home
Shri Datta Swami

Posted on: 22 May 2023

               

Telugu »   English »   Malayalam »  

పాప క్షమాపణ అష్టకమ్

పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి విరచితము
చేసిన పాపములను క్షమించమని శ్రీ దత్త భగవానుడిని ప్రార్థిస్తూ
అనుగ్రహించబడిన ఎనిమిది శ్లోకములు

సాహఙ్కృతి స్సహచరానపి సంవిధూయ,
స్వాత్మానమేవ సకలోత్తమ మావిధాయ, |
మత్తో మృగో వనచరేష్వివ జీవితోఽహమ్,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||1||

ఎల్లవేళలా నేను అహంకారముతో గర్వించి తోటివారిని లెక్క చేయక వారిని దూరం పెట్టాను.  ఎల్లపుడునూ సాటి మానవులతో పోల్చుకొని అందరికన్నా గొప్పవాడిగా, అందరికన్నా ఉత్తముడిగా నన్ను నేను భావించుకున్నాను. ప్రపంచమనే ఈ అడవిలో తోటి జంతువుల మధ్య మదించిన జంతువు వలె జీవించాను. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

మాత్సర్య దుర్విష రుషా వినయం విహాయ,
యోగ్యాధికానపి వినిన్ద్య శమం ప్రయామి, |
త్వామప్యహం నరతనుం విసృజామి మూఢః,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||2||

అసూయతో నా మనస్సు విషతుల్యంగా మారగా తద్ద్వారా కలిగిన కోపంతో నాకున్న వినయ గుణాన్ని వదలివేసి అశాంతిని పొందాను. ఆ అశాంతిని పోగొట్టుకొనడానికై నాకన్నా ఉత్తములైన వారిని నిందించి శాంతించాను. నేనెంత మూర్ఖుడను! ఓ దత్తా, చివరకు నరరూపములో వచ్చిన నిన్ను కూడ నేను వదలి వేసితిని. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

క్రోధం విహాయ దయయా హ్యసి మయ్యఘౌఘే,
స్వల్పాఘ మానవచయే బహుధాఽస్మి రుష్టః, |
కామాయ కేవలమియం త్వయి భక్తి రేషా,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||3||

నీవు నీ క్రోధాన్ని వదలివేసి పాపాల పుట్ట వంటి నా వంటి వాని యందు కూడ పరమ దయను చూపావు. కాని, నా చుట్టూ ఉన్నవారు అతి చిన్న తప్పులను చేయగా నేను మాత్రం వారియందు పరమ క్రోధాన్ని చూపాను. ప్రస్తుతం నేను నీపై చూపిస్తున్న భక్తి నీ అనుగ్రహంతో కేవలం నా స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికే సుమా. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

మోహేన పుత్రకలితేన ధనేషణార్తః,
పాపం కృతం బహు న దానలవోఽపి యోగ్యే, |
లోభాకృతి ర్మమ కుటుమ్బ విలమ్బమానః,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||4||

నేనెల్లపుడూ నా సంతానము పట్ల అతి మోహముతో ప్రవర్తించగా తద్ద్వారా కలిగిన డబ్బు వ్యామోహము చేత చాలా పాపములను చేసితిని. యోగ్యులైన అర్థులకు పొరపాటున కూడ దానము చేయలేదు. నేను మూర్తీభవించిన లోభంగా మారి ఎపుడూ నా చిన్న కుటుంబమే ప్రపంచంగా వేలాడాను. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

సేవా కృతా న తవ దక్షిణయాఽపి భార్యా-
పుత్రేషణా వికలితో ఽప్యఘతో ధనార్థీ, |
నిష్కారణాత్త కరుణాం కురు మయ్యయోగ్యే,
పాపక్షమాపణ పటో! ప్రభు దత్త! పాహి ||5||

నేను ఎప్పుడునూ నీ దివ్యమైన సేవను చేయలేదు. సద్గురువైన నీకు గురుదక్షిణగా ఒక్క రూపాయి కూడ ఎప్పుడూ సమర్పించుకోలేదు. భార్యా, పిల్లల మోహమనే దుర్గుణముచే కప్పబడి దాని ద్వారా పాపం చేసి కూడ డబ్బును సంపాదించడానికి వెనుకాడలేదు. ఈ విధంగా ఏ కోణంలో చూసినా అయోగ్యుడనైన నాయందు నీ నిష్కారణ కరుణను చూపించుము. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

పాపం కరోమి పరితాప ముపైమి పశ్చాత్,
పాపం పునః పునరపి క్రియతే చ హన్త, ।
దేవాదిదేవ! భవదీయ దయైవ రక్షా,
పాపక్షమాపణ పటో! ప్రభుదత్త! పాహి ।।6।।

నేను పాపములను చేస్తున్నాను కానీ వెంటనే పశ్చాత్తాపపడుతున్నాను. అయ్యో, ఇదేమిటి, అయినా పాపములను మాటి మాటికీ చేస్తూనే ఉన్నాను? దేవతలందరిలో మొట్టమొదటి వాడైన ఆదిదేవా! నాకు కేవలం నీ దయయే రక్ష. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

జానామి పాపఫలమేవ శుగేకమూలమ్,
కిఞ్చ క్రియాసు న హి విస్మరణం తథాపి, ।
పాపం కృతం సతతమత్ర బలం ధిగస్య,
పాపక్షమాపణ పటో! ప్రభుదత్త! పాహి ।।7।।

ప్రస్తుతం నేననుభవిస్తున్న దుఃఖములకు ముందు నేను చేసిన పాపముల యొక్క ఫలములే కారణములని నాకు చాలా బాగా తెలుసు. పాపములను మరల మరల చేస్తున్న సందర్భములలో కూడ ఈ నిజము నాకు బహు చక్కగా గుర్తున్నది. కానీ, ఎల్లప్పుడునూ ఇక్కడ పాపమునే చేస్తున్నాను. ఈ పాపము  ఎంత బలమైనది, సిగ్గు, సిగ్గు! పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

యద్వర్తమాన పరివర్తన కర్మ నశ్యమ్,
భూతాఘసర్వమపి తత్ యతతే జనోఽయమ్, ।
ఏతత్ప్రయత్న పరిపూర్ణ బలం త్వమేవ,
పాపక్షమాపణ పటో! ప్రభుదత్త! పాహి ।।8।।

నేనీ రోజు పాపమును చేయకుండా ఉన్నట్లయితే, గతించిన కాలములో చేసిన పాపములన్నీ నశించును. ఈ కారణంగా, నేనీ రోజు పాపమును చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తు్న్నాను. అందుచేత, నేనీ రోజు చేస్తున్న ప్రయత్నానికి నీవే సంపూర్ణమైన బలము. పాపములను క్షమించుటలో మహా సమర్థుడవైన ప్రభు దత్తా! నన్ను కాపాడుము.

 

పాపక్షమాపణ స్తోత్రమ్ ఇతి కృష్ణకృతం పఠన్ ।
దత్తానుగ్రహతో గచ్ఛేత్ పాపనిర్మూలనం ఫలమ్ ।।

ఈ విధంగా, శ్రీ కృష్ణ కవి (శ్రీ దత్తస్వామి) వ్రాసిన ఈ ప్రార్థనను ఎవరైతే తమ పాపములను క్షమించమని ప్రభుదత్తుని ప్రార్థిస్తూ పఠిస్తారో వారి యొక్క పాపములన్నీ ప్రభుదత్తుని అనుగ్రహముచే నశించి పాపనాశనము యొక్క ఫలమును వారు పొందెదరు.

[సూచన: - సద్గురువూ, దివ్య ప్రబోధకులూనైన దత్త భగవానులు ప్రతి భక్తుడిని/భక్తురాలిని పై ప్రార్థనను ప్రతిరోజు నిద్రించే ముందు కనీసం ఒక్కసారైనా చదువు కొనమని సూచించారు.]

 
 whatsnewContactSearch