03 Oct 2025
[21-05-1997 11.00 am] నీవు చింతించకుము. నాపై పూర్ణ విశ్వాసము ఉంచినవాడు ఎవ్వడునూ చింతించడు-శోకించడు. ఏలననగా నేను వానిని సదా రక్షింతునని అచంచల విశ్వాసము వానికి కొండవలె హృదయములో స్థిరముగా నిలచియుండును. నన్ను విశ్వసించినను, విశ్వసించకపోయినను కర్మఫలభోగము ఎవ్వరికిని తప్పదు. అయితే నా భక్తుడు కర్మఫలములను అనుభవించుచు వాటి ద్వారా అహంకార మమకారములను త్రెంచుకొని, జ్ఞానమును పొంది, ఉద్ధరింపబడి, మరల ఈ కర్మ చక్రమున చిక్కుకొనడు. నా భక్తుడు కానివాడు కర్మ ఫలములను అనుభవించి, మరల అనేక కర్మలను చేయుచూ మరల కర్మఫలభోగములతో కర్మచక్రమున చిక్కుకొని పరిభ్రమించుచుండును. కావున కర్మఫలభోగము నా భక్తుడైనను, కాకున్ననూ తప్పదు. అయితే నా భక్తుడు కర్మఫలము అనుభవించు సమయమున మనస్సుకు అంటనీయకుండా నేను వాని చుట్టునూ చక్రాకారమున నుండి రక్షింతును. వాడు లోకము దృష్టిలోను, కఠిన శాసనముచేయు ధర్మదేవత దృష్టిలోను కర్మఫలము అనుభవించుచున్నట్లు కనపడుచుండును. కావున కర్మసిద్ధాంతమునకు, కర్మచక్రమునకు భంగము కలుగనందున ధర్మదేవత సంతృప్తి చెందుచుండును. మరియును లోకులు కూడా నేను పక్షపాతముతో నా భక్తుని కర్మ ఫలమును రద్దుచేసితినని విమర్శించరు. కావున లోకముదృష్టిలో ధర్మదేవత దృష్టిలోను నా భక్తుడు తన కర్మఫలములను అనుభవించుచు నా చక్రావరణ రక్షణము వలన ఏమాత్రము బాధ మనస్సునకు అంటకుండుటచేత ఆనందముతో ఉండుటచేత నిజముగా కర్మఫలమును రద్దుచేయబడిన వానితో సమానమే అగుచున్నాడు. అయితే విశ్వాసము సడలినచో నా చక్రావరణము బలహీనమై కర్మఫలము జీవునకు అంటుచున్నది. నాపై విశ్వాసము పరిపూర్ణముగా యున్నవాడు అత్యంత బలమైన నా యోగచక్రావరణ రక్షణము వలన కర్మఫలమును ఏమాత్రము అనుభవించడు.
కావున, పుత్రుడా! విశ్వాసమును సడలనీయకుము. నీ చుట్టును నేను చక్రాకారముగా నిలచియున్నాను. నీ విశ్వాసమే నా బలము. నన్ను బలహీనుని చేయకుము. ఎట్టి పరిస్థితులలోను నాపై దృష్టిని చెదరనీయకుము. కర్మ ఫలములు మారి మారి సుఖదుఃఖముల రూపములలో వచ్చుచుండును. దుఃఖములేని సుఖము వ్యర్థము. అప్పుడు సుఖము యొక్క రుచి తెలియదు. నిజముగా సుఖమే నీ శత్రువు. అది అహంకారమును బుద్ధిమాంద్యమును నీలో ప్రవేశింప చేయును. దుఃఖము నీలో అహంకారమును నశింపచేసి వినయమునిచ్చి బుద్ధికి పదును పెట్టి నా జ్ఞానమును గ్రహించునట్లు చేయును. దుఃఖమే నీ మిత్రుడు. ఈ సర్వ దుష్కర్మఫలములను ఆకర్షించి ఈ జన్మలోనే అనుభవింపచేసి నీ సత్కర్మ ఫలములను నా అనుగ్రహముచే అనంతముగా చేసి నీకు ప్రసాదింతును. నా అనుగ్రహమువలన నీ దుష్కర్మఫలములన్నియు చాలా అల్పముగా చేయబడినవి. నీవు వాటి ఛాయను మాత్రమే అనుభవించుచున్నావు. నిజముగా వాటినన్నింటినీ నీ కొరకై నేను అనుభవించుచున్నానని తెలియుము. ఆ ఛాయ కూడా నిన్ను ఉద్ధరించుట కొరకే తప్ప ఆ ఛాయను కూడా నేను అనుభవించలేక కాదు. కావున క్షణక్షణము మారుచుండు అలలవంటి బాహ్యపరిస్థితులపై దృష్టిని ప్రసరింపచేయక, నిశ్చింతగా నాయందే నీ స్థిరదృష్టి నుంచుము. నీకు అన్న పాన వస్ర్తములకు లోటు రానివ్వను. దానిని గురించి కలలోనైనను అనుమానించకుము. ఇక నీ కర్తవ్యములను నేనే వహించెదను. నీవు ఎంత ప్రయత్నించినను నీ కర్తవ్యములను సరిగా చేయలేవు. నాకు సంపూర్ణ శరణాగతి చేసితివేని, నీ బాధ్యతలన్నింటిని నిర్విఘ్నముగా లోకము చూసి ఆశ్చర్యపడునంత స్థాయిలో నేను నిర్వహించెదను. ఇన్ని భువనములను నిర్వహించు నాకు ఇది ఒక లెక్కయగునా? కావున ఈ క్షణము నుండియు నీవు ఏమాత్రము చింతించినను, శోకించినను నేను నిన్ను పరిత్యజించి వెడలిపోవుదును. చింత, శోకము, అనుమానము, తర్కము, లౌకికము విశ్వాసమునకు పట్టు చీడపురుగులు. నాకు లౌకికుడు ఇష్టుడు కాడు. పరిపూర్ణ విశ్వాసముతో యుండు ఛాందసుడే నాకు పరమ ఇష్టుడు. లౌకికములో విశ్వాసము అసంపూర్ణముగా యుండును. నీవు భయపడకుము. నేను నీ వెంట ఎప్పుడూ వున్నాను. నిన్ను ఈ జన్మలోనే కాదు రాబోవు జన్మలన్నింటి యందును నీ వెంటనుండి, నీలో నుండి, నిన్ను సదా రక్షంతునని నాపై నేను ప్రమాణము చేసుకొని వాగ్దానము చేయుచున్నాను.
శ్లో|| సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||
★ ★ ★ ★ ★