home
Shri Datta Swami

 27 Sep 2024

 

Telugu »   English »  

ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగాని నన్ను గుర్తించలేరు

“బహూనాం జన్మనామన్తే” అనగా ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగాని నన్ను గుర్తించలేరు అనియు "యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః"" అనగా అష్టసిద్ధులు సంపాదించినను, ఎట్టి అహంకారమును పొందక నా కొరకు సాధన సాధించు ఏ ఒక్కడో నన్ను గుర్తించును అని గీత చెప్పుచున్నది. అసలు బ్రహ్మమును గుర్తించు బ్రహ్మవిద్యలో అంత కష్టము ఏమున్నదని ఎవరికైనను సంశయము రావచ్చును.

కొందరు బ్రహ్మము నిరాకారమైన, సర్వవ్యాపకమైన చైతన్యమనుచున్నారు. చైతన్యము కాంతి వలె ఒక శక్తిస్వరూపము. పట్టపగలు కాంతి ఎట్లు సమస్తలోకములను వ్యాపించి యున్నదో, అట్లే చైతన్యము అను శక్తి ఈ సమస్తవిశ్వమును వ్యాపించియున్నది. ఇది అర్థము చేసుకొనుటలో పెద్ద కష్టమేమున్నది? ఎంత పామరుడైనను అయిదు నిమిషములు ఆలోచించినచో, ఇది అర్థమగుచునే ఉన్నది. పదవతరగతి ఫిజిక్సు చదివిన విద్యార్థి ఈ విషయమును ఒకే నిమిషములో అర్థము చేసుకొనగలడు. దీని కొరకు ఎన్నో జన్మలు ఎందుకు?

మరికొందరు పరబ్రహ్మము అనగా ఈ విశ్వమును కూడ అత్రికమించిన విరాట్పురుషుని ఆకారము అనియు, ఈ జగత్తు ఆయన ధరించిన ఒక వస్త్రము వంటిది అనియు, ఆయన ఈ విశ్వములో అంతర్యామిగా ఉన్నాడనియు చెప్పుచున్నారు. ఇది ఇంకను సులభము. పామరుడు కూడా మూడు నిమిషములలో అర్థము చేసుకొనగలడు.

Swami

మరికొందరు పైలోకములో వైకుంఠములో నారాయణునిగాను, కైలాసమున పరమశివునిగాను, సత్యలోకమున హిరణ్యగర్భుని గాను పరబ్రహ్మ ఉన్నాడని చెప్పుచున్నారు. ఇది మరింత సులభము. పామరుడు ఒక్క నిమిషములో అర్థము చేసుకొనగలడు. కావున ఈ సిద్ధాంతముల ప్రకారము బ్రహ్మవిద్య కష్టము కాదని తేలుచున్నది.

శ్రుతులు కూడ పరబ్రహ్మము తర్కమునకు, ఊహకు సైతము అందడు అనియు, దేవతలు కూడ అర్థము చేసుకొనలేరనియు చెప్పుచున్నవి. కావున వీరు చెప్పు సిద్ధాంతములేవియు బ్రహ్మవిద్యకు అర్థము కావని తేలుచున్నది.

కావున బ్రహ్మవిద్య అనగానేమి? అది అంత కష్టముగా ఎందుకు ఉన్నది? దీనికి సమాధానము భగవద్గీతయే చెప్పుచున్నది. "బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ స్సర్వమితి  స మహాత్మా సుదుర్లభః " అను శ్లోకమే బ్రహ్మవిద్యను గురించి చెప్పుచున్నది. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ వాసుదేవుడు పరబ్రహ్మము అని గుర్తించి పరిపూర్ణముగా విశ్వసించిన మహాత్ముడు ఎక్కడునూ దొరకడు. అనగా దేవకి గర్భమున పుట్టి యశోద చేత పెంచబడి అందరి నరులలో ఒక నరుడుగా ప్రవర్తించుచున్న ఈ వాసుదేవుడే పరబ్రహ్మమని గుర్తించుట చాలా కష్టము అని అర్థము.

ఇచ్చట ‘వాసుదేవ’ శబ్దము ప్రతి నరాకారమును గురించి చెప్పుచున్నది. కేవలము కృష్ణావతారమును గురించే కాదు. ఏలననగా అధర్మము తల ఎత్తినపుడల్లా మనుష్యరూపములో నేను అవతరిస్తానని "తదాత్మానం సృజామ్యహమ్‌", "మానుషీం తనుమాశ్రితమ్‌" అని తరువాత గీతాశ్లోకములు చెప్పుచున్నవి. నరులలో ఒక నరునిగా అవతరించి ఇతర నరుల వలె ప్రవర్తించుచున్న నరవేషియగు నారాయణుడిని గుర్తించుట చాలా కష్టము. ఇట్లు నరులలో అవతరించిన వానిని గుర్తించుట దేవతలకూ కష్టమే అగుచున్నది. ఏలననగా దేవతల కన్న నరులు చాలా తక్కువవారు. కావున వారు నరులను చులకనగా చూతురు.

యాదవవంశములో పుట్టి నరవేషియగు నారాయణుని గుర్తించక ఇంద్రుడు ఏడు రోజులు వర్షమును కురిపించినాడు. ఋషులు సైతము భ్రమలో పడుదురు. ఉదంక మహర్షి కృష్ణుని శాపము పెట్టుటకు పూనుకొనినాడు. "అవజానన్తి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితమ్‌" "మమ భూత మహేశ్వరమ్‌" అనగా నరవేషమున నున్న నారాయణుని గుర్తించుటలో దేవతలు ఋషులు సైతము మూఢులై ఆయనను అవమానించుటకు పూనుకొందురు అని అర్థము. ఇప్పుడు చూచితిరా! బ్రహ్మవిద్య ఎంత కష్టమో. అందుకే శ్రుతి, "బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి" అనగా బ్రహ్మమును గురించిన గుర్తింపు బ్రహ్మమునకే ఉండును అని చెప్పినది.

అక్రూరుడు, విదురుడు, భీష్ముడు, పార్థుడు, గోపికలు వంటి మహా మహా భక్తులు కూడ ఒక్కొక్క క్షణములో జారిపోయినారు. ఒక్కక్షణము కూడా జారిపోకుండా నిలబడినది రాధ మాత్రమే. అందుకే ఒకానొక జీవుడు మాత్రమే "కశ్చిన్మాం వేత్తి తత్త్వతః" అని స్వామి గీతలో చెప్పియున్నాడు. ఆమె తన్ను తానే మరచిపోయినది. అనగా "నేను" అను సాత్త్విక అహంకారము కూడ లయమైనది.

అహంకారము మూడు విధములుగా యుండును. “నేను” అను జ్ఞానము మాత్రమే స్వరూపముగా చైతన్యాత్మకమయమైన భావమే సాత్త్వికాహంకారము. ఇందులో “నేను” అను శబ్దమునకు ఆత్మ అని అర్థమే మిగిలియుండును. ఈ చైతన్యాత్మయగు జీవుడు శరీరమును వదలిపోయినను, తనను తాను “నేను”, “నేను” అనుకొనుచుండును. కావున మరణించిననూ పోనిదే ఈ సాత్త్వికాహంకారము.

ఇంక ఈ శరీరమును నేను అనుకొనుట రాజసాహంకారము. నేను ఎర్రగా ఉన్నాను అనుచున్నాడు. ఎర్రగా ఉన్నది శరీరము. ఈ శరీరముతో “నేను” ఏకీభవించుటయే రజోగుణము. ఈ శరీరము అగ్నిలో దగ్ధమగుననియు, అప్పుడు దగ్ధము కాకుండా బయటకు వచ్చు ఆత్మయే "నేను" అను శబ్దమునకు అర్థము అని తెలియదు, కావున రజోగుణము అజ్ఞానమే. సాత్త్వికగుణము జ్ఞానము. ఏలననగా నశించని చైతన్యాత్మ "నేను" అనుకొనుట జ్ఞానమే కదా! అది సత్యమే గదా!

ఇక తనకు తోడుగా ఉన్న ధనము, బంధువులు మొదలగు వానిని "నేను" అనుకొనుట తమోగుణము. సాత్త్వికాహంకారములో "నేను" అనునది నిలచినంతవరకు చైతన్యము పరిమితమై ఒక ఖండముగా ఉండును. ఎప్పుడు ఈ "నేను" అన్న సాత్త్వికాహంకారము కూడ నశించునో, అప్పుడు ఈ చైతన్యఖండమైన ఆత్మ, పరమాత్మ యొక్క చైతన్యము నందు లయించిపోవును. అప్పుడు "నేను" అను శబ్దము కేవలము పరమాత్మ చైతన్యమునకు మాత్రమే మిగిలిపోవును. ఇదే శంకరాచార్యుల వారి తరువాత రమణమహర్షి చేసిన “నేను” అను శబ్దము యొక్క జిజ్ఞాస.

ఈ విధముగా ఎవరు స్వామి సేవలో పాల్గొని తనను తాను మరచిపోవునో అప్పుడు ఆ జీవుడు పరమాత్మతో కైవల్యమును పొందును. కొందరు గంజాయి మొదలగు మత్తుపదార్థములను వాడి ఈ "నేను" ను మరచిపోవుచున్నారు, కాని ఇది కైవల్యము కాదు. గంజాయి మత్తు దిగగానే ఈ "నేను" మరల ఉద్భవించుచున్నది. గాఢనిద్రలో కూడ "నేను" లయించుచున్నది. కాన గాఢనిద్ర కైవల్యము కాదు.

కావున కేవలము రాధ మాత్రమే నిజమైన కైవల్యము పొందినది. కావున నరాకారములో నిజమైన పరబ్రహ్మమును గుర్తించుటయే నిజమైన బ్రహ్మవిద్య. ఆ గుర్తింపుకే అనేక బాలారిష్టములున్నవి. ఆయన ఆశ్రయించిన నరశరీరము అన్ని నరశరీరములవలె ప్రకృతిధర్మములకు లోబడియుండును. మనవలె ఆయనకు కూడ క్షుత్పిపాసలు, దగ్గు, రొంప వచ్చుచుండును. ఈ బాహ్యలక్షణములను చూచి చాలామంది మోసపోవుదురు. ఒకవేళ గుర్తించినను ధర్మమును తప్పిన నడకతో గోచరించుచుండును. ఆ దెబ్బతో గుర్తించిన వారు కూడ అరటితొక్కపై కాలుపడినట్లు జారిపోవుచుందురు.

ఆయనను గుర్తించు లక్షణములు కూడ ఎంతో తికమకగ ఉన్నవి. సిద్ధులు గుర్తుగా పెట్టుకున్నచో రాక్షసులు, క్షుద్రమాంత్రికుల వలలో పడుదురు. జ్ఞానమును గుర్తుగా పెట్టుకున్నచో పండితుల వలలో చిక్కుకొందురు.

పండితులు చెప్పు జ్ఞానము బ్రహ్మానుభూతిని కలిగించలేదు. ఆయన యొక్క కల్యాణగుణములలో కొన్ని కొన్ని గుణములు భక్తుల వద్ద కూడ కనిపించుచుండును. భగవంతుని నుండి భక్తులను వేరుచేయుట చాలా కష్టముగా యుండును. ఏలననగా సత్యభక్తులను భగవంతుడు ఆవేశించి యుండును. అయితే ఒక కార్యార్థమై భగవంతుడు భక్తులను ఆవేశించును. ఆ కార్యము ముగియగనే, భగవంతుడు భక్తులనుండి తొలగిపోవును. భక్తుడు, మునికుమారుడైన పరశురాముని విష్ణుభగవానుడు ఆవేశించి సర్వక్షత్రియ సంహారమును చేసెను. ఆ కార్యము ముగియగనే పరశురాముని నుండి తొలగిపోయెను. కావున ఇట్టి మహాభక్తులను నరావతారముల నుండి వేరుచేయుట కష్టము.

ఒక్కొక్కసారి నరావతారుడగు స్వామి తన శక్తిని భక్తుని ద్వారా ప్రయోగించి వారి సాయమును తాను పొందుచు వారికి భగవంతునిగా కీర్తినిచ్చి తాను భక్తుని స్థానమున ఉండి నటించుచుండును. సంజీవి పర్వతమును హనుమంతుడు తెచ్చి లక్ష్మణుని బ్రతికించి, రాముని శోకమును పోగొట్టెను. రామశక్తి వలననే హనుమంతుడు సంజీవిని తెచ్చెను. చూచువారికి హనుమంతుడే భగవంతుడు, రాముడే భక్తుడిగ తోచును. ఇట్టి మాయలను తప్పించుకొని ఆయనను గుర్తించుట చాలా కష్టము.

గోటిచుట్టుపై రోకలి పోటు అన్నట్లు, వెన్నముద్దలు దొంగిలించుచూ, గోపికల వెంటబడుచు, అందరి విమర్శలకు గురియగుచు భక్తుల కండ్లకు మాయపొరలను కప్పుచుండును. దీనికి తోడు సాక్షాత్తు నారాయణుని నుండి అసలు శంఖ, చక్రములనే సంపాదించిన ఈ నకిలీ నారాయణుల నుండి జారచోరత్వాది మాయలచే గప్పబడిన సత్యనారాయణుని గుర్తించుట చాలా కష్టము. సత్యనారాయణ వ్రతములో అంతరార్థమిదే. సత్యనారాయణ వ్రతములో గోవిందాది కృష్ణ నామములే ఉన్నవి. అనగా ఈ నరులలో సత్యమైన నారాయణుని గుర్తించి జారిపోకుండా గట్టిపట్టుతో దీక్షను పూనినవాడే నిజముగా సత్యనారాయణ వ్రతము చేసినవాడు.

ఈ విధముగా గొర్రెలలో కలసిపోయి గొర్రతోలు కప్పుకొని గొర్రె స్వరముతో అరచుచు గొర్రెలలో కలసిపోయిన పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. గొర్రెలకన్న వేరుగా నున్న పులిని గుర్తించుటలో కష్టమేమున్నది? కావున జీవునికన్న భిన్నముగా వున్న భగవంతుని గుర్తించుటలో కష్టము లేదు. అన్ని గొర్రెలను పులియే అన్ననూ కష్టము లేదు. ప్రతి గొర్రెయును పులియే గదా. కావున సర్వజీవులను బ్రహ్మమే అన్నప్పుడు కష్టము లేదు. కావున ఇటువంటి అతితెలివి సిద్ధాంతముల భ్రమల నుండి బయటపడి గొర్రె వేషముతో గొర్రెలలో కలిసిపోయి గొర్రెగా ఉన్న పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. కావున నరవేషముతో నరులతో కలసిపోయిన నారాయణుని గుర్తించుటయే మహా మహా కష్టము. కావున అనేక జన్మలు పట్టును.

నరావతారమున ఉన్న రాముని గుర్తించి పూర్తిగా విశ్వసించిన హనుమంతుడును, అట్లే నరావతారమున ఉన్న కృష్ణుని గుర్తించి పరిపూర్ణముగా విశ్వసించిన రాధయును, వీరిరువురే బ్రహ్మవిద్యను పూర్తిగా తెలిసిన బ్రహ్మజ్ఞానులు.

★ ★ ★ ★ ★

 

Also Read



How Can God Have A Form?

Posted on:  23/02/2021

What Is The Real Spiritual Effort?

Posted on:  09/09/2024


Related Articles

Narayana

Posted on:  19/03/2006

Spiritual Concepts In Brief

Posted on:  18/09/2006


Message On Datta Jayanti - Part-1

Posted on:  26/12/2004

God, Medium And Worship

Posted on:  12/06/2007

 
 whatsnewContactSearch