
15 Sep 2024
[08.01.2003] బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య అనగా పరమాత్మను గుర్తించుట. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని శ్రుతి. అనగా చైతన్యము బ్రహ్మము అని. ప్రజ్ఞాన శబ్దమునకు ‘చైతన్యము’ అను సామాన్య అర్థములో చెప్పినారు. చైతన్యము అనగా సర్వ ప్రాణులయందు సంకల్పాదులను చేయు ఒక విశేషమైన ప్రాణ శక్తి. ఈ చైతన్యమే బ్రహ్మము అని అన్నప్పుడు ఇందులో అర్థము చేసుకొనుటలో ఎట్టి కష్టము లేదు. కొంచెము భౌతిక శాస్త్రము చదివినవాడు శక్తుల యొక్క తత్త్వములను బాగుగా అధ్యయనము చేసినవాడు దీనిని సులభముగా అర్థము చేసుకొనగలడు. ఇదే బ్రహ్మజ్ఞానము లేక బ్రహ్మ విద్య యైనచో ఇందు కష్టమేమున్నది. కాని బ్రహ్మ విద్యయనగా అన్ని విద్యల కన్న చాలా కష్టమైనది అను అర్థములోనే పెద్దలు ‘ఇదేమి బ్రహ్మ విద్యయా’ అను సామెతగా వాడుచూ వచ్చినారు. సృష్టి సంకల్పమును బ్రహ్మము చేసినందున బ్రహ్మము చైతన్యము అని చెప్పుటలో కల ఉద్దేశము బ్రహ్మము జడము కాదనియే. కాని బ్రహ్మము చైతన్యము అని అన్నప్పుడు ఒక శరీరమును వదలిన చైతన్యము మనకు లోకములో ఎచ్చటను కనపడుట లేదు. చైతన్యమెప్పుడును ఒక ప్రాణిని ఆశ్రయించియే యున్నది. కావున చైతన్యమనగా ఒక ప్రాణియే.

కావున బ్రహ్మము చైతన్యము అన్నప్పుడు అది యొక ప్రాణియే కావలయును. అనగా బ్రహ్మము ప్రాణి స్వరూపము అని అర్థము. ప్రాణియనగా పశుపక్ష్యాదులు కావచ్చును లేక మానవుడు కావచ్చును. ఇంత చిత్రాతి చిత్రమైన జగత్తును ఈ విధముగా సృష్టించుటకు ప్రాణి స్వరూపమైన ఆ బ్రహ్మము సృజించినది అన్నప్పుడు ఆ ప్రాణి స్వరూపము పశుపక్ష్యాదులగునా? లేక మానవుడగునా? ఇంత విచిత్ర సంకల్పమును చేయు శక్తి పశుపక్ష్యాదులకు లేదు. కేవలము మానవునకే కలదు. కావున సృష్టికర్త యగు పరబ్రహ్మము బ్రహ్మదేవుడు అను పేరుగల ఒక మానవాకారములోనే యున్నది. జీవుడు బ్రహ్మము అన్నప్పుడు పశుపక్ష్యాదులు జీవులే. మానవులు జీవులే. కావున బ్రహ్మము జీవ స్వరూపమున ఉన్నది. అన్నప్పుడు ఆ జీవ శబ్దము పశుపక్ష్యాదులకు కాదు మానవుడేను అనుటకు ఈ జగత్సంకల్పము కారణముగా చెప్పబడుచున్నది. జీవుడు బ్రహ్మ స్వరూపమని శంకరులు చెప్పినారు. "జీవో బ్రహ్మైవ నాపరః", ఇదే గీతలో "జీవ భూత స్సనాతనః" అనగా ఆ సనాతనుడే జీవ స్వరూపమున ఉన్నాడనియు మరియు "జీవ భూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్" అనగా ఈ జగత్తును ధరించువాడు జీవ స్వరూపమున ఉన్నాడు అనియును చెప్పబడినది. మరియు జీవ శబ్దము చేత ఒక వేళ మీరు పశుపక్ష్యాదులని అర్థము తీసుకొందురేమో అని శంకించి గీతలో స్పష్టముగా "మానుషీం తను మాశ్రితమ్" అని చెప్పినాడు. అనగా నేను మనుష్య స్వరూపమునే ఆశ్రయించి యుందును అని అర్థము. ఇదే మహా వాక్యముల యొక్క సారాంశము.
"ప్రజ్ఞానం బ్రహ్మ" అన్నప్పుడు చైతన్యమే బ్రహ్మము. అనగా చైతన్య స్వరూపుడైన జీవుడే బ్రహ్మము అని అర్థము. ఆ జీవుడు పశుపక్ష్యాది జీవులు కాదని చెప్పుటకే "అహం బ్రహ్మాస్మి" నావలె మనుష్యుని గానే ఉండును. "అయమాత్మా బ్రహ్మ" వాడి వలె మనిషిగానే ఉండును. "తత్త్వమసి శ్వేతకేతో", ఓ శ్వేతకేతూ! నీ వలె మనిషిగానే యుండును. ఇక్కడ ఈ మూడు వాక్యములలో "వలె" అను ఉపమా వాచకము చెప్పబడలేదు. "అహమివ" నా వలె "త్వమ్ ఇవ" నీ వలె "అయమ్ ఇవ" వాడి వలె అని ఎందుకు చెప్పలేదు. "ఇవ అనగా వలె" అను శబ్దము ఎందుకు లేదు. ఈ కారణముగా ఈ మహా వాక్యములకు అపార్థము తీసి "నేను బ్రహ్మము, వాడు బ్రహ్మము, నీవు బ్రహ్మము" కావున మానవులందరు బ్రహ్మములే అని వ్యాఖ్యానించుకున్నారు. అలంకార శాస్త్రము యొక్క జ్ఞానము పరిపూర్ణముగా లేనందున ఈ అపార్థము వచ్చినది. ఉపమాలంకారములో “ఇవ” అను వాచకము లోపించినపుడు ఆ అలంకారము "లుప్తోపమ" అనబడును. అవతరించిన పరమాత్మయగు శ్రీరాముడు ఎలా ఉంటాడు అన్నప్పుడు నా వలె, వాడి వలె, నీ వలె ఉంటాడు అని చెప్పునపుడు ఉపమాలంకారమనబడును. కాని దీనినే లుప్తోపమాలంకారముతో చెప్పినపుడు శ్రీరాముడు అచ్చము ఆకారములోను, ప్రవర్తనలోను మామూలు మనుష్యునిగనే ఉండును అని చెప్పదలచినపుడు లుప్తోపమలో ఇట్లు చెప్పవచ్చును. "అచ్చము నేనే" "అచ్చము వాడే" "అచ్చము నీవే". దీని అర్థము ఉపమానమైన మానవులు ఉపమేయమైన శ్రీరాముడు ఒక్కరే అని కాదు. కావున బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య చాలా కష్టమైనది.
పరమాత్మ నరాకారమున రాముడిగా అవతరించినపుడు ఆకారములోనే కాక ఎట్టి మహిమలను చూపక సామాన్య మానవుని ప్రవర్తనతో ఉన్నాడు. కావున కోటాను కోట్ల మానవులలో ఏ మానవుడు పరమాత్మ అని తెలుసుకొనుట చాలా కష్టము. సాగర లంఘనము, సంజీవి పర్వతమును తెచ్చుట మొదలగు మహిమలను హనుమంతుడు చేసినాడు. లక్ష్మణుడు మూర్ఛపోవగా రాముడు ఏడ్చుచున్నాడు. హనుమంతుడు సంజీవి పర్వతమును తెచ్చు ఈ సన్నివేశమును మనము చూచినప్పుడు మనము హనుమంతుడు దేవుడు, రాముడు జీవుడు అని అనుకుంటున్నాము. కాని హనుమంతుడే రాముడు దేవుడని భజన చేయుచున్నాడు. కావున రాముని భగవంతునిగా గుర్తించుట ఎంత కష్టమైన విషయమో ఆలోచించుడు. అందుకే బ్రహ్మ జ్ఞానము లేక బ్రహ్మ విద్య చాలా కష్టమైనది.
రాముడు జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు షోడశ కళ్యాణ గుణములతో స్వస్వరూపమున ఉన్నాడు. సిద్ధులు లేక శక్తులు అను సొమ్ములు లేవు. ఆ సొమ్ములే గుర్తులైనచో మహిమలను ప్రదర్శించిన రావణుని పరమాత్మగా ఋషులు ఏల అంగీకరించలేదు? మహిమయనగా శక్తి. నీ శక్తిని మరియొకరికి అందచేయవచ్చును. నీవు బాగా వంట చేయుదవు. ఈ వంట చేయు శక్తిని మీ అమ్మాయికి నేర్పించి ఆ శక్తిని అందచేయ వచ్చును. కాని నీ యొక్క రూపమును మీ అమ్మాయికి అందచేయగలవా? నిన్ను గుర్తించుటకు నీ రూపమే గుర్తు. నిన్ను గుర్తించుటకు నీ వంటశక్తియే గుర్తు అయినచో నీవలె వంట చేసిన మీ అమ్మాయి నీవే అన్నట్లున్నది. కావున స్వస్వరూపమున ఉన్న పరమాత్మను చాలా మంది గుర్తించ లేకపోయినారు. రాముడు ఒక రాజు మాత్రమే అని తలచినారు. కాని బ్రహ్మ విద్యను తెలిసిన పూర్ణ బ్రహ్మజ్ఞానులగు దండకారణ్య బ్రహ్మర్షులు మరియు వారితో సమానుడైన హనుమంతుడును రాముని పరమాత్మగా గుర్తించినారు. కావున రామావతారము అత్యుత్తమ సాధకులకు మాత్రమే పరిమితమైనది. వారు తరించినారు. మిగిలిన సామాన్యులు తరించలేదు. వారు కిరీటము ఉన్ననే రాజు అని గుర్తించిన బాలురు, కిరీటము లేకున్ననూ రాజును గుర్తించగల రాణి వంటి జ్ఞానులు కారు. కావుననే కృష్ణావతారము కొన్ని మహిమలను చేసి సామాన్యులను కూడా ఆకర్షించి ఉద్ధరించుటకు ప్రయత్నించినది.
★ ★ ★ ★ ★
Also Read
Do Liberated Souls Identify God In Human Form Directly?
Posted on: 11/06/2021How Can A Human Incarnation In The Human Form Be Considered As God?
Posted on: 09/04/2023What Is The Difference Between The Lord In Human Form And A Demon In Human Form?
Posted on: 03/02/2005
Related Articles
Message On Datta Jayanti - Part-1
Posted on: 26/12/2004How Can Any Person Who Knows Himself To Be A Brahman Become Everything?
Posted on: 08/02/2023The Unimiginable Parabrahman: Lakshmana Gita - Iii
Posted on: 17/12/2003The Unimiginable Parabrahman: Lakshmana Gita - Iv
Posted on: 17/12/2003