home
Shri Datta Swami

 10 Jun 2025

 

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 14

నిదురించని శయ్యపై పాదముద్రలు

2001 సం॥ డిసెంబరు 30 నాడు దత్తజయంతి అద్భుతంగా అనేక భక్తబృందముతో జరిగినది. ఆనాడు స్వామికి పీఠమందిరం లోనే శయ్యను ఏర్పాటు చేసినాము. ఫణితో స్వామి ఇలా అన్నారు - "ఈ రోజు రాత్రి దత్తుడు తప్పక మహిమను చేస్తాడు". కానీ ఆనాటి రాత్రి స్వామి శ్రీ కోనేరు సత్యనారాయణ గారింట్లో సత్సంగం చేయటానికి వెళ్ళారు. అందుకని పై మందిరం తాళం వేసి వచ్చారు. అందువలన క్రింది అంతస్థులోనే స్వామికి శయ్యను ఏర్పాటు చేయవలసి వచ్చింది. స్వామి వచ్చేటప్పటికి చాలా పొద్దు పోయింది. స్వామి వస్తూనే “పైన పడుకోమన్నారు కదా పోతాను” అన్నారు. "స్వామి! పై మందిరం తాళం వేశాము కదా! అందుకే ఇక్కడ శయనం ఏర్పాటు చేసాము" అని అన్నాము. స్వామి చిరునవ్వు చిందిస్తూ సరే అని రెండవ అంతస్థులోనే శయనించారు. ప్రొద్దుననే లేచి స్వామి స్నానాదులు ముగించుకొని కాలేజీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము మూడవ అంతస్థులో వున్న దత్తమందిరం తాళం తీసి చూస్తే శయ్యమీద శ్రీదత్తపాదాల ముద్రలు, వేలి ముద్రలు స్పష్టంగా కనిపించినవి. ఆహా! ఎంతటి మహిమ “తాళము వేసినా నేను ప్రవేశించలేనా” అన్నట్లు రాత్రి స్వామి చిరునవ్వుకు అర్థమని గ్రహించినాము. ఆహా! ఎంతటి అద్భుతం.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch