home
Shri Datta Swami

 11 May 2025

 

దత్త జయంతి సందేశము

Updated with Part-2 on 12 May 2025


Part-1   Part-2


Part-1

[19.12.2002] వ్యక్తిగతముగా సద్గుణాలతో కొలిస్తే నేను ఒక నరాధముడను. సర్వదుర్గుణ సంపన్నుడను. నిజంగా మీరందరూ బంగారు, వెండితీగెలైతే, నేను ఇనుపతీగెను. ఐతే ఈ ఇనుపతీగెలోకి దత్తుడను విద్యుత్తు ప్రవేశించి అనేక మహిమలను చేయుచున్నది. "యోగ్యులను వదలి అయోగ్యునకు ఇంత మహిమనేల ఇచ్చితివి?" అని నేను శ్రీ దత్తుని ఈనాడు ఉషఃకాలమున ప్రశ్నించితిని. స్వామి చిరునవ్వు చిందించారు. "నిజంగా నీవు పిచ్చివాడవయ్యా!" అని అన్నాను. స్వామికి చురక తగిలినట్లున్నది. వెంటనే వారిచ్చిన సమాధానమిది.

"ఒక చెడ్డ పిల్లవాడు మంచి కళాశాలలో చేరినాడు. వాడు త్వరలో మంచి ఫలితాన్ని సాధిస్తాడు. అలానే ఒక మంచి పిల్లవాడు చెడ్డ కళాశాలలో ప్రవేశిస్తాడు. వాడు త్వరలోనే పరీక్ష తప్పుతాడు. అంతే ఇది. నీవు చెడ్డ పిల్లాడివే అయినా, నీవు సత్యమైన దైవాన్ని గుర్తించి, సత్యమైనమార్గము లోనికి ప్రవేశించావు. దాని ఫలితమే ఇది. నన్నే పరబ్రహ్మమని గుర్తించి, నా అనుగ్రహమును సంపాదించు జ్ఞాన, భక్తి ప్రచారసేవ లోకి దిగినావు. నీ గమ్యము, నీ మార్గము సత్యమైనవి కాన నీకే సత్ఫలితము దక్కినది. మిగిలిన వారు మంచి పిల్లలే అయినా వారు సత్యమైన గమ్యాన్ని, సత్యమైన మార్గాన్ని ఎన్నుకొన లేకున్నారు. అందుకే వారు సత్ఫలితాన్ని పొందలేకున్నారు. వేపకాయ అయినా గంగాజలములో పడినచో దానిని గ్రహిస్తాను. కానీ మధురఫలమైనా బురదగుంటలో పడిన దానిని ఎలా గ్రహిస్తాను? దత్తుడంటే దానమని అర్థము. "త్యాగేనైకే అమృతత్వ మానశుః" అని శ్రుతి. అనగా కేవలము త్యాగము చేతనే బ్రహ్మత్వము లభించునని అర్థము. నీవు తెలిసియో, తెలియకయో, స్వార్థము మనస్సులో లేకుండా జ్ఞానాన్ని, భక్తిని ఇతరులకు బోధిస్తున్నావు. ఇతరుల ఉద్ధరణమునకు నీ శక్తినంతా కేంద్రీకరిస్తున్నావు. ఇతరులు వ్యక్తిగతముగా నీ కన్నా ఉత్తములే అయినా, వారి కర్మలన్నీ ఆత్మోద్ధరణము అనే స్వార్థముతో ఉన్నాయి. అందుకే అందరినీ వదలి నిన్నే ఎన్నుకొన్నాను. దుర్గంధముతో కూడిన రాజు కన్న, సుగంధముతో కూడిన పేదవాడు మిన్న. త్యాగమే సుగంధము. స్వార్థమే దుర్గంధము. "ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గన్ధో వాతి" అని శ్రుతి. అనగా త్యాగముతో కూడిన సేవాకర్మ నాలోకము వరకు సుగంధాన్ని వ్యాపింపచేసి నన్ను ఇచ్చటకు తీసుకుని వచ్చును అని అర్థము.

షోడశోపచారములతో పూజింపవలసినది పరమాత్మ యొక్క నరావతారమే. ఆయనను రమ్మని ఆహ్వానించుటయే ఆహ్వానము. ఉన్నత ఆసనముపై ఆసీనుడు కమ్మనుటయే ‘ఆసనం సమర్పయామి’. స్నాన, నైవేద్యములన్నియును జీవ రూపమున పరమాత్మ వచ్చినపుడు చేయు సేవలే. ఇందులో ముఖ్యమైనవి రెండు. స్నానము, నివేదనము. ఈ స్నానమే ‘అభిషేక’మందురు. ఇక ‘నివేదనము’, అనగా శ్రేష్ఠమైన ఆహారమును సమర్పించుట. దీనినే ‘యజ్ఞము’ అందురు. ఈ రెండే వేదములో ముఖ్యముగా ప్రధానమైనవి. నరస్వరూపాన్ని మానవులకు గల మాత్సర్యము వల్ల నిరాకరించి, ఈ రెండూ (అభిషేకము, నివేదనము) జడములకు చేయుట వచ్చినది. జడమగు రాతికి స్నానము, జడమగు అగ్నిలో ఆహారమును దగ్ధము చేయుట ఆరంభించగనే, కర్మలలో అంతరార్థము నశించినది. విగ్రహారాధనము తప్పు కాదు. శ్రీకృష్ణుని నరరూపము ఇప్పుడు లేదు. శ్రీకృష్ణుడన్న ఎంతో ప్రేమ ఉన్నది. కావున కృష్ణ విగ్రహమునకు అర్పించవచ్చును. కానీ విగ్రహమునకు ఏ ఏ ఉపచారములు అవసరమో అవే చేయాలి. విగ్రహము పైబడిన మురికిని తీసివేసినచో నిర్మలముగా కనిపించును కావున దానికి స్నానోపచారము చేయుము. పూలతో అలంకరించుము. బొట్టు పెట్టుము. ఇప్పుడు విగ్రహమును ఆనందముతో దర్శించుము. "ద్రష్టవ్యః" అనే శ్రుతి బాగుగా చూడవలెను అని చెప్పుచున్నది. నీ ప్రియపుత్రుడు విదేశములలోనున్నాడు. వాని ఫొటోను చూచి ఆనందింతువు. ఆ ఫొటోను కడిగి శుభ్రము చేయుదువు. కానీ, నివేదనోపచారము అనవసరము. చామర వీజనము అనవసరము. స్పష్టముగా కనపడుట కొరకు దీప, నీరాజనములు అవసరమైనచో, అనగా చీకటిలో, చేయుము. ఇవే సమయోచిత సేవలు.

Swami

‘ధూపము’ వేయుట దోమలను పారద్రోలుటయే. ఇట్లు ధూప, నైవేద్య, చామర వీజనాదులన్నింటిని స్వామి యొక్క నరావతారమునకే చేయవలయును. నరావతారమును గుర్తించుట కష్టమే. కొందరు నరులు కూడ మేమే స్వామియని మోసము చేయుచున్నారు. కాన మేము విగ్రహములకే సేవలు చేయుదుము అని అనవచ్చును. నిజమే కాని, నైవేద్యాదులు విగ్రహమునకు అనవసరము. కానీ స్వామికి నేను భోజనము పెట్టి ఆనందింప చేయాలి అని నీవు భావించినచో దానికి మార్గాంతరమున్నది. ఆకలితో మాడు ఆర్తునకు అన్నము పెట్టి నివేదనము చేయుము. ఆర్తుడు ఎంతో సంతోషించును. వాని ఆనందము ఇసుకలో పోసిన నీరువలె ఆనంద స్వరూపుడగు స్వామికి చేరును. అనగా స్వామి ఆనందించును. ఇదే నివేదనము. సంపన్నుడికి పెట్టినావు. వాడు అంతగా ఆనందించడు. వాడు అన్నార్తుడు కాడు. ఆ ధనికుడు జ్ఞానార్తుడు. భక్తి దరిద్రుడు. వానికి జ్ఞానము, భక్తిని దానము చేసిచో వాడు ఎంతో ఆనందించును.

కావున ఎవని వద్ద ఏది లేదో అది వానికి దానము చేసిన, వాడు ఎంతో ఆనందించును. ఆ ఆనందాతిశయమే సర్వజీవులకు ఆధారముగ నున్న పరమాత్మకు అందగా, పరమాత్మ ఆనందించును. నరరూపములో నున్న పరమాత్మకు కూడ కాలోచితమైన అవసరమైన సేవ ప్రధానము. స్వామికి జలుబు చేసినది. ఈ రోజు నీవు తలంటి స్నానము చేయమని నిర్బంధించి అట్లు చేసినచో స్వామికి జలుబు ఎక్కువై బాధపడును. స్వామి దగ్గుచున్నాడు. నీవు కర్పూర నీరాజనము ఇచ్చినావు. ఆ పొగకు స్వామికి దగ్గు ఎక్కువైనది. దోమలతో బాధపడుచున్నప్పుడు ధూపమును పెట్టి ఆ ఉపచారమును చేయవలెను. అప్పుడు మాత్రము ఆ ఉపచారము చేయవు. స్వామి రోగముతో బలహీనముగానున్నాడు. కొంచెము ఫలహారమును తయారు చేసిపెట్టినచో స్వామికి ఓపిక వచ్చును. అది మాత్రము మరచినావు. కావున ఏది ఎవనికి ఎప్పుడు అవసరమో దానిని వానికి అర్పించుటయే నిజమగు సేవ. నిజమగు దానము.

 

Part-2

స్వామికి వ్యక్తిగత సేవ కన్నా, స్వామి కార్యములో పాల్గొనుట ఎక్కువ ఆనందమునిచ్చును. వారధి నిర్మాణమునకై సముద్ర తటమున స్వామి కూర్చుండగా, ఒక బండ మోసుకుని వచ్చి సముద్రములో వేసినవాడు స్వామికి ప్రియుడగును కానీ, స్వామి కార్యములో పాల్గొనకుండా స్వామికి చందన పుష్పపూజ చేయువాడంతగా ప్రియమును కూర్చడు. ఒక వేయి రూకలు అవసరమై మీ గురువు మీ ఇంటికి వచ్చినాడు. ఆయనకు పచ్చడి అన్నము పెట్టి, ఇంటింటికి తిరిగి యాచించి అయినా వేయిరూకలను సమకూర్చి స్వామికి ఇచ్చి పంపినచో ఆయన నిన్ను చిరకాలము గుర్తు పెట్టుకొనును. అట్లుకాక, ఆయన అవసరమునకు ఏ ప్రయత్నము చేయక, ఆయనకు పంచభక్ష్య పరమాన్నములతో భోజనము పెట్టి పంపినావు. అది తాత్కాలికముగా సంతోషాన్ని ఇచ్చినా, ఇంటికి పోయి రాత్రి కాగానే, నీవు పెట్టిన భోజనము అరిగిపోగా, ఆ సంతోషము అంతరించినది.

కావున స్వామికి శాశ్వత ప్రియమును చేయునది స్వామి కార్యములో పాల్గోని సేవ చేయుటయే. రామనామాన్ని విభీషణుడూ, హనుమంతుడూ ఇరువురు నిరంతరము చేసినారు. కానీ హనుమంతుడు నిస్వార్థముగా రామకార్యములో పాల్గొని సేవ చేసినందుకు, సర్వసృష్టి ఆధిపత్యాన్ని ఇచ్చి భవిష్యద్ర్బహ్మగా చేసినాడు స్వామి. విభీషణునకు వాని ఆస్తిని మాత్రమే ఇచ్చినాడు. స్వామిసేవలో నీ కెంత శ్రద్ధ, పట్టుదల ఉన్నదో పరీక్షించుటకు స్వామి విఘ్నములను కల్పించును. విఘ్నాధిపతి కూడ ఆయనయే కదా. స్వామి కార్యమును గురించి శంకించక, నీ శక్తి మేరకు నీవు సేవ చేయుము. నీ శక్తి ఉన్నంత వరకూ సేవించినావా? లేదా? అని స్వామి పరీక్షించును. అంతే కాని నీ సేవ ఎంతయని చూడడు. పెద్దబండలను, సముద్రములో వానరులు వేయగా అవి మునిగినందున, స్వామి కార్యము జరుగదు అని శంకించి వానరులు సేవనాపినారు. కావున స్వామి వారి వీపులను నిమురలేదు. చిన్న ఇసుక రేణువులను మోసి సముద్రములో వేయు ఉడుత మాత్రము తన సేవను ఆపలేదు. స్వామి ఉడుత వీపు నిమిరినాడు.

నిజముగా, బిచ్చగాడి కన్నను, ధనికులకే మనము ఎక్కువ సేవ చేయవలెను. ఒంటె సూదిబెజ్జములో దూరవచ్చు కానీ, ధనికుడు మాత్రము పరమాత్మను చేరలేడని క్రీస్తు భగవానుడు సెలవిచ్చియున్నాడు. ఈ మాటకు ధనికులు కోపము తెచ్చుకొనరాదు. దానిలోని సత్యమును విచారించవలెను. దారేషణ, పుత్రేషణ, ధనేషణలను ‘ఏషణాత్రయ’మందురు. అనగా ఇవి చాలా బలమైన సంకెళ్ళు. అనగా భార్య, పుత్రులు, ధనము మీద మమకారములే సంకెళ్ళు. ఇందులో భార్యాపుత్రుల మమకారము కారణముగా అవసరము వరకు ధనము ఉన్ననూ, ఇంకనూ ధనము సంపాదించవలెనని నిరంతరము ధనము మీదనే దృష్టి కేంద్రీకరించుటయే ధనేషణ. అన్నపాన వస్త్రాదుల వరకు ధనము అవసరమే కావున ధనము ఆర్జించమని వశిష్ఠుడు రామునికి "ధనమార్జయ కాకుత్స్థ!" అని చెప్పినాడు. అతివృష్టి, అనావృష్టి ఈ రెండూ పనికిరావు. అంత్యక్షణమున భార్యాపుత్రులు తనను రక్షించలేరు. పరలోకమున అసలు వారు తనను గుర్తు కూడ పట్టరు. ఇట్టి వారి సుఖముల కొరకు గుడ్డి వ్యామోహముతో, తన శక్తిని, కాలమును ధనార్జన కొరకే వినియోగించుచూ, దైవము వైపునకు తిరుగుటకు కాలము, శక్తి లేక, చివరలో బావిలో పడు ధనికులు ఎంత దరిద్రులో ఆలోచించుడు. నిజముగా సానుభూతి చూపవలసినది వారి మీదనే కదా! ఎన్నటికినీ ఉత్తీర్ణులు కారు అని ముద్రవేయించుకున్న విద్యార్థుల మీదనే కరుణామయుడైన గురువు దృష్టిని కేంద్రీకరించును. కావున వారికి జ్ఞానధనము, భక్తి ధనములనిచ్చి, వారు ద్రవ్యరూపములో సంపాదించిన అధికధనమును అన్నార్తులకు అన్నము పెట్టించు దానమును, ఈ జ్ఞాన, భక్తి దానమును ఇతర ధనికులకునూ చేరునట్లు చేయు ప్రచార సేవలో వారు పాల్గొనునట్లు చేసి వారినీ తరింపచేయవలెను.

అన్నపాన వస్త్రాదులకు కావలసిన కర్మను చేసుకొని దైవసేవను ఈ కాలములో చేయవలెను. ఏలననగా, నీవు కనీస అవసరాలైన వాటిని యాచించినచో, నీ విలువపోయి నీవు చెప్పిన దానిని జనులు వినరు. ఇది కలియుగ లక్షణము. కావుననే పూర్తిగా దైవసేవలోనే నిమగ్నమగు సంన్యాసము కలిలో నిషేధింపబడినది. అలా అని దైవసేవ చేయక పూర్తికాలమంతయును ధనార్జనలోనే నిమగ్నమగుటయును తప్పు. అట్లు నిమగ్నులైన వారు వారి కర్మఫలత్యాగమును అనగా కొంత ధనమును దైవసేవకు త్యజించి దైవసేవ చేసిన వారి ఫలమును పొందవచ్చును. ఇదే గీతలో చెప్పబడిన కర్మఫలత్యాగము. కావున కొందరు worship is work అని అతివృష్టిగా మరి కొందరు work is worship అనావృష్టిగా ఉన్నారు. అన్నపాన వస్త్రాదుల వరకు కావలసిన work చేసుకొని మిగిలిన సమయమును worship అనగా దైవసేవకు వినియోగించుట ఉత్తమమార్గము.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch