13 May 2025
[29.11.2003] నాయనా! శ్రద్ధగా విను. ఆచరించి తరించు. మనము భగవంతునికి ఈయగలిగిననది ఇచ్చుట గొప్పకాదు. మనము ఈయలేనిది భగవంతునికి ఇచ్చినపుడే భగవంతునిపై బంధము నిరూపితమగుచున్నది. ఇచ్చుట అనుక్రియలో ఏమియులేదు. ఇచ్చిన వస్తువు యొక్క విలువపై ఇచ్చుట అను క్రియ ఆధారపడి యుండును. పారాయణముల ద్వారా వాక్కులను (prayers), ధ్యానము (meditation) ద్వారా మనస్సును భగవంతునకు అర్పించుచున్నారు. అర్పించినామన్న సంతృప్తియే కాని ఆ వాక్కు యొక్క, మనస్సు యొక్క విలువ ఎంత? వాక్కు, మనస్సును దుకాణములో అమ్మిన ఒక్క పైసా కూడ ఇవ్వడు. అనగా మనము ఎట్టి విలువ లేని వస్తువును మాత్రమే భగవంతునికి ఇచ్చుచున్నాము. అదే భార్యాపుత్రాదులకు స్థిర (immovable), చర (movable) రూపమగు ధనమును ఇచ్చుచున్నాము. కావున భార్యాపుత్రాది బంధముల ముందు భగవద్భంధము సూర్యుని ముందు గుడ్డిదీపము (kerosene lamp) వలె వెలవెలబోవుచున్నది. ఇట్లు భగవంతుని అవమానించుటయే కాక నీవే సర్వస్వమని అసత్య ప్రేలాపములు చేసి మోసగించుచున్నాము. ఇట్లు అవమానము, మోసము అను రెండు పాపములు భక్తులను వెంటాడుచున్నవి.
భగవంతునకు వాక్కు, మనస్సు, బుద్ధి (spiritual discussions), చిత్తములను సమర్పించుచున్నారే కాని ప్రేమ స్థానమగు హృదయమును భార్యాపుత్రులకే ఇచ్చుచున్నారు. కనుక నాయనలారా! విమర్శించుకొనండి. సత్యమును గ్రహించండి. మన జీవితములను చక్కగా మలచుకొందాము. సద్గురువాణిని శిరసావహించి ధన్యులమగుదాము. "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" – శాశ్వతమైన, పూర్తిగా సత్యమైన జ్ఞానస్వరూపమే ఆ పరబ్రహ్మము.
★ ★ ★ ★ ★