
26 Sep 2024
[28-01-2003] హిందూమతమున ప్రధానముగా మూడుమతములు ఉన్నవి. అవియే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము. హిందూమతము ఒక మానవ శరీరము వంటి పిండాండము. పిండాండమే బ్రహ్మాండమని పండితులు చెప్పుదురు. పిండాండమైన నరశరీరములో ఉన్న పదార్థములే బ్రహ్మాండమున ఉన్నవి. జడమైన పంచభూతములు అనబడు అపరాప్రకృతి, చైతన్యమగు పరాప్రకృతి రెండింటిలోను తత్త్వములే సమానముగా ఉన్నవి. కావున హిందూమతమును పోలి విశ్వమతములు ఉన్నవి.
భారతదేశము పిండాండమైనచో ఈ భూమి అంతయు బ్రహ్మాండము. ఈ భూమియగు ప్రపంచములో కూడా ముఖ్యమైన మతములు మూడున్నవి. హిందూమతము, క్రైస్తవమతము, ఇస్లాంమతము. హిందూమతములోని అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములలో ఏకత్వమును చూడలేని వాడవు హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతములలో ఏకత్వము ఎట్లు చూడగలవు? ఉట్టికే ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా? శంకర, రామానుజ, మధ్వాచార్యుల భాష్యములలో ఏకత్వమును చూడలేనప్పుడు భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథములలో ఏకత్వమెట్లు చూడగలవు? నీ ఇంటిలో ఉన్న మూడుగదుల మధ్య గోడలు పగులగొట్టి ఒక్క హాలును చేయలేని వాడవు, మూడు ఇండ్ల మధ్యనున్న గోడలను పగులగొట్టి ఒక్క ఇంటిగా ఎట్లు మార్చగలవు?
హిందూమతములో ఉన్నన్ని వేదాంత గ్రంథములు శాస్త్రములు నిజముగా ఏ మతములోను లేవు. అనగా హిందూమతములో సత్యమును దర్శించుటకు కావలసిన సామాగ్రి ఎంతో ఎక్కువగా యున్నది. ఇంత సాధనసామాగ్రితో నీవే సత్యమును కనుగొనలేనప్పుడు ప్రపంచములో మిగిలినజీవులు సత్యమును కనుగొనగలరా? అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతపండితులు కలహించుకొనుచుండగా ప్రపంచములో కల సర్వమతస్థులు కలహించుకొనుటలో ఆశ్చర్యమేమున్నది. వీరశైవులు శివుడే దైవమందురు. వీరవైష్ణవులు విష్ణువే దైవ మందురు. శాక్తేయులు శక్తియే దైవమందురు. ఈ కలహములకు భయపడి బ్రహ్మదేవుడు తనకు గుడి లేకుండా చేసుకున్నాడు. దీనిలో అంతరార్థమేమి?

బ్రహ్మదేవునిలో ‘బ్రహ్మ’ శబ్దమున్నది. బ్రహ్మము అనగా సాక్షాత్తు పరబ్రహ్మమే. ఆయన వేదకర్త. అనగా జ్ఞానస్వరూపుడు మరియు ఆయన జిహ్వపై వాణి యున్నది. అనగా వాక్కుతో జ్ఞానముతో బోధించు గురుస్వరూపుడు. అనగా సాక్షాత్తు దత్తుడే. అనగా ఈ కలహములను చూచి అసలు వ్యక్తియగు దత్తుడు జారిపోయినాడు. ఆయన యొక్క వేషములే విష్ణువు, శివుడు, శక్తి. కావున వీరశైవులకు మిగిలినది శివుడను పేరుగల కేవలము శివవేషమే. వీర వైష్ణవులకు దక్కినది విష్ణువను పేరుగల విష్ణువేషమే. అట్లే శాక్తేయులకు చిక్కినది అమ్మవారి యొక్క వేషమగు చీరె, అలంకారములు కిరీటము మాత్రమే. మూడువేషములలో ఉన్న వ్యక్తిని కనుగొనలేనప్పుడు కేవలము వేషము పైననే నీ దృష్టి ఉన్నప్పుడును నటుడగు వ్యక్తి జారిపోవును. కావున ప్రపంచములో మూఢ మతకలహములు చేయువారి దైవస్వరూపములు కూడ కేవలము వేషమాత్రముగనే మిగులును.
ఒక ఉపాధ్యాయుడు ఒకే పాఠమును అనగా సిలబస్‌ను ఇంగ్లీషుభాషలో ఇంగ్లీషుమీడియం సెక్షనులో, ప్యాంటు షర్టు వేసుకొని వచ్చి చెప్పుచున్నాడు. అదే ఉపాధ్యాయుడు అట్లే పాఠమును తెలుగుభాషలో తెలుగుమీడియం సెక్షనులో ధోవతి చొక్కాను ధరించి బోధించుచున్నాడు. ఈ రెండుసెక్షనులలో వ్యక్తిపై దృష్టి లేక కేవలము వేషమునందు దృష్టియున్న విద్యార్థులు మా ఉపాధ్యాయుడు గొప్ప అంటే మా ఉపాధ్యాయుడు గొప్ప మరియు మా పాఠము గొప్ప అంటే మా పాఠము గొప్ప అని వాదించుకొనుచున్నారు. కాని రెండు సెక్షనులలో కొందరు తత్త్వమును పరిశీలించగల ఏకాగ్రతతో ఉన్న బుద్ధిమంతులగు విద్యార్థులు మిగిలిన విద్యార్థులతో ఈ విధముగా చెప్పుచున్నారు.
ఓ విద్యార్థులారా! మీరు ఏల కలహించుచున్నారు? ఒకే ఉపాధ్యాయుడు ఆయా భాషలకు తగిన వేషములలో వచ్చి ఆయా భాషలలో విద్యను బోధించియున్నాడు. ఉన్నది ఒక ఉపాధ్యాయుడే కాని వేషములు రెండు. చెప్పినదీ ఒక్క పాఠమే. కాని భాషలు రెండు. మీరు మీ ఉపాధ్యాయుల వేషముపై దృష్టి ఉంచక ఉపాధ్యాయుని యొక్క స్వరూపమును నిశితముగా పరిశీలించుడు. మీకు సత్యము తెలియును. అట్లే మీలో రెండుభాషలు వచ్చు విద్యార్థి ఎవరైనను ముందుకువచ్చి రెండుపాఠములను చదివి చూడుడు. అప్పుడు మీరు ఒకే ఉపాధ్యాయుడు ఒకే పాఠము అను విషయము బోధపడును.
దీనిని ప్రపంచమునకు చాటి చెప్పినవాడే స్వామి వివేకానందుడు. ఆయన ఒక్కొక్క మతస్థుడగు వీరాభిమానిని ఒక్కొక్క బావి నుండి వచ్చిన బావికప్పగా వర్ణించినాడు. వేషాలు వేరు దేవుడొక్కడే. భాషలు వేరు బోధింపబడిన తత్త్వము ఒక్కటే అని ఘోషించినాడు. కావున శ్రీదత్తుడు ఒక్క హిందూమతమునకు సంబంధించినవాడు కాడు. ప్రపంచములో యున్న సర్వమతముల దైవస్వరూపములగు వేషములలో ఉన్న ఒకే ఒక నటుడు శ్రీగురుదత్తుడు.
అన్ని మతగ్రంథములు ఆయన యొక్క పాఠములే. ఆయా దేశములకు అనుకూలమైన వేషములలో నుండి ఆయా భాషలలో ఒకే సిలబస్‌ను బోధించినవాడు. అయితే ప్రతి దేశములోను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీలు ఉన్నవి. అట్లే ప్రతి దేశములోను అధమ, మధ్యమ, ఉత్తమ స్థాయిలలో సాధకులగు జీవులు ఉన్నారు. కావున ప్రతి మతములోను ఆ మతములో వివిధ దశలలో ఉన్న సాధకుల దశలననుసరించి వివిధ పాఠములున్నవి.
అన్ని దేశములలోను హైస్కూలు విద్యార్థులకు ఒకే సిలబస్ ఉన్నది. అట్లే అన్ని దేశములలో కాలేజి స్థాయి విద్యార్థులకు ఒకే స్థాయి సిలబస్ ఉన్నది. అట్లే అన్ని దేశములలోను యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకును ఒక స్థాయి సిలబస్ ఉన్నది. ఒకే దేశములో ఒకే భాషలో బోధించబడుచున్నను హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ సిలబస్‌లు వేరు. మన హిందూమతములో త్రిమతముల పండితులు కలహించుకొనుట మన ఊరిలో హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ విద్యార్థులు కలహించుకొనుట వంటిది. మరియు మనరాష్ట్రములో హైస్కూలు విద్యార్థులు, పరరాష్ట్రములో హైస్కూలు విద్యార్థులు సిలబస్ ఒక్కటేయని తెలియక కలహించుకొనుచున్నారు. కావున భాష ఒక్కటే అయినను సిలబస్ తేడా వలన మన ఊరిలో విద్యార్థుల కలహము, సిలబస్ ఒక్కటియే యైనను భాషలో తేడా వలన మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్థులు, పరరాష్ట్రములో హైస్కూలు విద్యార్థులు కలహించుకొనుట జరుగుచున్నది.
ఇది చాలక మరియొక కలహమున్నది. మన రాష్ట్రములో హైస్కూలు విద్యార్థికి పరరాష్ట్ర భాష వచ్చును. ఐతే వీడు ఈ రాష్ట్ర హైస్కూలు సిలబస్ పరరాష్ట్ర కాలేజి సిలబస్‌తో పోల్చి ఈ రాష్ట్రములో విద్య లేదు ఆ రాష్ట్రములో విద్య లేదు అని కలహించుచున్నాడు. ఈ కలహములు ఎప్పుడు పోవును? అన్ని మతములలోను అధమ, మధ్యమ, ఉత్తమ స్థాయిలలో సాధకులున్నారు. ఒక మతములో అధమస్థాయి వారికి సంబంధించిన బోధన విషయములకు మరియొక మతములో అదే అధమస్థాయికి చెందిన సాధకుల యొక్క విషయమును పోల్చి చూచినచో ఒక్కటియే అని తేలును. ఇట్లే మధ్యమ, ఉత్తమ స్థాయిల వారు కూడ వారి వారి స్థాయి విషయములను మాత్రమే అన్ని మతములలో పోల్చుకున్నచో ఏకత్వమును దర్శించి అన్ని మతముల పాఠ్యాంశములు ఒక్కటే యని తేల్చుకొనవచ్చును.
ఇట్లు తేల్చి వివరించి నిరూపించుటయే ఈ జ్ఞానసరస్వతి యొక్క ముఖ్యలక్ష్యము.
మన హిందూమతములో ఉన్న హైస్కూలు, కాలేజి, యూనివర్సిటీ స్థాయిలే అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతమతములు. అద్వైతములో శంకరులు చెక్కిన మొదటిమెట్టైన జ్ఞానము ‘హైస్కూలు’ విద్య వంటిది. హైస్కూలు విద్య లేనిదే కాలేజి, యూనివర్సిటీ విద్యలు లభించవు. కావున హైస్కూలువిద్య తక్కువ అని భావించరాదు. కావున జ్ఞానము మూలకారణము. ఆ తరువాత విశిష్టాద్వైతములో రామానుజులు చెప్పిన భక్తి, భగవంతుని చేర్చు ప్రాప్తికారణమగు రెండవమెట్టుయగు ‘కాలేజి’. ఆ భగవంతుని పొందిన తరువాత నీవు క్రియలో నిరూపించు సత్యమైనభక్తియే సేవయనబడు మూడవమెట్టు అగు అత్యుత్తమమైన ‘యూనివర్సిటీ’గా ద్వైతమున మధ్వులు చెప్పినారు. క్రియలేని భావము, వాక్కు వ్యర్థములు. అసత్యములు. జ్ఞానము, భక్తి క్రియలో ఉన్నదా లేదా అని పరీక్షించుటయే దత్తపరీక్ష.
★ ★ ★ ★ ★
Also Read
If There Is One God Then Why Are There So Many Religions?
Posted on: 04/03/2021Monism And The Vedantic Unification
Posted on: 15/07/2019Can We Use All The Religions In Our Spiritual Effort?
Posted on: 07/02/2005
Related Articles
How Does The Conversion Of A Person From One Religion To Another Become A Sin?
Posted on: 02/07/2024World Peace And Removal Of Terrorism
Posted on: 10/09/2003What Is The Fate Of Terrorists And How To Turn Them To Spiritual Side?
Posted on: 23/01/2016Unity Of Religions In The Universe
Posted on: 09/01/2003