14 May 2025
[01-01-2003] హనుమంతుడు వానరజాతిలో అవతరించినాడు కావున ప్రతి కోతిని హనుమంతుడుగా భావించి గౌరవించుచున్నాము. హనుమంతుడు సాక్షాత్కరించినపుడు హనుమంతుని రూపముపై హేళనము, నిర్లక్ష్యము రాకుండా ఉండుటకే ముందుగా వానరములందు పూజ్యభావమును అలవరచుకొనుచున్నాము. అట్లే మానవాకారమున పరమాత్మ అవతరించినపుడు ఆ పరమాత్మను ప్రేమతో సేవించవలయునన్నచో (నివృత్తి మార్గము) ముందుగా మానవజాతిని ప్రేమతో సేవించు తత్త్వమును ప్రవృత్తి మార్గమున అలవరచుకొనవలయును. అట్లుకాక సాటి మానవులందు నిర్లక్ష్యము, ద్వేషము, అసూయ, అహంకారములతో ప్రవర్తించినచో, రేపు మానవాకారమున ఉన్న పరమాత్మను గుర్తించునపుడు ఈ అసూయాది గుణములే అడ్డువచ్చును. ఎట్లు ప్రతి కోతిని హనుమంతునిగా భావించి పూజించుచున్నామో అట్లే ప్రతి మానవుని మాధవునిగా ప్రేమించి సేవించవలయును. అయితే ప్రవృత్తి మార్గములో లౌకికవివేకము ఉండవలయును. మామూలు కోతిని హనుమంతుడని పాదములు పట్టుకొన్నచో పీకి పారవేయును. అట్లే ప్రతి మానవుని మాధవుడని భావించి సేవించు మార్గములో దుర్జనులను పరిహరించవలెను. కేవలము దీనులకు, భక్తులకు మాత్రమే దీనిని వర్తింప చేయవలయును. ఒకసారి నివృత్తి మార్గములో ప్రవేశించగనే ప్రవృత్తి మార్గము అదృశ్యమైన పోవుచున్నది. నివృత్తి మార్గములో స్థిరత్వమును ఏర్పరచుట కొరకే ప్రవృత్తి మార్గము. రవ్వలడ్డూలోను, బూందీలడ్డూలోను ఉన్న చక్కెర ఒక్కటియే. రెండింటిలోను తీపి ఒక్కటియే అయినను, రవ్వరుచి వేరు బూందీ రుచి వేరు. కావున రెండు లడ్లు ఒకే తీపి రుచియును, మరియు వేరు వేరు రుచులను కూడ కలిగియున్నవి. అట్లే పరమాత్మ వేరు వేరు ఉపాధిగుణములు గల మనుష్యశరీరమును ఆశ్రయించినపుడు పరమాత్మతత్త్వము లక్ష్యముగా అన్ని అవతారములు ఒకే తత్త్వము కలిగియున్నను ఆయా శరీర ఉపాధిగుణముల భేదము చేత వేరు వేరు తత్త్వములు కూడ కలిగియుండును. ఒకే నారాయణుని అవతారములగు నరసింహుడు, శ్రీరాముడు వేరు వేరు స్వభావములను కలిగియున్నను పరమాత్మతత్త్వము, కళ్యాణగుణములు ఒకటియే గదా. ఇరువురిలోను దుష్టసంహారమను దైవత్త్వము ఒక్కటియే. కానీ శ్రీరాముడు అతి శాంత స్వభావముతోను, శ్రీనరసింహుడు అతి కోప స్వభావముతోను ఉన్నారు గదా.
శ్రీ శిరిడి సాయినాథుడు బ్రాహ్మణశరీరముతో ఉన్నప్పుడు గురుదక్షిణలను యాచించెడివారు. కాని అదే సాయి క్షత్రియశరీరమగు శ్రీసత్యసాయి రూపములో ఉన్నప్పుడు "నేను ఇచ్చువాడనే కాని, పుచ్చుకొనువాడను కాను" అని వచించారు గదా. ఈ ఏకత్వమును మరియు భేదమునే గీత "అవిభక్తం విభక్తేషు విభక్త మివచ స్థితమ్" అని చెప్పుచున్నది. అనగా పరమాత్మ అనేక రూపములలో ఒక్కనిగా యున్నను వేరు వేరుగా కనిపించుచున్నాడు. ఇదే అర్థమును మరియొక చోట గీత "ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్" అని చెప్పుచున్నది. ఇక అవతార శరీరము గురించి వివరించుచున్నారు.
నాయనా! శ్రద్ధగా విను. విద్యుత్తు తీగెను ఆశ్రయించి వ్యాపించియున్నది. తీగెను ఎచ్చట ముట్టుకున్నను షాకు కొట్టుచున్నది. కావున విద్యుత్తును తీగెను వేరుచేయలేము. విద్యుత్తే తీగె. తీగెయే విద్యుత్తు. అయితే ఇంత మాత్రమున విద్యుత్తు తీగెగా మారలేదు. విద్యుత్తు పోయిన తరువాత తీగెను ముక్కలు ముక్కలు చేసిననూ విద్యుత్తు ముక్కలు కాలేదు. ఇదే విధముగా "మానుషీం తను మాశ్రితమ్" అని చెప్పినట్లుగా, పరబ్రహ్మము మానవశరీరమును ఆశ్రయించి గదా శ్రీకృష్ణునిగా అవతరించినది. పరబ్రహ్మము ఆ మానవశరీరమును ఆపాదమస్తకము వ్యాపించియున్నది. "అంతర్బహిశ్చ తత్సర్వమ్" కావున శ్రీకృష్ణుడే పరబ్రహ్మము. పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు. అయితే కృష్ణ నిర్యాణసమయమున పరబ్రహ్మమైన నారాయణుడు కృష్ణశరీరము నుండి నిష్ర్కమించగా ఆ కృష్ణశరీరమునకు పార్థుడు దహనసంస్కారము చేసెను. ఇంత మాత్రమున దాని చేత నారాయణుడు దహింపబడలేదు. ఏలననగా నారాయణుడు నర శరీరమును ఆశ్రయించినాడే కాని నారాయణుడు నరుడిగా మారిరాలేదు. ఇది తెలియక అజ్ఞానులు నారాయణుడు మరణించెను, దహింపబడెను అని తలచెదరు.
★ ★ ★ ★ ★