
10 Sep 2024
[25-01-2003] సీతాదేవి 18 సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను. పంచవటిలో 3 సంవత్సరములు దండకారణ్యములో పది సంవత్సరములు రామునితో కలసియే ఉన్నది. అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది. యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరల స్వామి సన్నిధికి దూరమైనది. చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగ దూరమైనది. ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఏల దూరము కావలసివచ్చినది. ఆమె మహా పతివ్రత. ఇచ్చట పతి శబ్దము స్వామిని చెప్పును. ఆమె విషయములో స్వామియు భర్తయు ఒక్కరే. దీనికి కారణము అగు కర్మ లేకుండా ఫలము సంభవించదు. ఆమె కొన్ని భగవదపచారములను చేసినది. కాని స్వామి వాటిని లెక్కించలేదు. అవియేమనగా

1) అరణ్య వాసమునకు పోవునపుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి. ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచు రాధకు ఇచ్చినాడు. రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనములోనే ఉండిపోయినది. కాని సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది. అప్పుడు ఆవేశములో స్వామిని నిందించినది కూడ. స్వామిని “స్త్రియం పురుష విగ్రహమ్" అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా? నా తండ్రి జనకుడు పురుష వేషములో యున్న ఒక స్త్రీకి నను ఇచ్చి పెళ్ళి చేసినాడని దూషించినది. దీనికి కూడ స్వామి కోపగించలేదు. ఏలననగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును. ఇదే గీతలో "తుల్య నిందా స్తుతిః" అని చెప్పబడినది. పాయసము ఆనందమును కల్గించినట్లు ఆవకాయ అన్నము కూడా ఆనందము కల్గించును. కాన సుఖదుఃఖములు, మానావమానములు రెండు ఆనందకరములే. స్వామి విషయములో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును. ఏలననగా? ఆయన స్వస్వరూపములో యున్నపుడు దేవతలు ఋషులు నిరంతరము స్తుతించెదరు. కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను. అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైన తనను నిందించినపుడు పరమానందము చెందుచుండును. కాని ఆయన భాగవతాపచారమును సహించడు. భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు. జీవుడు అవమానమునకు దుఃఖపడును. ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు. లక్ష్మీదేవికి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు. ఆదిశేషునకు నిరంతరము ఆపాదమస్తక స్పర్శను శయనించి అనుగ్రహించినాడు. ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు. రాముని విడచి భరత శతృఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు. సీత లంకలో ఉండినప్పుడు కూడ లక్ష్మణుడు రామునితో ఉన్నాడు. మరల సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు. (ఫణి యొక్క గొప్పతనము తెలిసినదా ఇప్పటికైనా) లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు.
సీతయును భక్తుడగు జీవుడే. సీత యనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా యుండును. శేషుడనగా సర్పము. అది వంకర టింకరలుగా పోవుచుండును. నేరు మార్గమున వచ్చు భక్తులు, వంకర మార్గమున వచ్చు భక్తులను ఆక్షేపించగనే పతనము ప్రారంభమగును. సీతాదేవి లక్ష్మణునిపై ఘోరనింద వేసినది. ఇది భాగవతాపచారము. అందుకే స్వామి సంకల్పించి చాకలి వానిచే సీతపై నింద వేయించినాడు. నిందాకర్మకు నిందయే ఫలము. ఆమె లక్ష్మణును నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమై పోయినది. అంతటితో ఫలానుభవము ఆగలేదు. మరల రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది. స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్థిమితమును కోల్పోయినది. అందుకే చివరలో నీవు అయోధ్యా జనులకు మరల ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది. ఆ సమయములో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే. ఈ విధముగా భాగవతాపచారము వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది. ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడ వెంటపడినది. ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లి కొడుకుగా వచ్చి వియ్యాల వారి యింటిలో కూర్చునియున్నాడు. గౌరీపూజ సిద్ధమైనది. అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము. ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుని నిందించినప్పుడు ఎంత భాధపడినాడో అంత తపన పడినది. ఇంకనూ కొంత పాప శేషము మిగిలియున్నది. దానిని కూడా పోగొట్టుటకు, పెండ్లి తరువాత ఒకనాడు శ్రీకృష్ణుడు "మేము రాజులము కాము. శిశుపాలునే మరల పెండ్లి చేసికొమ్మని చెప్పగా రుక్మిణీ దేవి మూర్ఛపోయినది". ఇంకనూ చిట్టచివరి శేషము కొంత యున్నది. దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణీ దేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు. ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము, చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి. ఈ ఐదు భాగముల శిక్షలో ఒక భాగము మాత్రమే ఈ సీతను అడవులకు పంపించుట.
ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవుదురు. హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు. కావున స్వామి రాధనే ఆదరించినాడు. అట్లే సీత లక్ష్మణుని ఆక్షేపించినది. కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు. రాధ స్త్రీ అయినచో, లక్ష్మణుడు పురుషుడు. కావున స్వామికి స్త్రీ, పురుష వివక్షత లేదు. భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును. నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకొని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చెదరని దృష్టియే నిష్ఠ అనబడును. నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా, ఆ దైవ స్వరూపములోని అంతస్స్వరూపుడగు దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును. దత్తుడు ప్రకటింపబడు కొలది పరీక్షల తీవ్రత పెరుగును. సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును. దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు. దత్తపరీక్షలకు ఎంతో ఓర్పు కావలయును. అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్ట మొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు ఆచార్య భాష్యమున వచించియున్నారు. కావున నిష్ఠతో పాటు సబూరి అవసరమన్నారు. సబూరి యనగా ఓర్పు కావలయునని శిరిడి సాయి ఎల్లప్పుడు బోధించెడివారు. రాధ స్వామి ఆజ్ఞననుసరించి, ఎల్లప్పుడును బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతయును గడిపినది.
లక్ష్మణుడు కూడ పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు. అంతే కాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు. సీతను అడవులలో దింపి రమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు. ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు. లక్ష్మణుని నిందా పాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు. కావున స్వామిలో ఎప్పుడు ఎట్టి పొరపాటు కూడా ఉండదు. ఆయన చర్యలలోని అంతరార్థమును మనము గ్రహించ లేక చాలా సార్లు స్వామిని అపార్థము చేసుకొందుము. నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము. కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్థము. నిరాకారము కొరకు సాకారములగు ధన గృహములను, నరాకారములగు భార్యాపుత్రాదులను త్యజించుట హస్యాస్పదము. మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగ లభించుచున్న కాఫీ మొదలగు పానీయములను త్యజించెదమా? ఒక ప్రత్యక్ష పదార్థము కొరకు మరియొక ప్రత్యక్ష పదార్థమును త్యజించవచ్చును. ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఏల త్యజించ వలెను? ఒక గ్లాసులో అమృతము పోసి యిచ్చి త్రాగించి రుచి చూపినచో, నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని త్యజించును. అంతే కాని అమృతము ఉన్నది. దాని ఆకారము కూడ నాకు తెలియదు. దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడును త్యజించడు. త్యజించుటయు అవివేకము. కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు. ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును, పటమును ధ్యానించుచున్నాము. అది అచేతనమైన జడపదార్థము. జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడ చెప్పును. కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను త్యజించనేల?
కావున అచేతనములను ఆరాధించు సాకారమార్గములో కూడ వైరాగ్యము అర్థరహితమై యున్నది. దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడెను. దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియై దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారియై ప్రాణములను విడచినది. ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు. కాని స్వామి నరాకారమున అవతరించినప్పుడు స్వామి చేతనమైన నరాకారమైన సాకారమార్గములో ఉన్నాడు కావున స్వామి కొరకు అచేతనములైన గృహాదులను చేతనులైన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్థమున్నది. చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా. ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురుషోత్తముని కొరకు ఇతర నరులను త్యజించుట కూడా యుక్తమే అగును. పురుషుడనగా జీవుడు అని అర్థము కూడా ఉన్నది. "పురి" – దేహే "శేతే - పురుషః" అని అర్థమున్నది. అనగా పురము అనబడు దేహము నందు వ్యాపించి యుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్థము. కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురుషోత్తముడగు నరావతారములో యున్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను త్యజించుటలో అర్థమున్నది. కావున ఈ మార్గములోనే వైరాగ్యము సాధ్యము సార్థకము. ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును. అక్కలకోట మహారాజ్, శిరిడిసాయి ఒకే సమయమున ఉన్నారు. ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు. వాడు అసలు దత్తుడే కాదు. వాడిని మనము పరీక్షింప పనిలేదు. పరీక్ష ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు.
పౌండ్రక వాసుదేవుడు శంఖ చక్రములు ధరించి నేనొక్కడనే నారాయణావతారుడనని వాగినాడు. ఒకే సమయమున రెండు తీగెల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట, లైటును వెలిగించుట అను రెండు వేరు వేరు పనులను చేయుచున్నది. కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును. ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు. విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును. కాని రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును. ఈ చిత్రపటము సరియైనది కాదు. విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు. కావుననే ‘అనేక బాహూదర వక్త్ర నేత్రం’ అని సూచించినాడు. అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్త్రములు అనేక నేత్రములు అని అర్థము. ఇదే అర్థము సహస్రపాత్ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది. అనగా అనేక నరావతారములు అని అర్థము. అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా. కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు. అట్లు అయినచో పరశురామ, శ్రీ రామావతారములు ఒకే సమయమున ఎట్లున్నవి? కలియుగములో శ్రీ స్వామి సమర్థ (అక్కలకోట మహరాజ్) మరియు శ్రీ శిరిడిసాయినాథుడు ఒకే సమమయమున ఉన్నారు గదా. అట్లే వర్తమానములో శ్రీ సత్యసాయినాథుడు (పుట్టపర్తి), శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ (మైసూరు), శ్రీ దత్త స్వామి (ఆంధ్ర) ఒకే సమయములో ఉన్నారు గదా!
★ ★ ★ ★ ★
Also Read
Why Did Rama, Being Omniscient, Ask Sita To Prove Her Chastity?
Posted on: 25/03/2025'satsanga' Is Association With God
Posted on: 06/01/2009Divine Poem To Nikhil And Smt Devi
Posted on: 08/09/2018Please Explain The Devotion Of Sati Devi And Hanuman.
Posted on: 04/03/2024
Related Articles
Nobody Will Be Punished Unnecessarily In God’s Constitution
Posted on: 15/12/2017Swami Answers Questions Of Smt. Lakshmi Lavanya
Posted on: 18/10/2025If I Say That God Is Mine, Is It Selfishness?
Posted on: 23/11/2022Victory Of Knowledge Over Ignorance
Posted on: 24/10/2012Act Out Of Analysis; Not Emotion
Posted on: 13/04/2019