
22 Sep 2024
[27.02.2003]
శ్లో|| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురు స్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||
ఈ శ్లోకము త్రిమూర్త్యాత్మకుడగు శ్రీ దత్తాత్రేయుడే గురువని స్పష్టముగా చెప్పుచున్నది. "గు" కారము అనగా అంధకారము "రు" కారము అనగా ఆ అంధకారమును పారద్రోలు ప్రకాశము అనగా అజ్ఞానమను అంధకారమును జ్ఞానము అను ప్రకాశము చేత పోగొట్టువాడని అర్థము. శ్రుతి కూడ "సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ" అనగా అనంతమైన సత్యమైన జ్ఞానమే బ్రహ్మమనియు, "ప్రజ్ఞానం బ్రహ్మ" అనగా ప్రశస్తమైన ఉత్తమమైన జ్ఞానమే బ్రహ్మము అని చెప్పుచున్నది.

జ్ఞానము అను శబ్దము చైతన్యము అను అర్థములో పండితులు తీసుకొనుచున్నారు కాని ఈ అర్థము సరికాదు. ఏలననగా లోకములో ఎవరును చైతన్యమును జ్ఞానము అని పిలుచుట లేదు. చైతన్యము కలిగిన ఒక ప్రాణిని “జ్ఞాని” అని పిలుచుట లేదు. జ్ఞానము అను శబ్దము ‘ఒక విషయము’ అను అర్థములోనే ఉపయోగపడుచున్నది. చైతన్యము కలిగి జ్ఞానము లేనివానిని ‘అజ్ఞాని’ అని పిలుచుచున్నాము. కావున చైతన్యము వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము చైతన్యము కల ప్రాణి వద్దనే ఉండును. అచేతనము వద్ద ఉండదు. జ్ఞానము ఉన్న ప్రతిచోట చైతన్యము ఉండవలెను. కాని చైతన్యము ఉన్న ప్రతిచోట జ్ఞానము ఉండనక్కరలేదు. సూర్యుడు ఉన్నచోట కాంతి ఉండును. కాని కాంతియున్నచో సూర్యుడు ఉండవలయునని నియమము లేదు. రాత్రిపూట దీపకాంతి యున్ననూ, సూర్యుడు లేడు కదా.
కావున జ్ఞానము అనగా, తర్కజ్ఞానము, వేదాంతజ్ఞానము, వ్యాకరణజ్ఞానము మొదలగు శాస్త్రములలో ఉన్న విషయమే. లోకమును గురించిన జ్ఞానమే లోకజ్ఞానము. బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మజ్ఞానము. అన్ని జ్ఞానములలోను బ్రహ్మజ్ఞానమే గొప్పది. ఏలననగా బ్రహ్మము తెలిసినచో, సర్వము తెలిసినట్లేయని “సర్వం విజ్ఞాతం భవతి” అని శ్రుతి చెప్పుచున్నది. కావున సర్వజ్ఞానములలో బ్రహ్మజ్ఞానము అనగా వేదాంతజ్ఞానమే గొప్పది. కావుననే దానిని “ప్రజ్ఞానం” అని అన్నారు.
ప్రజ్ఞానము అనగా ప్రశస్తమైన జ్ఞానము అదియే అనంతమైన సత్యమైన జ్ఞానము. ఇచ్చట ప్రజ్ఞానం అనగా ‘ప్రజ్ఞాని’ అని తీసుకొనవలయును. వ్యాకరణశాస్త్రము ప్రకారముగా, ఎక్కువగా ప్రజ్ఞానము కలవాడు అనగా ‘ప్రజ్ఞాని’, ‘ప్రజ్ఞానము’ అను శబ్దము చేతనే పిలువబడును. కావున జ్ఞాని అనగా జ్ఞానము కలవాడు ‘జ్ఞానము’ అనియే పిలువబడవచ్చును. కావున ఈ శ్రుతుల అర్థము బ్రహ్మము అనగా సత్యమైన, అనంతమైన, శ్రేష్ఠమైన జ్ఞానము కలవాడే అని వచ్చును. కావున అతి శ్రేష్ఠమైన వేదాంతతత్త్వము యొక్క జ్ఞానముకల గురుస్వరూపమే పరబ్రహ్మము అని వేదార్థము. ఇట్టి పరమ పవిత్రమైన బ్రహ్మజ్ఞానమైన వేదాంతమును గీత ద్వారా చెప్పియుండుట చేత కృష్ణుడు జగద్గురువైనాడు. "కృష్ణం వందే జగద్గురుమ్" అని చెప్పబడినది. గీతలలో వివరించిన ముగ్గురు ఆచార్యులును జగద్గురువులే. ఉపనిషత్తుల వివరణమే బ్రహ్మసూత్రములు. ఆ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కావున ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు రెండును భగవద్గీతయందే లీనమైయున్నవి. ఈ బ్రహ్మసూత్రములను వ్రాసిన వ్యాసుడు కూడా జగద్గురువే. ఆయన యొక్క జన్మతిథియగు ఆషాఢపూర్ణిమనే "గురుపూర్ణిమ" అనుచున్నాము. ఐతే వ్యాసుడు ఉపనిషత్తుల యొక్క సమస్వయమును చూపినాడు. కాని కృష్ణుడు ఉపనిషత్తుల సారమును పిండినాడు.
వ్యాసుడు విష్ణువు యొక్క అంశ. కృష్ణుడు బ్రహ్మవిష్ణుశివాత్మకమైన దత్తావతారము. కావున వ్యాసుడు గురువైనచో కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణుడే దత్తుడు. దత్తుడే కృష్ణుడు. కావున కృష్ణుడు దశావతారములలో పేర్కొనబడలేదు. దశావతారములో ఏకమూర్తియైన విష్ణువు యొక్క స్వరూపములు. కృష్ణుడు త్రిమూర్తి స్వరూపుడై మూలవిరాట్పురుషుడగు దత్తుడే. దత్తుడు గురువులకే గురువు. అందుకే ఆయనను "గురోర్గురుతరాయ నమః" అని చెప్పుచున్నారు. దత్తుని యొక్క పరిపూర్ణతమావతారమే కృష్ణుడని భాగవతము చెప్పుచున్నది. అట్టి కృష్ణుడు పార్థునకు బంధువుగా, చెలికానిగా, రథసారథిగా చిక్కి చివరకు గీతను బోధించి గురువుగా లభించినాడు. అర్జునుడు కృష్ణుని పాదములపై "శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్" అనగా ఓ కృష్ణా! నీకు నేను శిష్యుడను. నీకు ప్రపత్తిని చేసి శరణాగతుడనై పాదములపై బడి ప్రశ్నించుచున్నాను అని చెప్పినాడు. పార్థుడు తనను శిష్యునిగా చెప్పుకొని పరిపూర్ణ శరణాగతుడై అడిగినపుడు స్వామి గురుస్వరూపముతో గీతను బోధించినాడు. దీని అర్థమేమి?
శ్రద్ధతో, ప్రపత్తితో జ్ఞానదాహము గలవారికి జ్ఞానామృతము నీయవలయును. కావుననే కృష్ణుడు మరి ఎవ్వరికిని గీత చెప్పలేదు. అంతే కాదు అదే అర్జునుడు యుద్ధము ముగిసిన తర్వాత చక్కని విందు ఆరగించి, తాను తాంబూలము వేసుకొని, కాలక్షేపము కొరకు, కృష్ణుని మరల గీతను చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునా! ఆనాటి స్థితి వేరు. ఈనాటి స్థితి వేరు. మరల ఇప్పుడు గీతను చెప్పలేను అన్నాడు. దీని అర్థమేమి? ఆనాటి కృష్ణుడు, ఈనాటి కృష్ణుడు ఒక్కడే. కాని ఆనాడు జ్ఞానదాహముతో తపనతో జ్ఞానమును అర్థించిన అర్జునుడు వేరు. ఈనాడు కాలక్షేపము కొరకు జ్ఞానమును అర్థించు అర్జునుడు వేరు. కావున శ్రద్ధ లేనిదే జ్ఞానమును బోధింపరాదు. కాని ఈనాడు జ్ఞానశ్రవణము చేయు జీవుల శ్రద్ధ పరమ హాస్యాస్పదముగ ఉన్నది.
గుడిలో పండితుడు చక్కగా భాష్యమును వివరించుచు బ్రహ్మజ్ఞానమును బోధించుచుండగా, పట్టుమని పది మంది కూడ అచ్చట ఉండరు. ఉన్న నలుగురిలో కూడ ఒకరు ఒత్తులను చేసుకొనుచుందురు. మరియొకరు కునికిపాట్లు పడుచుందురు. మిగిలిన ఇరువురు అమ్మాయి పురిటికి వచ్చినదా అని కబుర్లు చెప్పుకొందురు. ఈ బ్రహ్మజ్ఞాన శ్రవణము కూడ ఇంటి పనులన్నియు ముగిసి భోజనము చేసి నిద్రపోయి లేచి, తీరికగాయుండు సాయంకాల సమయము. ఆ సమయమునకు కూడ మరియొక నియమము ఉన్నది. ఆరోజు సాయంకాలము, టి.వి.లో ఏ సినిమా వేసి ఉండకూడదు. ఆ రోజు ఆ సమయమున సినిమా ఉన్నచో శ్రోతలు రాకపోవుటయే కాదు ఆ శాస్త్రిగారు కూడ వచ్చుట లేదు. ఈ శ్రద్ధలకు బ్రహ్మ సాక్షాత్కారము కావలయును. ఈ లోకము వదిలిన మరుక్షణమే శాశ్వత బ్రహ్మలోక నివాసము కావలయును. చేతిలో ఉన్నది ఒక్క పైసా పదునాలుగు అంతస్తుల భవనము కొనుటకు బేరము చేయుచున్నాడు.
యాజ్ఞవల్క్యుడు తత్త్వమును బోధించుచుండగా జనకుడు వినుచున్నాడు. ఆయన రాజ్యమగు మిథిలానగరము మంటలలో కాలిపోవుచున్నదని భటులు పరుగెత్తుకొని వచ్చి చెప్పినారు. దానికి జనకుడు మిథిల పోయినచో పోనిండు. ఈ శరీరమే ఒకనాటికి అగ్నిలో భస్మమగు. ఈ సృష్టిలో నిశ్చలముగా నిలుచు పర్వతములు కూడా చివరకు ప్రళయాగ్నిలో భస్మము కావలసినది. ఇంత చక్కటి జ్ఞానామృతము ఎచ్చట లభించును అని అచ్చట నుండి లేవలేదు. కొంతసేపటికి సత్సంగము ముగిసినది. మరల భటులు పరుగెత్తుకొని వచ్చినారు. అయ్యా! బూడిద నుండి మిథిలా నగరము సర్వ జనులతో పాటు యథాప్రకారముగా మరల లేచి సృష్టించబడుటయే కాదు, అగ్నిలో కాలిన బంగారము వలె ద్విగుణీకృతమైన శోభతో వెలుగుచున్నదని చెప్పినారు. ఈ పరమ మూఢాతి మూఢులైన జీవులకు తెలియదు పరబ్రహ్మమే ఇహపరములకు ఆధారము అని. ఈ సమస్తలోకమును సృష్టించిన వాడు పరమాత్మయే. ఈ సమస్త లోకములలో యున్న ప్రతి పరమాణువు ఆయన యొక్క సంకల్పవశమై యున్నది. ఈ జీవుడు తన మేథాశక్తిని అహోరాత్రములు ఉపయోగించి, కొన్ని సంవత్సరములు ప్రయత్నించిననూ, అణుమాత్రము పరిష్కారమునకు రాని సమస్యలు ఆ పరమాత్మ సంకల్పము చేసిన క్షణకాలములో పరిష్కరించబడును. పరమాత్మ యందు మనస్సును లగ్నము చేయక లోక విషయములందు నిరంతరము మనస్సును లగ్నము చేసి సాధించునది క్షణకాల విజయములే. కాని పరమాత్మయందు మనస్సును లగ్నము చేసినచో, ఇహపరములందు శాశ్వత విజయము కల్గును.
వేరుకు నీరు పోసినచో చెట్టు మొత్తము పచ్చగా యుండి కళకళలాడుచుండును. వేరుకు నీరు పోయక, కొమ్మలను ఆకులను నీటితో తడిపిన ప్రయోజనము లేదు. ఒక్క క్షణకాలము చల్లగ నుండును. కాని చెట్టు మొత్తము ఎండిపోవుచున్నది. లోక విషయములందు మనస్సు కేంద్రీకరించు లౌకికుడు, కొమ్మలను ఆకులను తడుపు తెలివి తక్కువవాడు. లౌకికముల గురించి పట్టించుకొనక పరమాత్మ యందే మనస్సును లగ్నము చేయువాడు వేరుకు నీరు పోయువాని వలె చూచుటకు చాదస్తునిగా కనిపించుచు ఎండిపోవుచున్న కొమ్మలను తడపక ఉండగా, వీడు నేల మీద నీటిని పోయుచున్నాడు అని వానిని మూఢులు విమర్శింతురు. భూమిలో ఆ చెట్టు వేరు దాగియున్నది. అతడు భూమిలో పోసిన నీరు వేరుకు చేరి వేరు ద్వారా చెట్టులోనికి ఎక్కుచున్నది. అసలు వేరు కనపడుట లేదు. కావున వానిని తెలివితక్కువవానిగా భావించుచున్నారు. అట్లే ఇహపరములు అను కొమ్మలు ఆకులు గల ఈ సృష్టివృక్షమునకు ప్రాణమూలమైన ఆధారమైన వేరు అగు బ్రహ్మము మన కంటికి కనబడదు. ఆ బ్రహ్మము నరావతారము నెత్తిన గురుస్వరూపములో దాగియుండును.
గోపికలు వ్యవసాయము, ఆవుల పనులను వదలివేసి నిరంతరము కృష్ణుని సంగములో యుండెడివారు. దాని వలన లౌకిక కార్యములు చెడకపోగా ఎంతో వృద్ధితో ఉండెడివి. గోవులకు ఏ రోగములు వచ్చెడివి కావు. చక్కగా రెండింతలు పాలు ఇచ్చెడివి. పంట పదిరెట్లు పండెడిది. "ఏషాం సతతయుక్తానామ్ యోగక్షేమం వహామ్యహమ్” అని స్వామి గీతలో ప్రతిజ్ఞ చేశాడు. సతతయుక్తులు అనగా స్వామిని ఒక్క క్షణము కూడ వదలక ఉండెడి వారని అర్థము. అట్టి వారి యొక్క యోగక్షేమములను స్వామియే చూతురని అర్థము. యోగము అనగా పరలోకమున రక్షణము. క్షేమము అనగా ఇచ్చట లౌకికసమస్యలు తీరుట. అయితే ఇది నారాయణుడే నరరూపములో వచ్చిన శ్రీకృష్ణుని విషయము. ఇట్టి నరావతారములే 'బోధక గురువులు'. ఇట్టి నారాయణ అవతారమును నారాయణ తత్త్వముతోనే గుర్తించవలయును.
నారాయణ శబ్దమునకు అర్థమేమి? "నారం జ్ఞానం అయనం యస్య సః నారాయణః" అనగా జ్ఞానమునకు ఆశ్రయమైన వాడు నారాయణుడు అని అర్థము. కావున జ్ఞానతత్త్వము చేతనే నారాయణుని గుర్తించవలెను. ఈ నారాయణుడు సకల కల్యాణగుణ సంపన్నుడు. వేదములో చెప్పిన మొదటి కల్యాణగుణము “జ్ఞానము”. అదే "సత్యం జ్ఞానమ్ అనంతం బ్రహ్మ". ఇక వేదములో చెప్పిన రెండవ కల్యాణగుణము "ప్రేమ". అదే "రసో వై సః" అని శ్రుతిలో చెప్పబడినది. ఇక వేదములో చెప్పబడిన మూడవ కల్యాణగుణము "ఆనందము". అదే "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్" అని శ్రుతి చెప్పుచున్నది.
★ ★ ★ ★ ★
Also Read
Song On God Datta - Dattatreya Dattatreya
Posted on: 03/06/2021Shri Dattatreya Swami Paadapadma Sharanaashtakam
Posted on: 22/08/2024How To Distinguish Between A True Sadguru And A False Sadguru?
Posted on: 16/09/2020My Experiences With My Sadguru His Holiness Shri Datta Swami
Posted on: 14/01/2023
Related Articles
Message On Datta Jayanti - Part-1
Posted on: 26/12/2004Message On Guru Purnima From His Holiness Shri Datta Swami
Posted on: 13/07/2022Atman, Brahman And Sadhana - I
Posted on: 04/09/2006Teaching For The Varanasi Saint - I
Posted on: 23/04/2006Message On Krishnashtami: Part-1
Posted on: 26/08/2005