home
Shri Datta Swami

 25 Sep 2024

 

Telugu »   English »  

ధర్మమా - భగవంతుడా ఏది ఎక్కువ?

[11-01-2003] సంసారమను ఈ దుకాణములో ధనము, తల్లితండ్రులు, భార్యాభర్తలు, సంతానము, గురువు, బంధువులు, మిత్రులు అను వస్తువులున్నవి. ఈ వస్తువులతో పాటు నరాకారమున వచ్చిన భగవంతుడను వస్తువు కూడ ఉన్నది. ఈ వస్తువులలో నీవు ఏ వస్తువుకు ఎక్కువ విలువనిచ్చావు? అన్ని వస్తువులకన్నను భగవంతునికే ఎక్కువ విలువనిచ్చినప్పుడు ధర్మము అను మరియొక వస్తువు కూడ ఈ దుకాణములో కనపడును. భగవంతుడను వస్తువు లేనప్పుడు అన్ని వస్తువుల కన్ననూ, ధర్మమే ఎక్కువ విలువగలిగినది. కాని భగవంతుడు అను వస్తువుతో ధర్మమను వస్తువు పోటీపడగానే ఎవడు భవగంతునకే ఎక్కువ విలువనిచ్చుచున్నాడో వాడే భక్తుడు అనబడును. ఆచరణాత్మకమైన క్రియలలో విలువ బయటపడును. అతడే సత్యమైన భక్తుడు అంతే గాని కేవలము ఊహలైన భావములలో మాటలలో విలువ బయటపడదు. కావున భావమును స్వామి పై కేంద్రీకరించు ధ్యానములో కాని, బాష్పములు రాల్చుచు ఎంతో ఆవేశముగా భజనలను పాడుట కాని, లేక మంత్రములను జపించుటలో కాని భక్తి యొక్క విలువ బయటపడదు.

ఒక పతివ్రత సదా పాతివ్రత్యమును భావములలో, మాటలలో, పాటలలో ప్రకటించుచుండెను. ఆమె భర్తకు ఇచ్చిన విలువ తన ప్రాణముల కన్నను మిన్నగా ఉండెను. జయదేవుని మరణవార్త విని పద్మావతి వెంటనే ప్రాణములను విడచినది అను కథ ఆమె అందరికి బోధించుచుండెను. ఈమె తనకు నిజముగా ఎంత విలువ నిచ్చినదో తెలుసుకొనకోరి ఒక పండగనాడు ఆమె భర్త స్నానము చేసి వచ్చి భోజనమునకు ముందు కూర్చుని వెంటనే మరణించినట్లు నటించి పడిపోయెను. ఆమె శ్వాస పరీక్షించగా ఆ భర్త శ్వాసను బంధించెను. భర్త మరణించినాడని తేల్చుకున్నది. చేసిన పిండివంటలు ఘుమఘుమలాడుచున్నవి. ఇప్పుడు ఏడ్చినచో అందరును వచ్చెదరు. అప్పుడు ఈ పిండివంటలు తినుటకు వీలులేకపోవును. కావున వెంటనే తలుపులు బంధించి పిండివంటలు శుభ్రముగా తిని చేతిని మూతిని శుభ్రముగా కడుకుని తలుపులు తెరచి "ప్రాణానాథా! నీ కొరకు ఎన్ని పిండివంటలను చేసితిని. రుచి చూడకుండగనే పోయినావా? అని ఎలుగెత్తి ఏడ్చినది. అందరు చేరినారు. ఆమె అట్లే పదే పదే పల్కుచు ఏడ్చుండెను. అప్పుడు భర్త లేచి కూర్చొని ఎందుకు ఏడ్చుచున్నావు. నేను రుచి చూడకపోయిననూ, నీవు శుభ్రముగా తిన్నావుగదా అనెను. ఆమె యొక్క పతిభక్తి ఎంతవరకు సత్యమో అందరి ముందు తేలిపోయినది. కావున భక్తి ఆచరణములో నిరూపించబడినపుడే సత్యమైన భక్తి అగును. కావున నీవు భగవంతుని విలువను ఆచరణములో చూపించవలెను. ధ్యానము చేతగాని, ఉపన్యాసముల చేతగాని, పాటల చేతగాని, భక్తిని నిరూపించలేవు. అట్లే నమస్కారములు పెట్టునపుడు కూడా భక్తి నిరూపించబడదు.

నిజముగా నీవిచ్చు విలువ సమయము వచ్చినప్పుడు నీ ఆచరణలో బయటపడును. ఆచరణలో నిజముగా విలువనిచ్చినప్పుడు పైన చెప్పినవన్నియును సార్థకములగును. ప్రాణముగల శరీరములో అవయవములు ఎట్లు కళకళ లాడుచుండునో అట్లే ఆచరణలో నిరూపితమైన సత్యభక్తి ఉన్నప్పుడు ధ్యానము, భజనలు మొదలగునవి అన్నియును సాధనలో సార్థకమైన భాగములు అగును. నీవు స్వామికి యిచ్చు విలువ పరీక్షించుటకు ఎంతో చిన్న సన్నివేశము చాలును.

ఒక ఋషి తపస్సు చేసుకొనుచున్నాడు. ఒక పిచ్చిభక్తుడు చింత చెట్టు క్రింద హరిభజన చేయుచున్నాడు. నారదుడు పైకి పోవుట ఇరువురును చూచినారు. మాకు ఎప్పటికి ముక్తి వచ్చునో కనుక్కొని రమ్మన్నారు. స్వామితో మాట్లాడి కొన్ని దినములకు నారదుడు తిరిగి వచ్చుచున్నాడు. ఇరువురును తమతమ విషయముల కూర్చి అడిగిరి. నారదుడు ఋషితో "నీవు ఇంకా నాలుగుజన్మలకు ముక్తి పొందుదువు" అని అన్నాడు. దానికి ఋషి ఇంకా నాలుగుజన్మలా అని వాపోయునాడు. తరువాత పిచ్చిభక్తునితో "ఈ చింత చెట్టుకు ఎన్ని ఆకులున్నవో, అన్ని కోట్లజన్మల తరువాత నీకు ముక్తి అని స్వామి చెప్పినాడ"ని అన్నాడు. వెంటనే ఆ భక్తుడు ఆనందముతో గంతులు వేయుచు నేను ఇంత త్వరగా స్వామిని చేరుదునా? ఇది స్వామి చెప్పినాడంటే స్వామి ఎంత కరుణామయుడు అని కేకలు పెట్టుచు ఎగురుతున్నాడు. అప్పుడు ఆకాశమునుండి ఒక తేజస్సు ఆ భక్తునిపై పడినది. ఆ తేజస్సు నుండి స్వామి వాక్కు ఇట్లు వినిపించినది. "ఓ భక్తా! నీవు ఈ క్షణముననే స్వామిని చేరుచున్నావు". వెంటనే ఆ తేజస్సు ద్వారా ఆ భక్తుడు స్వామిని చేరినాడు.

ఈ కథలో అంతరార్థమేమి? నాలుగుజన్మలలో స్వామిని చేరుదువు అని ఋషికి చెప్పినపుడు ఇంత ఆలస్యమా అని తలచినాడు. అనగా భగవంతుని విలువను చాలా తక్కువగా అంచనా వేసినాడు. అంతే కాదు, ఆ మాట స్వామి చెప్పిన మాటయే అని వినియును, ఆ మాటకు విలువనీయక దానిని ఆక్షేపించినాడు. కాని ఆ పిచ్చిభక్తుడు అన్ని కోట్లజన్మలలో స్వామిని పొందెదవు అన్నను అది చాలా స్వల్పకాలమని ఎందుకు భావించినాడు? అతడి దృష్టిలో భగవంతునకు ఎంతో విలువయున్నది. అతడు స్వామి చెప్పినాడని విని "ఎంత కరుణ" అని ప్రశంసించినాడు. కావున అతడి సత్యమైనభక్తి ఆ ఒక్కమాటతో నిరూపితమైనది. అన్నము ఒక్క మెతుకు పట్టుకొనిన చాలును ఉడికినదా లేదా తెలుసుకొనవచ్చును. కావున దత్తపరీక్షలు ఎంతో సూక్ష్మముగా, సున్నితముగ, సుకుమారముగ యుండును. అయితే, దత్తపరీక్షలు సీతకు అగ్ని పరీక్ష వలె ఏదో భయంకరముగా ఉండునని జనులు తలచెదరు.

ఒకనాడు వివేకానందుడు వచ్చు సమయమున పరమహంస తాను శయనించు మంచములోని నల్లులను చంపుచుండెను. ఇతర శిష్యులు కూడా వచ్చిరి. తత్త్వము తెలిసిన వివేకానందుడు మిన్నకుండెను. ఇతర శిష్యులు పరమహంసయే ఈ జీవహింస చేయుచున్నాడేమి? అని మనస్సులలో తలచిరి. వారి సంశయములను పోగొట్టతలచి వివేకానందుడు "గురుదేవా! మీరే జీవహింసను చేయుచున్నారే?” అని ప్రశ్నించెను. అప్పుడు పరమహంస ఇట్లు వచించెను. "నేను ఈ మంచములో శయనించి పరమాత్మను ధ్యానించుచుండును. అప్పుడు ఈ నల్లులు నన్ను కుట్టి నా ధ్యానమునకు భంగము కల్గించుచున్నవి. నాకు అహింసయను ధర్మము భగవంతునితో సమానము కూడా కాదు. దీని వలన పాపము వచ్చిననూ, నేను లెక్కచేయను. భగవంతుని ముందు నాకు ఏదియును ముఖ్యము కాదు. స్వామి కొరకు ధర్మమునైనను త్యజింతును అని వచించెను. శ్రాద్ధము పెట్టునాడు బిచ్చము కూడా వేయరాదని సాంప్రదాయము. కాని స్వామి రాగానే సుమతి భోక్తలు తినకముందే స్వామికి అర్పించెను. కావున స్వామికి ముందు ధర్మమును సహితము వదిలినది. కావుననే స్వామిచే అనుగ్రహించబడినది.

ఒక జీవుడు ఇతర జీవులతో ప్రవర్తించుచున్నప్పుడు అధర్మమును చేయరాదు. ధర్మమునకే ఎక్కువ విలువనీయవలెను. రాముడు తన అవతారములో మొదటినుండియు చివరవరకును ఒక జీవుడు ఎట్లు ప్రవర్తించవలయునో ఆచరించి చూపెట్టినాడు. కావుననే వాలిని చెట్టు చాటున నుండి చంపినందుకు కృష్ణావతారమున ఫలముననుభవించినాడు. కాని కృష్ణావతారమున ఎన్ని అల్లరిపనులను చేసినను వాటి ఫలితములను ఆ అవతారములో కాని, తరువాత అవతారములలో కాని అనుభవించలేదు. శిఖండిని ముందుంచుకొని భీష్ముని చంపించినాడు. అసత్యము పలికించి ద్రోణుని వధింప చేసినాడు. మరి ఈ కర్మలకు ఫలమును ఏల అనుభవించలేదు. కారణము కృష్ణావతారములో తాను స్వామిగా వ్యవహరించినాడు. అనగా జీవుడు ఇతర జీవుల విషయములలో అధర్మము చేసినచో దాని ఫలమును అనుభవించియే తీరవలయును. కాని స్వామి విషయమున ధర్మాధర్మముల కన్ననూ స్వామి ఎక్కువ.

జీవుల విషయమున జీవులకన్ననూ ధర్మము గొప్పది. ధర్మరాజు శ్రాద్ధమును పెట్టుచున్నాడు. మంత్రపూర్వకముగా పిండము పెట్టక ముందే భీష్ముడు ప్రత్యక్షమై నాకు చాల ఆకలిగా ఉన్నది. ఆ పిండమును పెట్టమని చేయి చాచినాడు. ఇది పితృ యజ్ఞమునకు విరుద్ధము కావున నేను పెట్టనని ధర్మజుడు నిరాకరించినాడు. ఇది సమ్మతమే. భీష్ముడు జీవుడు. జీవుని కన్నను ధర్మము గొప్పది. కాని ఋషులు యజ్ఞము చేయుచున్నప్పుడు హోమము చేయకముందు కృష్ణుడు వచ్చి అదే మాటను అడిగినాడు. నిజముగా పితృయజ్ఞము కన్నను దేవయజ్ఞము గొప్పది. కాని ఋషిపత్నులు దేవయజ్ఞము కన్నను స్వామి ఎక్కువని హోమము చేయుటకు ముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టినారు. దాని వలన వారు తరించి ముక్తులైనారు.

Swami

సాక్షాత్తు శ్రీ దత్తుని మాతృదేవతయుగు అనసూయ కూడా దత్త పరీక్షలో ఓడిపోయినది. ఆమెను పరీక్షించమని త్రిశక్తులు అసూయతో నారదుని ప్రేరణ వలన త్రిమూర్తులను పంపినారనుట కేవలము మానవుల కల్పనయే. పురాణములలో అనేక మంది వారి స్వంతకవిత్వములను శ్లోకములను దూర్చినారు. ఇట్టి శ్లోకములే ప్రక్షిప్తములు అనబడును. శ్రీ దత్తుడు తన త్రిమూర్తి స్వరూపములతో అనసూయ వద్దకు వెళ్ళి వివస్త్రయై అన్నమును వడ్డించమన్నాడు.

సృష్టి అంతయు శ్రీ దత్త పరబ్రహ్మము యొక్క సంకల్పమాత్రమై ఊహాస్వరూపమై యున్నప్పుడు ఆయనకు తెలియనిది ఈ సృష్టియందు ఒక పరమాణువు కూడా లేదు. ఈ జ్ఞానమును కోల్పోయి సర్వధర్మముల కన్నను స్వామియే ఎక్కువయను సత్యమును విస్మరించి వారలను పసిపాపలుగా చేసినది. ఆమె కోరిక ప్రకారము స్వామి తన సంకల్పముతో పసిపాపయైనాడు. ఆమె శక్తి వలన కాదు. సర్వశక్తులును ఆయన శక్తులే. త్రిమూర్తులు ఓడిపోయినారని చెప్పుట అజ్ఞానము. ఓడిపోయినది త్రిమూర్తిస్వరూపమైన స్వామి కాదు, అనసూయయే. గెలుపు ఓటమి పరీక్షింపబడువానికే గాని, పరీక్షించువానికి కాదు. ఆయనకు ఏమియును అక్కరలేదు. నిర్వికారుడు, నిర్వికల్పుడు, నిశ్చలుడు, నిత్యుడు, నిరంజనుడు, నిష్కలంకుడు, నిరామయుడు, నిత్యానంద స్వరూపుడు, "నానవాప్త మవాప్తవ్యమ్" అని గీతలో చెప్పినట్లు, ఆయనచే పొందబడని వస్తువు కాని, ఆయన పొందవలసిన వస్తువు కాని ఈ సృష్టిలో ఏమీ లేదు. "ఆప్త కామస్య కా స్పృహా" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా సత్యకాముడు, సత్య సంకల్పుడు అగు పరమాత్మకు కోరిక ఉండునా? అని అర్థము. ఆనందస్వరూపునకు ఒక వస్తువు నుండి ఆనందము పొందవలసిన అవసరము లేదు.

అగ్నికి తాపము కలుగదు, నీటికి దాహము కలుగదు. ఆట్లే ఆనందస్వరూపునకు ఆనందమును పొందుటకు ఎట్టి ప్రయత్నము అవసరము లేదు. జీవుల సాధనలకు సహకరించుటకే పరీక్షల ద్వారా వారి సత్యస్థితి వారికి నిరూపించి వారు తరువాత సాధనను చేయుటకు ప్రేరణము నిచ్చుచున్నాడు. కావున దత్తపరీక్షలు జీవుల శ్రేయస్సు కొరకే కాని ఆయన వినోదము కొరకు కావు.

ధర్మరాజు ఎల్లప్పుడు ధర్మమునకే ప్రాధాన్యము నిచ్చెను. కారణము అతడు ధర్మదేవుని అంశ అనగా అతడే ధర్మ దేవుడు. అతడే ధర్మము. అందరికన్నను అన్నింటికన్నను తనకు తానే ప్రాధాన్యమిచ్చుకున్నాడు. ఇది సత్యము కూడ. కాని ధర్మస్వరూపుడైన తనకన్నను స్వామి ఎక్కువయని మరచినాడు. అశ్వత్థామ మరణించెనని అసత్యమును చెప్పమని స్వామి ఆదేశించగా తిరస్కరించినాడు. స్వామికన్నను ధర్మమే అనగా తానే గొప్పయని అహంకరించినాడు. కావుననే నరకదర్శనము చేయవలసి వచ్చెను. అసత్యమాడమని బలవంతము చేసిన కృష్ణుడు నరకమునకు పోలేదు. "కర్తా కారయితా చైవ" అను శాస్త్రప్రకారము చేసినవాడు, చేయించినవాడు సమానఫలితమును పొందవలెను గదా. కాని కృష్ణుడు పొందలేదు. కారణము కృష్ణుడు పుట్టినది మొదలు చివర వరకు స్వామిగనే వ్యవహరించినాడు. కాని రాముడు జీవుడిగనే వ్యవహరించినాడు.

రాముడు మాయామానుష విగ్రహుడు. అనగా మనుష్యరూపమున మందమైన దుప్పటి కప్పుకున్నాడు. కృష్ణుడు లీలామానుష విగ్రహుడు. అనగా మనుష్యరూపమున చాలా పలుచని నైలానుగుడ్డ వంటి మాయను కప్పుకున్నాడు. రాముడు మాయలో దాగుకున్నవాడు. కృష్ణుడు మాయయను పలుచని మేలిముసుగు వేసుకొనినవాడు. తీగెలో కరెంటు పోవుచున్నప్పుడు, తీగయె కనిపించునుగాని కరెంటు కనిపించదు. ఇదే రామావతారము. హీటరులో ఉన్న తీగెలో కరెంటు ప్రవహించి, ఆ తీగె ఎర్రగా కాలి ప్రకాశించుచుండును. ఆ ప్రకాశము చాలా ఎక్కువైనప్పుడు తీగె కనిపించదు. ఎర్రనికాంతి మంటయే కనిపించుచుండును. ఇదే కృష్ణావతారము. ఒక జీవుడు ఇతర జీవులతో వ్యవహరించుచున్నప్పుడు అన్నింటికన్నను ధర్మమే గొప్పది అని నిరూపించు రామావతార సందేశమే రామాయణము. అందరి కన్నను అన్నింటికన్నను గొప్పది యగు ధర్మము కన్నను స్వామి గొప్పవాడు అని నిరూపించు కృష్ణావతార సందేశమే భాగవతము.

అత్యుత్తమ సాధకుల విషయములో ధర్మముతో తాను పోటిపడి ఏది ఎక్కువ అని దత్తుడు పరీక్షించును. మధ్యములైన సాధకుల విషయములో అందరి జీవుల కన్నను, తాను ఎక్కువ? కాదా? అను విషయములో పరీక్షించును. అధములైన సాధకుల విషయములో అన్ని వస్తువుల కన్నను అనగా ధనము కన్నను తాను ఎక్కువా కాదా అని పరీక్షించును. అనగా అధముడు స్వామి కన్నను ధనమునకు ఎక్కువ విలువనిచ్చును. కావున వారికి పరీక్షలో సున్నా మార్కులు వచ్చును. మధ్యముడు ధనముకన్నను స్వామికి ఎక్కువ విలువ నిచ్చును. కాని తన బంధువులగు జీవుల కొరకు భార్య, భర్త, సంతానము, తల్లిదండ్రులు, మొదలగు అతి సన్నిహితజీవులకు స్వామి కన్న ఎక్కువ విలువనిచ్చును. అట్టివాడు పరీక్షను 40 మార్కులతో బొటాబొటీగా ఉత్తీర్ణుడైనవాడు. ఇక ఉత్తమ సాధకుడు ధనముకన్నను, సర్వజీవులకన్నను స్వామికే ఎక్కువ విలువనిచ్చును. కాని స్వామి కన్నను ధర్మమునకే ఎక్కువ విలువనిచ్చును. అట్టివాడు 60 మార్కులతో ఫస్టుక్లాసును తెచ్చుకున్న ఉత్తీర్ణుడు.

దత్త పరీక్షలో ఈ ప్రథమ శ్రేణిని పొందిన వారు ధర్మరాజు, అనసూయ వంటి ఉత్తమసాధకులు. కాని కోటానుకోట్ల సాధకులలో ఏ ఒక్కడో ధర్మముకన్నను స్వామికే ఎక్కువ విలువనిచ్చును. అట్టి జీవుడే నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణ ఉత్తీర్ణుడు. వాని ఫలితమునే రికార్డుబ్రేక్‌ అందురు. వీరు సాధకులు కాదు సిద్ధులు. ధర్మము నత్రికమించి యజ్ఞము జరుగకముందే యజ్ఞాన్నమును స్వామికి పెట్టిన ఋషిపత్నులు, శ్రీపాదవల్లభుని జననియగు సుమతియు, గోపికలును ఇట్టి సిద్ధజీవులు. తన కొరకు ధర్మము తప్పమని స్వామి అడిగిననూ, అనసూయ తప్పలేదు. కావున ఆమె ఫలము ప్రథమశ్రేణి మాత్రమే కాని తన కొరకు ధర్మము తప్పి శ్రాద్ధాన్నమును ముందుగా పెట్టి పరిపూర్ణముగా ఉత్తీర్ణురాలైన సుమతి కన్న ఎక్కువ కాదు. స్వామి, ధర్మము పోటీపడినపుడు వస్త్రాపహరణ సందర్భమున గోపికలు కూడ స్వామి-ధర్మముల మధ్య ఊగిసలాడినారు. కాని నేను సర్వజ్ఞుడను, సర్వసాక్షిని అను స్వామిబోధ చేత 60 మార్కులు మాత్రమే రావలసిన వారు నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నారు.

ద్రౌపదీ వస్త్రాపహరణ విషయమున వస్త్రములనిచ్చినవాడే గోపికల వస్త్రాపహరణము ఏల చేసెను? ద్రౌపది వస్త్రాపహరణము, ద్రౌపది అను జీవుడు కౌరవులు అను జీవుల మధ్య జరిగిన వ్యవహారము.

జీవుల వ్యవహారములో అధర్మము కన్నను ధర్మము గొప్పది అని నిరూపించుటకే ద్రౌపదికి వస్త్రదానము చేసి కౌరవులను శిక్షించినాడు. కాని స్వామికి గోపికలకు అనగా స్వామికి జీవులకు మధ్య వ్యవహారములో ధర్మము కన్నను స్వామియే గొప్ప అని నిరూపించినాడు. రామాయణములో పరభార్యను కోరిన రావణుని వధించిన రాముడే కృష్ణావతారములో పరభార్యలగు గోపికలతో రాసక్రీడ నేల చేసెను? రామాయాణములో రాముడు ఒక జీవుడుగా వ్యవహరించినాడు. రావణుడు ఒక జీవుడే. జీవునకు జీవునకు మధ్య ఉన్న విషయములో ధర్మమునకే గెలుపునిచ్చినాడు. కాని కృష్ణావతారములో తాను స్వామిగా వ్యవహరించినందున, స్వామికి యాదవులకు మధ్య విషయము స్వామికి జీవులకు మధ్య విషయమైయున్నది. కావున అన్నింటి కన్నను ధర్మమే గొప్పయన్నది రామాయణము, ఆ ధర్మము కన్నను స్వామియే ఎక్కువ అనుట భాగవతము.

కావున మన లక్ష్యము, గమ్యము భాగవతము. నూరవ మెట్టు భాగవతమైనది. 99 మెట్టు రామాయణము. కాని ఈనాడు కలియుగములో భాగవతముతో పోల్చి చూచినపుడు మన సాధకులస్థితి పాతాళలోకములో యున్నది. భగవంతునకు ఎంత విలువనిచ్చుచున్నాము? సినిమాకు పోవుటకు ముందు ఎంత ఉత్సాహమున్నది! పెండ్లి కుమారుడు లేక పెండ్లికొడుకు కొరకు సాయంత్రమునకు పెళ్ళి ముహుర్తము కుదిర్చెదరు. సినిమాకు పొమ్మన్నచో ఆనందముతో పోవుచున్నారు. అచ్చట తలుపులు కిటికీలు మూసి ప్రాణవాయుసంచారము లేక కుర్చీలలో నల్లులు పీకుచుండగా దోమలు రక్తము త్రాగుచున్ననూ ఆ సినిమాపైనే స్థిరదృష్టిని ఉంచి తెరిచిన నోటిలోనికి ఈగలు పోవుచున్ననూ తెలియక మూడుగంటలు ఎంత ఏకాగ్రతతో ఆసీనులగుచున్నారు. అదే సత్సంగమునకు, గుడిలో భాగవతశ్రవణమునకు రమ్మన్నప్పుడు అవసరములేని పనులన్నియును కనిపించును. ఇంటిలో కూరలున్ననూ, కూరలు తెచ్చుకొనవలయునని తప్పించుకొనుచున్నారు. ఒకవేళ వచ్చిననూ 10 నిమిషములు స్థిరముగ కూర్చునలేరు. సత్సంగశ్రవణము చేయునప్పుడు ఎన్ని గుసగుసలు మాటలాడుతుందురో, పాలపాకెట్టు కోసం కూడ లేచిపోవుదురు.

కావున మన సాధకుల సాధన యొక్క స్థితి ఎచ్చట ఉన్నది? భగవంతుని కొరకు తండ్రిని త్యజించిన ప్రహ్లాదుడు తల్లిని త్యజించిన శంకరాచార్యులు, భర్తను త్యజించిన మీర, భార్యాపుత్రులను త్యజించిన బుద్ధుడు, వివాహము ఆడియును సంతానము అక్కరలేదని రామకృష్ణ పరమహంస, స్వామి కొరకు అన్నింటిని అందరిని త్యజించిన గోపికలు, వైదిక యజ్ఞధర్మమును త్యజించిన ఋషిపత్నులు, ఎక్కడ! ఎక్కడ! ఎక్కడ! ఎంతో దూరం బ్రహ్మపదం ఓ జీవా, ఇంకా ఎంతో దూరం బ్రహ్మపదం!

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch