన ప్రక్షేపము. ‘న మాంసం రాఘవో భుఙ్క్తే న చాఽపి మధు సేవతే’ అని కలదు. అనగా రఘవంశమున పుట్టిన వాడెవడును మాంసాహారమును తినడు, మద్యమును తాగడు అని ఆ రామాయణ శ్లోకార్థము. జనులను బాధించు క్రూరమృగములనే వేటాడుట క్షత్రియధర్మము. క్రూరమృగము కాని గజమును వేటాడినందుకు దశరథుడు శాపమును పొందినాడు. కాలభైరవ దైవమతము కల కాపాలికులును శవభక్షకులే. అనగా ఒక ప్రాణి ప్రమాదవశమున మరణించిన దానిని తిందురు. అంతే కాని వధించి తినుట కాదు. ఆ అర్థము తరువాత భ్రష్టమైనది. వృక్షములలోను ప్రాణము కలదు. కానీ వాటి యందు జీవత్వము అల్పము. వాటి యందును అహింసాధర్మమే పాటించవలెను. వరిపంట మొక్కలు సంవత్సరాంతమున మరణించిన తరువాత తింటారు కాన పాపము కాదు. రాలిన ఆకులనే తిని పార్వతి తపస్సు చేయుట వలన అపర్ణ అనబడినది గదా.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch