home
Shri Datta Swami

 07 Jun 2025

 

Telugu »   English »  

బ్రహ్మలహరి - దివ్యదర్శనముల నిచ్చుట - 11

సీతమ్మగారికి, ఫణికి దివ్యదృష్టి నిచ్చుట.

సీతమ్మగారికీ, ఫణికీ స్వామి అనేక దివ్య దర్శనాలనిచ్చినారు. సీతమ్మగారికి నిత్యము దివ్యదర్శనాలనిచ్చి ఆమె చూచినది భక్తులకు చెప్పి ఆనందింప చేయమని చెప్పేవారు. ఆమెకు శ్రీరామునిగా, ఆంజనేయునిగా, గణపతిగా, శివునిగా శివలింగరూపంగా పెక్కుమార్లు శ్రీవేంకటేశ్వరస్వామిగా, శ్రీమన్నారాయణునిగా, శ్రీదత్తునిగా దర్శనాలనిచ్చారు. అజయ్ గారి భార్య ప్రమాదంలో ఉండగా సీతమ్మగారితో “చూడు చూడు ఏం కనపడుతోందో చెప్పు” అన్నారు. సీతమ్మగారికి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి “చూడు ఏంచేస్తానో” అన్నాడు. అప్పటినుండి రోగం తిరుగుముఖం పట్టినది. ఒకరోజు శివలింగం పైన స్వామి ముఖం కనిపించినది. ఆ లింగానికి ఋషులందరూ అభిషేకము చేస్తున్నారట! ఫణికి సత్యనారాయణపురంలో ఆత్మలింగం కనిపించిన సమయంలో సీతమ్మగారికి కృష్ణలంకలో స్వామి కనిపించి "నీవూ ఆత్మలింగాన్ని చూస్తావా?" అని అడిగి పెద్ద కృష్ణవర్ణ శివలింగాన్ని చూపించారట! వైకుంఠ ఏకాదశినాడు స్వామిని ఆసీనులను చేసి ఉత్తరద్వారదర్శనం భక్తులు చేయగా, స్వామి సీతమ్మ గారికి శ్రీమన్నారాయణునిగా దర్శనమిచ్చినారు. జ్ఞానసరస్వతిగా, కనకమహాలక్ష్మిగా, కనకదుర్గగా, శంకరాచార్యునిగా, శ్రీనృసింహసరస్వతిగా, అక్కలకోట మహారాజుగా, సాయిగా సీతమ్మగారికి స్వామి అనేకసార్లు దర్శనములను ఇచ్చారు.

స్వామి ఫణికి కూడా రామునిగా, గణపతిగా, మారుతిగా, వేంకటేశ్వరునిగా, కృష్ణునిగా దర్శనములనిచ్చినారు. ఒకరోజు ఫణికి స్వామి శివునిగా దర్శనమిచ్చినపుడు ఆ రోజు ప్రతి వస్తువూ, ప్రతి ప్రాణి శివునిగానే కనిపించసాగినది. ఫణి, స్వామిని చేరినపుడు, స్వామి శివతాండవము భజన చేస్తున్నారు! స్వామిని శరణము పొందగా ఆ భావము శాంతించినది. స్వామి తాను రచించిన “కొండెక్కి రానా” భజన చేస్తూ ఫణిని వేంకటేశ్వరుని విగ్రహము వైపు చూడమన్నారు. ఫణికి వేంకటేశ్వరస్వామి బాష్పాలు తుడుచుకుంటూ కనిపించినారట. తిరుపతిలో మూలవిరాట్టు విగ్రహం వద్ద

"నిన్నెంత తలచినా సంతృప్తి రాదయ్యె,
తీరమన్నది లేని ప్రణయసాగరమీవు"

అను చరణం పాడుతున్నప్పుడు (ఇది స్వామి రచించిన ‘కొండెక్కి రానా’ పాటలోనిది) విగ్రహం ఒక్కసారి దేదీప్యమానముగా ప్రకాశించినదట! ఫణికి, సీతమ్మగారికి దివ్యదృష్టినిచ్చామన్నారు స్వామి. వారు దర్శించినవి, భక్తులకు చెప్పమని ఎప్పటికప్పుడు వారిని భక్తులకు చెప్పమనేవారు స్వామి. “ఈ ఇరువురికీ నేనెప్పుడు, ఏ రూపములో ఉన్నా కనిపిస్తాను. అది, వారు మీకు చెప్పి మిమ్ములను ఆనందింపచేసే సేవను వారికి ఇస్తున్నాను” అన్నారు స్వామి.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch