16 Jun 2025
దత్తసాక్షాత్కారమును కలిగించుట.
శ్రీ కోనేరు సత్యనారాయణ గారు దత్తాత్రేయ రూపమును చూడలేదు. ఒకసారి స్వామి దత్తహోమమును చేయునప్పుడు సత్యనారాయణ గారికి ఆ హోమాగ్నిలో శ్రీదత్తుడు సాక్షాత్కరించి దర్శనమిచ్చెను. ఆ తరువాత మా ఇంటిలో ఉన్న దత్తపీఠములో ఉన్న శ్రీదత్తుని చిత్రమును చూచి సత్యనారాయణ గారు ఆశ్చర్యపడినారు. సాక్షాత్తు అదే రూపములో శ్రీదత్తుడు తనకు హోమాగ్నిలో దర్శనమిచ్చినాడు! సత్యనారాయణగారు ధన్యజీవి కదా! దత్తదర్శనము చేత తరించినారు. స్వామి సత్యనారాయణగారి గురించి భక్తులకు ఇలా చెప్పినారు. "ఆ జీవుడు సత్య - ధర్మములను తప్పని సజ్జనుడు. అందుకే ఆ జీవిపై నాకు ప్రేమ. ఆ జీవుడు వెనుక జన్మలో కేరళరాజు. నేను శంకరాచార్యుల అవతారములో ఉన్నప్పుడు నాకు భిక్ష చేసిన పుణ్యశీలి” అన్నారు.
ఒకరోజు శంకరజయంతి అని తెలియకుండానే సత్యనారాయణగారు శంకరాచార్యులను గురించి ఇంటిలో మిత్రులతో ప్రశంసించినారు చాలాసేపు. స్వామి మరునాడు కాషాయదుస్తులతో పెద్ద శంకరాచార్య చిత్రమును తీసుకువెళ్ళి బహూకరించినారు ఆయనకు! ఆయన చాల ఆశ్చర్యము చెందినారు.
★ ★ ★ ★ ★