home
Shri Datta Swami

 Posted on 14 Sep 2024. Share

Telugu »   English »  

అంతరార్థమును బోధించాలి

"మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరమ్, కథయన్తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ" అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్థము నా యందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కథలలోని నా కథలను తత్త్వమును లేక అంతరార్థమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించు చుందురు అని ఈ శ్లోకార్థము. మనస్సు పరమాత్మ యందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడ అర్పించ బడుచున్నవి. ప్రాణము వాయు స్వరూపమై యున్నది. మరణించిన తర్వాత శ్వాస ఆగిపోవుచున్నది. ఈ శ్వాసయే వాయువు కావున ప్రాణము అనగా పంచభూతములలో వాయువు ఒకటి. పంచభూతమైన ఈ శరీరములో వాయువు కూడ ఒక భాగమే.

కావున ప్రాణము కూడ దేహము అను శబ్దము లోనికే వచ్చుచున్నది. "దహ్యతే ఇతి దేహః" ఏదో ఒక సమయమున దహించబడవలసినదే అని దేహ శబ్దమునకు అర్థము. కావున ఈ దేహమును స్వామి కొరకు దహనము కావించిన గోపికలు ధన్యులు. స్వామి నిర్యాణము చెందినారని వినగనే గోపికలు అగ్నిలో దూకి తమ దేహములను దగ్ధము చేసినారు. కాని అందరు గోపికలు అట్లు చేయలేకపోయినారు. మిగిలిన గోపికలను అర్జునుడు తీసుకొని వచ్చుచుండగా దారిలో కిరాతకులు కొల్లగొట్టి ఆ గోపికలను అపహరించుకొనిపోయి హింసించి చంపి తిన్నారు. అగ్నిలో దూకిన గోపికలు నేరుగా గోలోకమునకు పోయినారు. దేహము మీద మమకారమున్న గోపికలు కూడ నాలుగు దినములలో మరణించినారు. కాని వారు గోలోకమునకు పోలేదు. వారికి స్వామిపై నున్న మమకారము కన్న వారి దేహములపై మమకారము ఎక్కువగా యున్నది. కొందరికి ఈ దేహముతో సంబంధమున్న ఇతర జీవులపై మమకారముండును. కొందరు స్త్రీలు భర్తలతో పాటు సహగమనము చేసెడివారు. ఈనాడు ఒక రాజకీయనాయకుడు మరణించగనే అతని యొక్క వీరాభిమాని తనను తాను దహనము చేసుకొనుచున్నాడు. కావున దేహబంధము దేహమునకు సంభంధించిన వ్యక్తుల బంధము, దేహ బంధము లేకపోయినను, తాను అభిమానించిన వ్యక్తిపై బంధము. ఇట్లు అనేక విధములైన వ్యామోహములు జీవుని చుట్టుముట్టి యున్నవి. స్వామి మానవ శరీరమును తాల్చి కృష్ణ పరమాత్మగా వచ్చినపుడు స్వామిపై కూడ భక్తులకు బంధము ఏర్పడెను. ఈ బంధము జీవుని యొక్క అన్ని బంధములతో పోటీ పడును. ఈ పోటీలో స్వామి బంధముతో సమానమైన బంధము ఏ ఇతర జీవుల మీద కాని, ఏ వస్తువుల మీద కాని చివరకు తన దేహము మీద కాని కూడ లేదని నిరూపించిన జీవుడే దత్త పరీక్షలో పూర్ణముగా ఉత్తీర్ణుడగుచున్నాడు. దీనినే శ్రుతి "న తత్సమ శ్చాభ్యధికశ్చ  శ్రూయతే" అనగా ఆయనతో సమానమైన వస్తువు కాని వ్యక్తి కాని లేదు అని చెప్పుచున్నది. ఇక ఆయనకు మించిన వస్తువు గాని, వ్యక్తి గాని ఎట్లుండును అని అర్థము.

Swami

పట్టాభిషేక సమయమున జానకీదేవి యిచ్చిన ముత్యాల హారమును హనుమంతుడు చూచి కొరికి పారవేయుచున్నాడు. జానకీ మాతను అట్లు అవమానించి నందులకు సభ్యులకు కోపము వచ్చినది. వారందరు ఇది ఏమి పనియని కోపముతో కేకలు పెట్టినారు. ఈ ముత్యములలో రాముడు లేడని పారవేయుచున్నాను అని హనుమంతుడు పలికెను. అట్లైనచో నీ హృదయములో రాముడు ఉన్నాడా అని వారు అడిగినారు. హనుమంతుడు తన గోళ్ళతో తన హృదయమును చీల్చి రాముని చూపినాడు ఇది కథ. ఈ కథను చెప్పుకొనుటయే శ్లోకములో "కథయంతశ్చ" అని చెప్పబడినది. కాని కథను మాత్రమే శ్రవణము చేయుట పురాణ శ్రవణమగును. దీని వలన పెద్ద ప్రయోజనము లేదు. అందుకే "బోధయంతః" అన్నారు. అనగా ఆ కథలోని అంతరార్థమును బోధించవలెను. కథ లేక కేవలము వేదాంత తత్త్వబోధ, భాష్య ప్రవచనమందురు. ఇది పండితులకు మాత్రమే ఆనందమును కలిగించును. పామరులకు కేవలము కథ మాత్రమే ఆనందము కలిగించును. ఒకటి అతివృష్టి మరియొకటి అనావృష్టి. ఈ రెండింటి యొక్క మిశ్రమమే సత్సంగము అందురు. ఇందులో కథాశ్రవణము, జ్ఞానబోధ రెండూ ఉండును. ఈ రెండింటిని సమన్వయము చేసినపుడే అటు పామరులకు, అటు పండితులకు, ఈ రెండింటి మధ్య వారికి పరిపూర్ణ ఆనందము లభించును.

ఇట్టి సత్సంగము నందు దేవలోకములోని అమృతము కూడ దిగదుడుపే అగును. ఋషులు పురాణములు శాస్త్రములు వ్రాసినారు. ఈ రెండింటి సమన్వయ సత్సంగములే ఉపనిషత్తులు. వీటిని వేదాంతము లందురు. అనగా జ్ఞానము యొక్క శిఖరాగ్రస్థాయిలో ఉన్నవి అని అర్థము. ఇంతకునూ ఇప్పుడు చెప్పిన కథలో జ్ఞానబోధ ఏమి? హనుమంతునకు ముత్యములలో రాముడు ఎందుకు కనిపించలేదు? సర్వ జగత్తులో పరమాత్మ ఉన్నప్పుడు ముత్యములలో ఏల లేడు? "నేతి నేతి ద్వివిధః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా ఇది కాదు, ఇది కాదు అని సృష్టిలోని ప్రతి వస్తువును అందులో పరమాత్మ లేడని జ్ఞానులు త్యజించినారు అని శ్రుతికి అర్థము. గీతలో కూడ "నాహం తేష్వవస్థితః" అన్నారు స్వామి. అనగా ఈ జగత్తులో దేని యందును లేను అని అర్థము. మరియొక చోట గీతలో "న త్వహం తేషు తే మయి" అన్నారు. అనగా ఈ జగత్తులో నేనెక్కడను లేను. ఈ జగత్తు నాలో ఉన్నది అని అర్థము. మరియొక చోట గీతలో "యయేదం ధార్యతే జగత్‌" అన్నారు. ఈ జగత్తును నేను ధరించి ఉన్నాను అని అర్థము. కావున పరమాత్మ జగత్తుకు ఆధారంగా ఉన్నాడు. అంతే కాని జగత్తులో ఏ వస్తువునందును ఏ వ్యక్తి యందును పరమాత్మ లేడు.

ఈ జగత్తుకు పరమాత్మకు ఆధేయ ఆధార సంబంధము ఉన్నదని శ్రీ రామానుజాచార్యులు తన భాష్యములో స్థాపించినారు. అనగా బల్ల ఆధారము. బల్ల మీద ఉన్న వస్తువులు ఆధేయములు. వస్తువులలో బల్ల లేదు. బల్లలో కూడ వస్తువులు లేవు. కావున వస్తువులలోని వికారము బల్లకు అంటదు. ఈ తత్త్వమును నిరూపించుట కొరకే హనుమంతుడు ముత్యములను కొరికి పారవేసినాడు. కాని నీలో పరమాత్మ ఉన్నాడా? అని సభ్యులు ప్రశ్నించినపుడు నాలో పరమాత్మ లేనిచో ఈ దేహము కూడ వ్యర్థమే. నాకు అక్కర లేదు అని తన గోళ్ళతో హృదయమును చీల్చినాడు. ఆ గోళ్ళు గుండెలోనికి దిగబడి గుండెకాయ ముక్కలు ముక్కలుగా చీలినది. అనగా స్వామి కొరకు ప్రాణార్పణము చేసినాడు. ఇదే "మద్గత ప్రాణాః" అని శ్లోకములో చెప్పబడినది. ఆ విధముగా గుండె చీల్చి ప్రాణత్యాగము చేయుటకు సభ్యులు ఎవ్వరును సాహసించలేదు. ఏలననగా, వారిలో పరమాత్మ లేడు. అప్పుడు హృదయమున రాముడు గోచరించినాడు. అనగా మహా భక్తుడగు హనుమంతుని యందు పరమాత్మ ఉన్నాడని అర్థము. "తన్మయా హి తే" అను నారద భక్తి సూత్రము గలదు. దాని అర్థము భగవంతుడు తన మహా భక్తులను ఆవేశించి యుండును. అట్టి మహా భక్తుడు ఎవరు? భగవంతుని కొరకు ప్రాణములను తృణముగా గణించు వాడే మహా భక్తుడు.

భక్తులను భగవంతుడు ఆవేశించి యుండుట ఆవేశావతారమని చెప్పబడును. పరమాత్మ భక్తుల యొక్క సాధనలో సాయపడుటకు ఒక మనుష్య శరీరము ధరించి వచ్చును. అదియే రామావతారము. అట్టి మనుష్య శరీరములో ప్రత్యేకమైన జీవుడు ఉండడు. అట్టి శరీరము ఒక వ్యక్తి ధరించిన చొక్కా వంటిది. ఆవేశావతారము అట్లు కాదు. ఒక శరీరమను చొక్కాను ఒక వ్యక్తి ధరించి యుండగా అదే చొక్కాలోనికి ఆ ధరించిన వ్యక్తితో పాటు మరియొక వ్యక్తి దానిలోకి దూరుట. వర్షములో ఒక పెద్ద రైన్‌కోటులో దూరి ఇరువురు కలసి వచ్చుట మనము చూతుము. ఇదే ఆవేశావతారము. అనగా హనుమంతుని శరీరము అను చొక్కాలో హనుమంతుడు అను జీవుడు ఉన్నాడు. దాని లోనికి రామ శరీరమను చొక్కాను ధరించిన పరమాత్మ దూరినాడు. దీనినే ఋగ్వేదము ఇట్లు చెప్పుచున్నది. "ద్వా సుపర్ణా సఖాయా" అనగా ఒకే వృక్షమును మంచి మైత్రి కలిగిన రెండు పక్షులు కలసి ఆశ్రయించి ఉన్నవి అని అర్థము. వృక్షము అనగా భక్తుని శరీరము. ఈ రెండు పక్షులే జీవాత్మ పరమాత్మలు. రాముని శరీరము కూడ వృక్షమే. దాని యందు పరమాత్మ పక్షి మాత్రమే ఉన్నది. హృదయమును చీల్చక ముందు హనుమంతుడు ఒక జీవుడు. అనగా హనుమంతుని శరీరము అను వృక్షము నందు హనుమంతుడు అను జీవుడు అను ఒక పక్షే ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు రామ శరీరముతో పాటు పరమాత్మ దర్శన మిచ్చినాడు. శరీరమును ఆశ్రయించనిచో దర్శనము అసంభవము. శరీరము పంచభూతములతో నిర్మించబడవచ్చును. లేక ఒకే భూతముతో నిర్మించబడ వచ్చును. మనుష్య శరీరము పంచభూతములై యున్నది. దేవతా శరీరము కేవలము అగ్ని (తేజస్సు) అను ఒకే భూతము చేత నిర్మించబడినది. పిశాచ శరీరములు కొన్ని కేవలము వాయువు చేతను, మరికొన్ని వాయువు చేరిన అగ్ని తేజస్సు చేతను మరికొన్ని వాయువు, తేజస్సు, జల కణముల చేతను నిర్మించబడి యుండును. వాయు, తేజో జలములు కలసి నప్పుడు ఆ శరీరము ధూమ శరీరములనబడును.

కావున పంచభూతములకు అతీతమైన అనగా సృష్టికి అతీతమైన పరమాత్మను దేవతాదులు సహితము దర్శింపజాలరు. దర్శనమే కాదు దేవతలు సైతము ఊహించజాలక ఉన్నారు. అందుకే ఋగ్వేదము "కస్త్మై దేవాయ హవిషా విధేమ" అని చెప్పుచున్నది. అనగా ఆ దేవునకు ఎవరని నిర్ణయించి ఈ హవిస్సును ఇవ్వగలము అని అర్థము. అది అందరాని బ్రహ్మము. శ్రీరాముడు అందివచ్చిన బ్రహ్మము. హనుమంతుని హృదయములో కూడ నరాకారమును ధరించి వచ్చిన శ్రీరాముడే కనిపించినాడు. హనుమంతుని హృదయములో కనిపించిన శ్రీరాముడు తేజోమయమైన దేవతా శరీరముతో కనిపించినాడు. పంచ భూతమయమైన హనుమంతుని హృదయములో, పంచ భూతమయమైన రాముని శరీరము గోచరించుట ప్రకృతి నియమ విరుద్ధము. తేజోమయ శరీరము కనిపించుట కూడ ప్రకృతి నియమమునకు అతీతమై యున్నది. కావున వీలగునంత వరకు ప్రకృతి నియమములకు ఎక్కువ భంగము కాకుండగనే పరమాత్మ మహిమలు చేయును. కావున పరమాత్మ తేజోమయమైన దేవతా శరీరము కలిగి, అవతరించునపుడు మాతృ గర్భమున ఏర్పడిన పంచభూతమయ శరీరము నందు తేజోమయ శరీరుడై ఆవేశించుచున్నాడు. ఆ తేజోమయ శరీరము యొక్క అవయవములు పంచభూత శరీర అవయవములలో ఇమిడిపోవును. ఇదే ‘నేత్రమునకు నేత్రము’ అని కేనోపనిషత్తు చెప్పుచున్నది.

హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు ఈ తేజోమయ శరీరము అణిమయను సిద్ధి ద్వార సంక్షిప్తమై హృదయమున గోచరించినది. అవతార శరీరము నిర్యాణము చెందినపుడు, ఈ పంచభూత శరీరము నుండి ఆ తేజోమయ శరీరము వెడలిపోవును. అట్టి కృష్ణుని శరీరమునకు అర్జునుడు దహన సంస్కారములు కావించినాడు. కాని ఆ తేజోమయ శరీరము ఈ పంచభూత శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి యున్నప్పుడు, లోహపు తీగెను విద్యుత్తు వలె సంపూర్ణముగా వ్యాపించి యుండును. కావున అద్వైతమే. ఇదే అంది వచ్చిన పరబ్రహ్మము. విశ్వరూపమును ప్రదర్శించినపుడు ఈ తేజోమయ శరీరము మహిమ అను సిద్ధి ద్వారా అనంతమై గోచరించినది. ఆ తేజశ్శరీరము విశ్వమంతయు వ్యాపించి విశ్వమును తనలో చూపినది. ఆ తేజశ్శరీరములో కురుక్షేత్రము కూడా ఉన్నది. ఆ కురుక్షేత్రములో పంచభూతమయమైన కృష్ణ శరీరము కూడ ఉన్నది. శ్రుతి "వివృణుతే తనూం స్వామ్‌” అని చెప్పుచున్నది. అనగా మహా భక్తుడు ఆ తేజోరూపమును చూడగోరినపుడు ఈ అవతార పురుషుడు తనలో ఇమిడి ఉన్న ఆ చిన్న తేజోరూపము అను తనువును విస్తరించి ప్రకటించును.

ఒక చిన్న వాక్యమునకు వ్యాఖ్యానించునపుడు ఎట్లు విస్తారమైన దాని యందున్న అర్థము ప్రకటించబడునో అట్లు ప్రకటించబడును అని "వివృణుతే" అను క్రియా పదమునకు అర్ధము. ఆ యోగీశ్వర రూపము సహస్ర సూర్య తేజస్సుతో చేయబడినది అని చెప్పబడినది. "దివి సూర్య సహస్రస్య", అది నాశనము లేనిది కావుననే "దర్శయాత్మాన మవ్యయమ్" అని చెప్పబడినది. పంచభూతములు విడిపోవచ్చును. కాని ఒకే భూతమగు తేజస్సు విడిపోదు. కావున నాశనము లేదు. మరల ఆ విశ్వము రూపము ఉపసంహరించినపుడు ఆ తేజో రూపము సంక్షిప్తమై కృష్ణుని శరీరమందు లీనమైనది. ఈ తేజో రూపము అవతార పురుషుని పంచభూత శరీరము నందు దాగి ఉండి ఒక్కొక్కసారి కొంచెము ప్రకటితమగుచుండును. అప్పుడు పంచభూత శరీరము కాంతితో వెలుగును. ఇదే ముచుకుందునకు కృష్ణుడు చూపిన దర్శనము. ఆ తేజో రూపము యొక్క తేజస్సు పంచభూత శరీరములోని ఒకానొక అవయవము నందే వ్యక్తము కావచ్చును. అదియే దివ్య దర్శనములు. కాని సాధకుడు వీటి గురించి భ్రమ పడరాదు. ఏలననగా ఆ తేజస్సు జడమైన ఒక భూతమే కదా! మనము సూర్య తేజస్సు లోకములో చూచుచునే ఉన్నాము గదా. ధృతరాష్ట్రుడును విశ్వరూపమును దర్శించెను. రావణుడు తేజోరూపమైన శివుని దర్శించెను. కాని ప్రయోజనమేమి? రాధ ఎప్పుడును ఇట్టి దర్శనమును పొందలేదు. ఆయనలో ఆ తేజస్సు కన్నను చైతన్యమయమైన ఆయన ప్రేమ చాలా గొప్పది. దానిని ప్రకటింప చేసిన సాధకుడు ధన్యుడు.

★ ★ ★ ★ ★

 
 whatsnewContactSearch
Share Via